Home ఎడిటోరియల్ ‘పేరడైజ్’ రట్టు చేసిన గుట్టు!

‘పేరడైజ్’ రట్టు చేసిన గుట్టు!

black-mny

నల్లధనం భారీస్థాయిలో ఉందనీ, దానిపట్ల ప్రభుత్వ ఉపేక్ష కూడా అదే స్థాయిలో ఉందని ‘ప్యారడైజ్ పేపర్స్’ ఇటీవల బయటపెట్టాయి. ఒక జర్మన్ పత్రిక అంతర్జాతీయ జర్నలిస్టుల మహాసమాఖ్య (ఐసిఐజె) సహకారంతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ బాగోతాన్ని వెల్లడించింది. నల్లడబ్బు భరతం పట్టే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ప్రకటనల్లోనే తప్ప ఆచరణలో లేదని మరోసారి కూడా ‘ప్యారడైజ్ పేపర్ల’ విషయంలో వెల్లడికాబోతోంది. అవినీతి, నల్లధనంపట్ల కట్టలు తెగిన ప్రజాగ్రహం కారణంగానే ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ ప్రజల ఆశలను నీరుకార్పిస్తూ మోడీ ప్రభుత్వం నల్లధనస్వాముల గుట్టు బయటపెట్టడం బదులు వారిని కాపాడుకొంటూ వస్తోందని ఈసారి కూడా నిజమవుతుందా?
పెద్దనోట్ల రద్దు తొలి వార్షికం నాడు ప్రభుత్వం ‘నల్లధనం వ్యతిరేక దినం’ పాటించడం ప్రజలపై విసిరిన పెద్ద జోక్. ఇప్పుడు నల్లధనంపట్ల ప్రభుత్వ వైఖరిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న వైఖరి ఏమిటంటే తనంతతానుగా నల్లధనం గుట్టు బయటపెట్టకుండా ఏవో పత్రాలు లీకైనప్పుడు మాత్రమే పొడిపొడిగా స్పందిస్తోంది. లీచ్టెన్‌స్టీన్ బ్యాంక్ అకౌంట్లయినా, హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ అకౌంట్లయినా, పనామా పేపర్లు లేదా ప్యారడైజ్ పేపర్లయినా ప్రతిసారీ తన వారిని వెనకేసుకొస్తూ ఆరోపణలపై ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. స్వయంగా రంగంలోకి దిగి విదేశాల నుంచి మనీలాండరింగ్ అక్రమాల తాలూకు వ్యక్తుల సమాచారాన్ని ఇంతవరకూ ఎన్న డూ ప్రభుత్వం తేలేదు.
ఒక్కరికీ శిక్షపడని వైనం
ఏ ఒక్క దోషిని ఇంతవరకు ప్రభుత్వం శిక్షించలేదు. పెద్ద నోట్ల రద్దు ద్వారా పెద్దగా నల్లడబ్బు పట్టుకున్నామని ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇంతవరకు ఆ కేసుల్లో విచారణ ప్రారంభించనే లేదు. ఆరోపణలు అధికార పార్టీ వారిపై లేదా ప్రతిపక్షాల వారిపై రావడం సహజం. ఎవరైనా సరే దోషులను పట్టుకోడానికి భారీ ఎత్తున ఉద్యమం లాంటిది ప్రభుత్వం సాగించడం లేదు. నల్లడబ్బు అన్నది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సర్వసాధారణమైన పెద్ద పీడ. బడా కార్పొరేట్లవారు, వివిధ దేశాల బడా సంపన్న బాబులు పన్నులు కట్టని దొంగసొమ్ము గమ్యాలకు ఏవిధంగా చేరవేస్తున్నాయో ప్యారడైజ్ పేపర్లు, పనామా పేపర్లు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ ప్రస్తావిస్తున్న కొన్ని కేసులు నల్లధనం పీచమణచడంలో మోడీ ప్రభుత్వం ఎలా విఫలం అవుతున్నదో స్పష్టం చేస్తున్నాయి :
