Home అంతర్జాతీయ వార్తలు కరోనాతో అనాధలైన 15లక్షల మంది పిల్లలు

కరోనాతో అనాధలైన 15లక్షల మంది పిల్లలు

Pandemic orphaned 1.2 lakh in India, over 10 lakh globally

 

కన్నవారిని కోల్పోయిన 10 లక్షల మంది
భారత్‌లో 1.19 లక్షల మంది
లాన్సెట్ తాజా అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్ : ఏడాది కాలంగా పీడిస్తోన్న కరోనా మహమ్మారి లక్షల మంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా చిన్నారులు తమ తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయినట్టు లాన్సెట్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఒక్క భారత్ లోనే 1.19 లక్షల మంది పిల్లలపై కరోనా పగ సాధించింది. 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్ వరకు 14 నెలల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లో 15,62,000 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు, సంరక్షకులు (బామ్మ, తాతయ్యలు లేదా ఇతర బంధువులు) కనీసం ఒకరిని కోల్పోయినట్టు లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఇందులో 10,42,000 మంది తల్లీ/తండ్రీ లేదా ఇద్దరినీ కోల్పోయినట్టు తెలిసింది. తల్లుల కంటే తండ్రులను కోల్పోయిన చిన్నారులు ఐదు రెట్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా మెక్సికో లో 1.41 లక్షల మంది పిల్లలు అమ్మానాన్నలు లేదా ఇతర సంరక్షకులను కోల్పోయారు. బ్రెజిల్, భారత్, అమెరికా దేశాల్లోనూ ఈ సంఖ్య లక్షకు పైనే ఉంది.

భారత్‌లో 1.19 లక్షల మంది
భారత్‌లో 1,19,000 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా సంరక్షకుల్లో ఒకరిని కోల్పోయినట్టు లాన్సెట్ పేర్కొంది. ఇందులో 1.16 లక్షల మందికి తల్లీ/ తండ్రీ లేదా ఇద్దరినీ దూరం చేసినట్టు తెలిసింది. భారత్‌లో 25,500 మంది పిల్లలు తల్లులను కోల్పోగా, 90,751 మంది చిన్నారులు తండ్రి ప్రేమకు దూరమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి రెండు కరోనా మరణాలకు , ఒక చిన్నారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోతుండడం విషాదకరమని, ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ప్రపంచ వ్యాప్తగా 30 లక్షల కొవిడ్ మరణాలు సంభవించగా, 15 లక్షల మంది పిల్లలకు కన్నవారు/సంరక్షకులు దూరమయ్యారని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లీడ్ ఆధర్ డాక్టర్ సూసన్ హిల్లీస్ పేర్కొన్నారు.

Pandemic orphaned 1.2 lakh in India, over 10 lakh globally