Home ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ చిత్తు

భారత్ చిత్తు

  • ఛాంపియన్ పాకిస్థాన్
  • ఫకర్ జమాన్ శతకం, రాణించిన అజహర్, హఫీజ్, చెలరేగిన అమీర్, హసన్
  • టాప్ ఆర్డర్ వైఫల్యం, కుప్పకూలిన టీమిండియా

Pakistan-Champions

లండన్: ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ కైవసం చేసుకుంది. ఆదివారం ఓవల్ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో పాక్ 180 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114), మహ్మద్ హఫీజ్ 57(నాటౌట్), బాబర్ ఆజమ్ (48) జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30.3 ఓవర్లలో కేవలం 158 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత జట్టులో ఒక్క హార్ధిక్ పాండ్యా (76) మాత్రమే పోరాటం కొనసాగించాడు. మహ్మద్ అమీర్, హసన్ అలీలు చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో పాక్‌ను గెలిపించారు. టాప్ ఆర్డర్ వైఫల్యం భారత్‌ను ముంచింది. రోహిత్ శర్మ (౦), కెప్టెన్ కోహ్లి (5), కేదార్ జాదవ్ (9), మహేంద్ర సింగ్ ధోనీ (4) కనీసం రెండంకెలా స్కోరును సైతం అందుకోలేక పోయారు. కాగా, సమష్టి పోరాటంతో పాక్ కప్పును సొంతం చేసుకోగా, భారత్ చెత్త ఆటతో కోట్లాది మంది అభిమానుల ఆశలను నీరుగారుస్తూ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇదిలావుండగా పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇదే ప్రథమం. సెంచరీ హీరో ఫకర్ జమాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు దక్కింది.
హడలెత్తించిన అమీర్
భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. భీకర ఫాంలో ఉన్న రోహిత్ శర్మ(౦)ను మొదటి ఓవర్‌లోనే మహ్మద్ అమీర్ పెవిలియన్ పంపించాడు. అమీర్ బంతిని అంచన వేయడంలో విఫలమైన రోహిత్ వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో భారత్ ఖాతా తెరవకుండానే మొదటి వికెట్‌ను కోల్పోయింది. అమీర్ తన రెండో ఓవర్‌లో టీమిండియాకు మరో కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఈసారి కెప్టెన్ కోహ్లి (5)ను అమీర్ ఔట్ చేశాడు. షాదాబ్ ఖాన్ పట్టిన అద్భుత క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగాడు. ఈ దశలో ఓపెనర్ శిఖర్ ధావన్, సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ కొద్ది సేపు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 4ఫోర్లతో 21 పరుగులు చేసి దూకుడు మీద కనిపించాడు. అయితే ఈ ఆనందం భారత్‌కు ఎంతో సేపు నిలువలేదు. కుదురుగా ఆడుతున్న ధావన్ నిర్లక్షంగా ఆడి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ వికెట్ కూడా అమీర్ ఖాతాలోకే వెళ్లింది. ఆ వెంటనే యువరాజ్ సింగ్ (22), మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (4), కేదార్ జాదవ్ (9)లు కూడా వెనుదిరిగారు. దీంతో భారత్ 72 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
హార్ధిక్ పోరాటం
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను యువ ఆటగాడు హార్ధిక్ పాండ్యా తనపై వేసుకున్నాడు. పాక్ బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ ముందుకు సాగాడు. రవీంద్ర జడేజా (15) అండతో కొద్ది సేపు బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 23 పరుగులు దండుకున్నాడు. 43 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, 4ఫోర్లతో 76 పరుగులు చేసిన పాండ్యా లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. పాండ్యా ఔట్ కావడంతో భారత్ ఆశలు అడుగంటాయి. చివరి వరుస బ్యాట్స్‌మన్ కనీస పోరాట పటిమను కూడా కనబరచకుండానే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ కనీసం 200 పరుగులు కూడా చేయకుండానే కుప్పకూలింది.
శుభారంభం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు ఫకర్ జమాన్, అజహర్ అలీలు అద్భుత ఆరంభాన్ని వచ్చారు. బుమ్రాను వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికే ఫకర్ జమాన్ వికెట్ కీపర్ ధోనీ చేతికి చిక్కాడు. అయితే అది నోబాల్ కావడంతో అతను బతికి పోయాడు. తర్వాత జమాన్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. బుమ్రాను లక్షంగా చేసుకుని స్కోరును ముందుకు నడిపించాడు. ఒకవైపు భువనేశ్వర్ కుమార్ కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడి చేశాడు. రెండో వైపు బుమ్రా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు కూడా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. కాగా, భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ఫకర్. అజహర్ అలీ 9.2 ఓవర్లలోనే పాక్ స్కోరును 50కి చేర్చారు. తర్వాత వీరు దూకుడును మరింత పెంచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అజహర్ అలీ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఆ వెంటనే ఫకర్ జమాన్ కూడా ఏడు బౌండరీలతో హాఫ్ సెంచరీ మార్క్‌కు చేరుకున్నాడు. వీరిని వెనక్కి పంపించేందుకు భారత కెప్టెన్ తరచు బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే 59 పరుగులు చేసిన అజహర్ అలీ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 128 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఫకర్ జమాన్ శతకం
తర్వాత వచ్చిన బాబర్ ఆజమ్‌తో కలిసి పోరాటం కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను అతను లక్షంగా చేసుకున్నాడు. కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగిన జమాన్ 92 బంతుల్లోనే 12ఫోర్లు, రెండు సిక్సర్లతో కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. అయితే కొద్ది సేపటికే జమాన్ (114) పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మహ్మద్ హఫీజ్ కూడా భారత బౌలర్లను హడలెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లలతో భారత బౌలర్లను ముచ్చెమటలు పట్టించిన హఫీజ్ 37 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేశాడు. ఇమాద్ వసీం 25(నాటౌట్) కూడా తనవంతు పాత్ర పోషించడంతో పాకిస్థాన్ స్కోరు 338 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యాలు మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశారు. మిగతావారు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు.