Home కెరీర్ ఉన్మాదం దిశగా మైనర్లు

ఉన్మాదం దిశగా మైనర్లు

Parents should focus on their teenage friends

ఉన్మాదం దిశగా మైనర్లు పయనిస్తున్నారు. ప్రాణం విలువకు లెక్క లేదు. వ్యసనాలకు బానిసలుగా మారుతూ, హత్యలకు ఎగ బడుతున్నారు కొందరు యువకులు. పాఠశాల దశలోనే పునాదులు దాల్చుతున్న వ్యసనాలు, విలాసాల వైపునకు లాగుతున్నాయి. మానసిక పరిపక్వత సరిగ్గాలేకనే ఉన్మాద చర్యలు పుట్టుకొస్తున్నాయి.

ప్రస్తుత నగర జీవన విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో దూసుకు వెళ్తూ ఉన్నతమైన మానవీయ విలువలను మంట గలుపుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల ఉప్పల్ పరిధిలో చేసిన అప్పులు తీర్చడానికి స్నేహితుని ఖరీదైన సెల్‌ఫోన్ కోసం స్నేహితుని ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టి హత్య చేశాడు. పాత కక్ష్యలతో చిన్ననాటి స్నేహితుడిని చందానగర్ హైదరాబాద్ లో కత్తితో పొడిచి చంపాడు. పిలిస్తే పలకలేదనే సాకుతో ఒక యువకుడు మరొక యువకుడిని కత్తితో పొడిచి చంపడం..ఇలాంటివెన్నో సంఘటనలు వింటుంటే, చూస్తుంటే అసలు మనం ఎక్కడ ఉన్నామో తెలియడం లేదు. ఇప్పుడిప్పుడే యుక్తవయసులోకి అడుగిడబోతున్న బాలలు, యువత ఇలాంటి వికృత చేష్టలకు దిగజారడానికి వారిలోని మానసిక పరిపక్వత సరిగ్గాలేకపోవడం,చెడు వ్యసనాలకు బానిసలు కావడం, విలాస వంతమైన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతికి బానిసలుగా మారడంతో హత్యలకు ఎగబడుతున్నారు కొందరు. దీనిని అదుపు చేయాల్సిన బాద్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉంది.

సమాజంలో ప్రతి వ్యక్తి జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానంలోకి ఎదగడానికి, అతి స్వల్ఫకాలంలోనే ఆర్థికంగా అందలాన్ని అందుకోవాలనే ఆలోచనలతో కాలంకంటే వేగంగా పరుగులు తీస్త్తూ తమ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకొంటున్నారు. తల్లిదండ్రులు, భార్యా పిల్లల కంటే వస్తువులపై మోజును పెంచుకుంటున్నారు. అలాగే కొందరు పేరెంట్స్ పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ వహించడం లేదు. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పేవారు కరువయ్యారు. పిల్లలు తల్లిదండ్రులు, తాతయ్య నానమ్మల దగ్గరి గడిపే సమయం చాలా తక్కువయ్యింది. ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్‌లకే కేటాయిస్తూ ఉన్నారు. పాఠశాల దశ నుండే పిల్లలు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. తోటి స్నేహితులతో కలసి సినిమాలు, బేకరీలలో ఎగ్ పఫ్ , కర్రీ పఫ్ లతో మొదలైన అలవాటు క్రమం క్రమంగా పబ్ లు, పార్టీల దాకా వెళ్తోంది. నాజీవితం నేను ఎంజాయ్ చేస్తాను అంటూ చివరకు స్నేహితుల ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడటం లేదు.

మానవత్వం మంట కలుస్తోంది. మానవ సంబంధాల పట్ల విలువలు తగ్గుతున్నాయి. బాల్య స్నేహితులు, స్నేహితులు, ప్రేమ అర్థాన్ని యుక్తవయసుకు రాబోతున్న బాలలు మార్చేస్తున్నారు. స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వాల్సింది పోయి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తునారు. ప్రేమ అనే మాయను సృష్టించుకొని ఉన్మాదిగా మారుతున్న యువతను సన్మార్గంలో నడిపించాలి.

ఉన్మాదం తగ్గాలంటే….
1 పిల్లలు సన్మార్గంలో పాఠశాల దశ నుండే విద్యా విధానంలో సమూల మార్పు రావాలి.
2 పిల్లలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
3 ప్రతిరోజు పిల్లలతో గడిపే సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకోవాలి. వీలయినంతవరకు సెలవు రోజులలో కుటుంబ సమేతంగా కొత్త ప్రదేశాలు సందర్శించాలి.
4 యుక్త వయసు పిల్లల స్నేహితులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి.
5 పిల్లలు దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే కౌన్సెలర్, సైకాలజిస్ట్‌ల సహాయాన్ని తీసుకోవాలి.
6 సమాజంలో ప్రస్తుతం మంచి కంటే చెడు తక్కువ సమయంలో అతి తొందరగా యువకులు ఆకర్షణకు లోనవుతునారు.
7 భయకంపితమైన దృశ్యాలు యువత కంట పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
8 ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయని గుర్తించాలి.
9 స్నేహం, ప్రేమకు మధ్య వ్యత్యాసం తప్పని సరిగా తెలుసుకోవాలి.

ఒక్క నిమిషం ఆలోచించండి…
హత్య చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసులు కటకటాలపై పాలవుతున్నారు. ఇలాంటి కొడుకును ఎందుకు ఇచ్చాడు ఆ భగవంతుడని కుళ్లికుళ్లి ఏడుస్తున్న ఆ తల్లిదండ్రుల శోకం చెప్పలేనిది. జీవితమనేది మనదొక్కరిదే కాదు, మనల్ని కని, పెంచి, పోషిస్తున్న అమ్మానాన్నలది కూడా. మనమీద మనకెంత హక్కుందో తల్లిదండ్రులకూ అంతే హక్కుంది. పిల్లలు లక్ష్యసాధన దిశ వైపుగా ఆలోచనలను దృష్టి సారించాలి. యుక్త వయసు విపరీత ఆలోచనలకు లోనవడం సహజం. అయితే నిరంతరం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రేమైనా, విలాసాలైనా కాస్త ఆగి, ఆలోచించి అందులోని మంచిచెడులను సరిచేసుకుంటూ వెళ్ళాలే కాని హత్యలు, ఉన్మాద చర్యలు చేసే స్థాయికి దిగజారి పోకూడదు.

ఇలా చేస్తే భవిష్యత్తులో నీతో ఎవరైనా స్నేహం చేస్తారా!నిన్ను గౌరవిస్తారా ఆలోచించండి.. మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి సానుకూల ఫలితం వస్తుందనే భావంతో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరుగవలసిన పనులు అవే జరుగుతాయి. మనల్ని అపహాస్యం చేసిన వారిని సవాలు చేస్తూ పైకి.. పైపైకి ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, నీవు ఏదైతే కోరుకున్నావో అదే నీ దరికి చేరుతుంది.