Home తాజా వార్తలు రెవెన్యూ కార్యాలయాల్లో ‘పెట్రో’ సెగలు

రెవెన్యూ కార్యాలయాల్లో ‘పెట్రో’ సెగలు

petrol-attack
న్యాయం చేయాలంటూ బాధితుల హల్‌చల్

మనతెలంగాణ/తంగళ్లపల్లి, మహబూబాబాద్,కామారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయరెడ్డి హత్య తో రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాలలో బాధితులు రెవెన్యూ కార్యాలయాల్లో పెట్రల్‌తో హల్‌చల్ చేశారు. తమ భూముల విషయంలో రెవెన్యూ అధికారులకు బెదిరింపులు మొదలయ్యాయని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రామన్నపల్లె గ్రామానికి చెందిన కావటి లింగయ్య పెట్రోల్ సీసాతో కలకలం సృష్టించాడు. కావటి లింగయ్య బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్యాల నర్సారెడ్డి వద్ద ఐదు నెలల క్రితం 0.29 గుంట భూమిని కొనుగోలు చేశాడు.

పట్టా మార్పిడి కోసం గత రెండు నెలలుగా తిరుగుతున్నప్పటికీ అధికారులు తనను పట్టించుకోవడం లేదని లింగయ్య వాపోయాడు. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ సీసాతో వచ్చిన రైతును గమనించిన ఆర్‌ఐ సంతోష్ పెట్రోల్ సీసాతో ఎందుకు వచ్చావంటూ రైతును ప్రశ్నించడంతో తమ గ్రామానికి చెందిన మిత్రులు పెట్రోలు తీసుకురమ్మన్నారని అందుకే తీసుకోచ్చానని లింగయ్య బదులిచ్చాడు. దీంతో లింగయ్యను అక్కడున్న రైతులు, సంతోష్ నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించారు. అదేవిధంగా కామారెడ్డి ఆర్‌డిఒ రాజేంద్రకుమార్‌కు బుధవారం రాత్రి ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. తమ భూముల విషయంలో న్యాయం చేయకపోతే విజయరెడ్డికి పట్టిన గతే తాడ్వాయి మండల తహసీల్దార్‌కు పడుతుందని హెచ్చరించారు. ఫోన్ కాల్ డాటా ప్రకారం ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించగా పోలీసు డిపార్టుమెంట్‌లో పని చేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బెదిరింపు కాల్ విషయంలో ఆర్‌డిఒ రాజేంద్రకుమార్ కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేయగా బెదిరింపుకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి పోలీసులు తెలిపారు.అలాగే పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన అశోక్ అనే యువ రైతు పెట్రోల్ సీసాతో తహశీల్దారు కార్యాలయంలోకి ప్రవేశించి అధికారులతో వాగ్వాదానికి దిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. యువరైతు అశోక్ కు సంబందిత తహశీల్దారు నచ్చజెప్పి త్వరితగతిన పట్టాదారు పాసుపుస్తకం అందిస్తానని హామీ ఇవ్వడంతో అశోక్ అక్కడినుండి వెళ్లాడని, జరిగిన ఘటనను మీడియా దృష్టికి చేరకుండా అధికారులు జాగ్రత్తలు తీసున్నప్పటికీ సోషల్ మీడియాను నియంత్రిచలేకపోవడంతో గురువారం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టి సంచలనం సృష్టించింది.

Panic grips revenue officers after Tahasildar attack