1)స్టెర్లింగ్ బయోటెక్(సందేశర) అనే సంస్థ ఇన్వాయిస్‌లను(సామాగ్రి కొనుగోలు బిల్లులను) ఎక్కువ చేయడం లేదా తక్కువ చేయడం (ఓవర్ అండ్ అండర్ ఇన్వాయిసింగ్) ద్వారా రూ.5000 కోట్లు పైగా మొత్తాన్ని కాజేసింది. గుజరాత్‌లోని ఈ సంస్థ, అక్రమాలను 2011జూన్ 28న ఆదాయం పన్ను శాఖ బయటపెట్టింది. ఆదాయం పన్ను చట్టం 132 సెక్షన్ కింద ముంబాయి, వడోదరాలో మొత్తం 25 ప్రాంగణాలలో ఈ సోదాలు జరిపారు. గుజరాత్‌కు చెందిన అనేక మంది అధికార్లు, పోలీసులు, రాజకీయ నాయకులకు ఈ అక్రమాలతో సంబంధం ఉన్నట్లు తెలిపే పత్రాలు ఆ సోదాల్లో స్వాధీనమయ్యాయి. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలయింది.
అయితే అందులో నిందితులైన కొంతమంది ప్రముఖులను మోడీ ప్రభుత్వం రక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాకేశ్ అస్తానా అనే అధికారిని సిబిఐ ప్రత్యేక డైరెక్టర్‌గా పదోన్నతి ద్వారా నియమించింది. స్వయంగా సిబిఐ డైరెక్టర్ ఈ పదోన్నతిని వ్యతిరేకించారు. సందేశర గ్రూపుపై 2017 అక్టోబర్ 25న సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ మరింత తీవ్రమయినది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో స్టెర్లింగ్ బయోటెక్ డైరెక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వారితో కలిసి ఆంధ్రాబ్యాంక్ అప్పటి డైరెక్టర్లు రూ. 5,383 కోట్ల ప్రజాధనాన్ని కాజేసినట్లు ఎఫ్‌ఐఆర్ ఆరోపిస్తోంది. దీనిపై సిబిఐ చురుకుగా కదలాల్సిన అవసరం ఉంది.
2) భారతీయ విద్యుత్ కంపెనీలు అసలు ఉత్పత్తిదార్లు (ఒఇఎం) నుంచి నేరుగా పరికరాలను దిగుమతి చేసుకుంటాయి. వాటిలో చైనా నుంచి దిగుమతి చేసుకునేదే అధికం. ఈ దిగుమతులకు రెండు రకాల ఇన్వాయిస్‌లను విదేశీ మధ్యవర్తి కంపెనీ పేరుపై సృష్టిస్తారు. అందుకోసమే దానిని ప్రత్యేకంగా నియమిస్తారు. ఈ కంపెనీ పేరున ఇన్వాయిస్‌లలో ఆ దిగుమతుల అస లు ధర పేర్కొంటారు. అయితే ఆ మధ్యవర్తి కంపెనీ భారతీయ కంపెనీల పేరున సృష్టించే ఇన్వాయిస్‌లలో దిగుమతుల ఖర్చును 400శాతం పెంచేసి చూపిస్తుంది. అంటే అలా పెంచిన మొత్తం ఆ కంపెనీ అక్రమ ఆర్జన అవుతుంది. ఆ అక్రమ ధనాన్ని పన్నులు కట్టక్కరలేని విధంగా విదేశాలకు తరలిస్తారు. ఆ అక్రమ సంపాదనను సాధారణంగా యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), మారిషస్ వగైరా దేశాల్లో దాచేస్తారు.
2014 నుంచి మూడేళ్ళుగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డిఆర్‌ఐ) ఈ సమస్యపట్ల ఉదాసీనత ప్రదర్శిస్తోంది. మొదట్లో అనేక కంపెనీలకు నోటీసులు పంపిన డిఆర్‌ఐ ఆ తర్వాత మిన్నకుంది. అయితే ‘ది గార్డియన్’ పత్రిక అదానీ గ్రూపుపై ఇబ్బందికర కథనాన్ని ప్రచురించడంతో ఆ కంపెనీ రక్షణకు డిఆర్‌ఐ స్వయంగా దిగింది. ఆ కంపెనీ ‘ఓవర్ ఇన్వాయిసింగ్’కు పాల్పడలేదని ప్రకటించింది. ఇందుకు కొన్ని అసంబద్ధ కారణాలు చూపింది. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసిన బొగ్గుకు ‘ఇన్వాయిస్‌లు ఎక్కువ చేసి చూపే’ నేరానికి 30 విద్యుత్ కేంద్రాలు పాల్పడుతున్నట్లు 2016 మార్చిలో డిఆర్‌ఐ హెచ్చరిక జారీ చేసింది. అయితే ఏడాదిన్నర గడిచినా ఇంతవరకూ ఈ విషయంలో ఎటువంటి చర్యలూ లేవు. అదానీ వంటి పెద్ద కంపెనీలు ఈ అక్రమాలకు పాల్పడిన ఉదంతాల్లో ఇంతవరకు సంజాయిషీ నోటీసులు ఏవీ జారీ కాలేదు.
సింగపూర్‌లో రిలయన్స్ మోసం?
2011 ఆగస్టు 31న సింగపూర్‌లోని భారత హైకమిషన్ ఆశ్చర్యపెట్టే వాస్తవాన్ని వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బయో మ్యాట్రిక్స్ మార్కెటింగ్ లిమిటెడ్ ద్వారా రూ. 6,530 కోట్లు భారత్‌లోకి ప్రవేశించిన విషయం అది. ఆ కంపెనీ సింగపూర్‌లో ఒకే గదిలో నడుస్తోంది. దానికి పెట్టుబడి వాటా లేదు. తమది చిన్న కంపెనీ అంటూ ఆదాయం పన్ను రిటర్న్ లు సమర్పించడం లేదు. అయితే ఈ కంపెనీ రూ. 6530 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టడంతో అది సింగపూర్ నుంచి వచ్చిన భారీ ఎఫ్‌డిఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)అయింది. ఈ డబ్బంతా రిలయన్స్ కంపెనీల గ్రూపులోకి వెళ్లిందని హైకమిషన్ తెలిపింది. అందులో భారీ మొత్తం రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఖాతాను చేరింది.
ఇది నూటికి నూరుశాతం ముఖేష్ అంబానీ సొంత కంపెనీ. ఈ అంశంపై 2014 జూలై 8న నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం
(సిట్)కు సవివరంగా ఫిర్యాదు చేశాము. అయితే ఇప్పటిదాకా ఈ విషయమై ఎటువంటి చర్యలూ లేవు. ఈ కేసులన్నిటిపై నిర్దిష్టమైన తక్షణ కార్యాచరణను ప్రభుత్వం నుంచి కోరుతున్నాము. ఇంతవరకు తీసుకున్న చర్యల పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించాలి. నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని పట్టుకొన్నామని అస్పష్టమైన ప్రకటనలు చేయకుండా ఎవరెవరి వద్ద పట్టుకున్నారో పేర్లు వెల్లడించాలి. నల్లధనంపై నియమించిన సిట్ ప్రభుత్వానికి చేసిన అనేక సిఫార్సులు అమలు చేయాలి. వాటిని బహిరంగపర్చాలి. 2016 ఆర్థిక చట్టానికి చేసిన తిరోగామి సవరణలను ప్రభుత్వం వెన క్కి తీసుకోవాలి. అవి విదేశీ విరాళాల క్రమబద్దీకరణ, రాజకీయ పార్టీల నిధులకు సంబంధించిన సవరణలు.
      * ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్