Home జోగులాంబ గద్వాల్ జోగులాంబ గద్వాల జిల్లాలో పరువు హత్య

జోగులాంబ గద్వాల జిల్లాలో పరువు హత్య

Parents killed Daughter in Jogulamba Gadwal

 

ప్రేమలో పడి గర్భం ధరించిందని దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చిన తల్లిదండ్రులు

మనతెలంగాణ/వడ్డేపల్లి: జోగులాంబ గద్వాల్ జిల్లా, మానవపాడు మండ లం, కలుకుంట్ల గ్రామంలో ఆదివారం పరువు హత్య జరిగింది. కూతుర్ని తల్లిదండ్రులే హతమార్చారు. సోమవారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. కలుకుంట్ల గ్రామానికి చెందిన భాస్కర్‌శెట్టి, వీరమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు. వీరిలో చివరి కూతురు దివ్య కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన విద్యార్థితో ప్రేమలో పడి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తల్లి గుర్తించి ఆసుపత్రిలో పరీక్షలు చేయించింది. గర్భం తీయించుకోవాలని తల్లిదండ్రులు దివ్యను కోరగా నిరాకరించింది.

దీంతో విషయం బయటకు తెలిస్తే తమ పరువుపోతుందని కన్న తల్లిదండ్రులే దివ్య నిద్రిస్తున్న సమయంలో దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు చెప్పారు. పోలీసుల విచారణ మాత్రం అసలు విషయం బయట పడింది. దీంతో తల్లిదండ్రులు భాస్కర్‌శెట్టి, వీరమ్మలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ శ్రీహరి, శ్రీనివాస్, సిబ్బంది రామకృష్ణ, యకూబ్, రాజు, మాభాషాలను సిఐ అభినంధించారు.

 

Parents killed Daughter in Jogulamba Gadwal