Wednesday, December 6, 2023

పాక్ విధానాలు యావత్ ప్రపంచానికే ముప్పు

- Advertisement -
- Advertisement -
Pak policies are threat to whole world says india
ఐరాస వేదికగా పాక్‌ను ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటలను ఆర్పే వ్యక్తిగా నటిస్తోంది’ అని భారత్ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ దుర్నీతి వల్ల యావత్ ప్రపంచం ఇబ్బందులను ఎదుర్కొంటోందని తేల్చి చెప్పింది. ఐక్య రాజ్య సమితిలో చేసిన ప్రసంగంలో పాక్ ప్రధాని కశ్మీర్ అంశాన్ని లేవనెత్తినదానికి జవాబిస్తూ భారత్ వ్యాఖ్యలు చేసింది. ‘ పాకిస్థాన్ ప్రధాని భారత అంతర్గత వ్యవహారాలను లేవనెత్తారు. తద్వారా ఈ వేదిక ప్రతిష్ఠను తగ్గించారు. ఈ క్రమంలో వారికి బదులిచ్చే హక్కును వినియోగించుకుంటున్నాం. ఓ అంతర్జాతీయ వేదికపై అవాస్తవాలతో విషం చిమ్మే ప్రయత్నం పాక్ చేస్తోంది. అందుకే నిజాలను ప్రపంచం ముందుంచాలనుకుంటున్నాం. పైగా పదేపదే అవాస్తవాలను వల్లెవేస్తున్న నాయకుడి మానసిక స్థితిపై మనమంతా జాలి చూపాల్సి ఉంది. తనని తాను ఉగ్రవాద బాధిత దేశంగా పాక్ చెప్పుకుంటోంది.

ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటలను ఆర్పే వ్యక్తిలాగా పాక్ నటిస్తోంది. వారి విధానాల వల్ల యావత్ ప్రపంచం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పాక్‌ను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా ఈ ప్రపంచం చూస్తోంది. పైగా వారి దేశంలోని వేర్పాటువాద ఉద్యమాలను ఉగ్రవాద చర్యలుగా చిత్రీకరిస్తోంది’ అని ఐరాసలోని భారత దౌత్య ప్రతినిధి స్నేహ దూబే దీటుగా సమాధానమిచ్చారు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిని ఈ సందర్భంగా భారత్ ప్రస్తావించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ మారణ హోమాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదని వ్యాఖ్యానించింది. అంతటి ఘోరానికి పాల్పడిన ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమిచ్చిందని గుర్తు చేసింది.

పైగా ఆ ముష్కరుడిని అమరవీరుడిగా పాక్ నేతలు కీర్తిస్తున్నారని పాక్ దుర్బుద్ధిని ఎండగట్టింది. ఇంకా పాక్ తన ఉగ్రచర్యలను సమర్థించుకుంటోందని స్పష్టం చేసింది.ఈ ఆధునిక యుగంలో ఉగ్ర సమర్థ చర్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. పాక్ సహా పొరుగు దేశాలన్నిటితో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని ఐక్యరాజ్య సమితి వేదికగా దూబే స్పష్టం చేశారు. అయితే పాక్ ఆ దిశగా చొరవ చూపాల్సి ఉందన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు విశ్వసనీయ, తిరుగులేని చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. సిక్కులు, హిందువులు, క్రైస్తవులు వంటి మైనారిటీలను పాకిస్థాన్‌లో అణచివేస్తున్నారన్నారు. దీనికి ప్రభుత్వం, నాయకులు మద్దతు సైతం ఉందని తెలిపారు. నిరసన తెలిపే గొంతుకలను నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. అపహరణ, చట్టవిరుద్ధమైన మరణశిక్షలు పాక్‌లో పరిపాటిగా మారాయన్నారు.

ఐక్యరాజ్య సమితిలో దాదాపు 25 నిమిషాల పాటు ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఇటీవల మరణించిన వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ పేరును సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇలా పాక్ నేత, ఐరాసలోని ఆ దేశ ప్రతినిధులు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం కొత్తేమీ కాదు. అయితే ప్రపంచం దృష్టిని ఆకర్షించడంలో మాత్రం పాక్ విఫలమైంది. దీన్ని ఇరు దేవాల మధ్య ద్వైపాక్షిక సమస్యగా మాత్రమే ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News