Home ఎడిటోరియల్ ట్రంప్ సృష్టించిన గాజా నరమేధం

ట్రంప్ సృష్టించిన గాజా నరమేధం

Article about Modi china tour

గాజా సరిహద్దులో పాలస్తీనియన్ నిరసనకారులపై ఇజ్రాయిల్ సైనికులు సోమవారం జరిపిన తుపాకీకాల్పుల్లో 60 మంది పాలస్తీనియన్‌లు మరణించిన, 2200 మందికిపైగా గాయపడిన మారణకాండ అత్యంత గర్హనీయమైంది. దీనికి మూలకారకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వివాదాస్పదమైన జెరూసలెంను, అంతర్జాతీయ అవగాహనకు భిన్నంగా ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించటమేగాక, తమ రాయబార కార్యాలయాన్ని టెల్‌అవీవ్ నుంచి ఆ ఉమ్మడి పుణ్యస్థలాల నగరానికి మార్చుతామని గత సంవత్సరం ప్రకటించిన నాటి నుంచీ పాలస్తీనియన్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భద్రతామండలి సభ్యదేశాలు, ఇస్లామిక్ దేశాలు అనేకం ట్రంప్ నిర్ణయాన్ని నిరసించినప్పటికీ తన మూర్ఖపు వైఖరిని అతడు మార్చుకోలేదు. కాగా సోమవారం నాడు తమ దౌత్యకార్యాలయాన్ని ఏకంగా జెరూసలెంలోని వివాద ప్రాంతంలో తాత్కాలిక భవనానికి మార్చారు. దీన్ని నిరసిస్తూ గాజా సరిహద్దులో ఆందోళనకు దిగిన పాలస్తీనియన్ నిరాయుధులపై ఇజ్రాయిల్ సైనికులు బాష్పవాయువు గోళాలు, తుపాకీ కాల్పులతో దాడి చేసి నరమేధానికి పాల్పడ్డారు. 2014లో గాజా వద్ద పాలస్తీనియన్‌ల తిరుగుబాటు అనంతరం ఇదే అతిపెద్ద రక్తసిక్త మారణహోమం. నిరసనదారుల్లో ఇస్లామిస్ట్ ‘టెర్రరిస్టు’ గ్రూపు హమాస్‌కు చెందినవారున్నారంటూ ఇజ్రాయిల్, అమెరికా తమ దారుణ కృత్యాన్ని లజ్జారహితంగా సమర్థించుకున్నాయి. జెరూసలెంలో రాయబార కార్యాలయాన్ని తెరిచిన అమెరికా చర్యను, గాజా సరిహద్దు వద్ద ఇజ్రాయిల్ సైనికుల పైశాచికాన్ని అమెరికా విరోధులేకాదు, మిత్రులుసైతం ఖండించారు. వాటిలో యుకె, ఫ్రాన్స్, రష్యాలతోపాటు టర్కీ, ఈజిప్టు, మొరాకో ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికాకు ముఖ్య మిత్రదేశమైన సౌదీ అరేబియా సైతం ప్రస్తుత ఘర్షణకు మూలమైన అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభాన్ని ప్రస్తావించకుండా పాలస్తీనియన్ సాధారణ ప్రజలపై ‘ఇజ్రాయిల్ ఆక్రమిత సైన్యం’ కాల్పులు జరిపి అనేక డజన్‌ల మంది ప్రాణాలు బలిగొనటాన్ని ఖండించింది. ఈ చర్యతో పశ్చిమాసియా శాంతి క్రమంలో మధ్యవర్తి పాత్రను అమెరికా కోల్పో యిందని టర్కీ అధ్యక్షుడు రిపిస్ తయ్యిప్ ఎర్డోగన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టాన్ని అమెరికా బరితెగించి ఉల్లంఘించిందని పాలస్తీనా ప్రధానమంత్రి రమీ హందల్లా నిరసించారు.
జెరూసలెం మహానగరం వివాద ప్రాంతం. తూర్పు జెరూసలెం తమ రాజధానిగా స్వతంత్ర మాతృరాజ్య స్థాపనను పాలస్తీనియన్‌లు కోరుతున్నారు. అంతిమ శాంతి ఒప్పందంలో భాగంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్నది. 7 లక్షల మంది పాలస్తీనియన్‌లను తమ స్వస్థలాల నుంచి పాలదోలి ఇజ్రాయిల్ రాజ్య స్థాపన గూర్చి చేసిన ప్రకటనలో జెరూసలెం ప్రస్తావన లేదు. క్రైస్తవ, మహమ్మదీయ, యూదు పుణ్యక్షేత్రాలకు నిలయమైన జెరూసలెం 1947లో ‘ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యం కింద ఒక ప్రత్యేక అస్థిత్వం’గా ప్రకటించబడింది. అయితే 1948 యుద్ధంలో యూదు సైన్యాలు పశ్చిమ జెరూసలెం ఆక్రమించాయి. ఇజ్రాయిల్ తొలి ప్రధానమంత్రి డేవిడ్ జెన్ గురియన్, ఆ నగరం ఇజ్రాయిల్ రాజ్యంలో విడదీయరాని భాగమని, శాశ్వత రాజధాని అని ప్రకటించి, కార్యకలాపాలను అక్కడికి మార్చాలని పార్లమెంటును ఆదేశించారు. ఇజ్రాయిల్ తన ప్రభుత్వ కార్యాలయాలను జెరూసలెం మార్చగా, దౌత్య కార్యాలయాలు టెల్‌అవీవ్‌లో కొనసాగుతున్నాయి.
1967 యుద్ధంలో తూర్పు జెరూసలెంను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్ అక్కడ యూదు జనావాసాలు నిర్మించటం ఆరంభించింది. 1980లో, ‘జెరూసలెం పూర్తిగా ఇజ్రాయిల్‌లో భాగం’ అనే బిల్లును ఇజ్రాయిల్ పార్లమెంటు ఆమోదించగా, అది ‘చెల్లుబాటు కాదు’ అని ఐరాస భద్రతా మండలి తీర్మానం (478) ఆమోదించింది. 1993లో ఓస్లో ఒప్పందాల్లో జెరూసలెం ప్రతిపత్తిని వాయిదా వేశారు. 2000లో ప్రధాని ఏరీల్ షరాన్ టెంపుల్ మౌంట్‌ను సందర్శించటంతో పాలస్తీనియన్‌లు రెండవ ఇంతిఫదా (తిరుగుబాటు) ప్రారంభించారు.
1967లో ఇజ్రాయిల్ అరబ్ రాజ్యాల యుద్ధం తదుపరి అమెరికా అధ్యక్షులు పాలస్తీనా ఇజ్రాయిల్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వ పాత్ర వహిస్తూ శాంతి చర్చలు నిర్వహిస్తున్నప్పటికీ వారు ఇజ్రాయిల్ పక్షపాతులుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఆ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవటానికి అదే మూలం. ఇప్పుడు ట్రంప్ దాపరికం లేకుండా ఇజ్రాయిల్ కొమ్ముగాస్తున్నారు. పర్యవసానాలు భయంకరంగా ఉంటాయని తెలిసీ ఆయన మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు.