లోకంలో చాలా విషయాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అయితే కొందరు ఆ మార్పుల్ని అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతారు. మరికొందరేమో వాటిని జీర్ణించుకోలేక పాత విష యాలనే పట్టుకు వేళ్లాడుతుంటారు. ‘నాకు తెలిసిందే కరెక్ట్’ అంటూ మొండిగా వాదిస్తారు కూడా. ఈ ధోరణి చూసి అవతలి వాళ్లు లోలోపల నవ్వుకుంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పట్టించుకోవడం మానేస్తారు. దీని వల్ల మానవ సంబంధాలు తెగిపోవడమే కాదు, పాత భావజాలం వద్దే ఆగిపోయి, జీవితంలో బాగా వెనుకబడిపోతారు.
ఇదీ అదీ అని కాదు… నిజానికి, జీవితానికి అనుబంధమైన చాలా విషయాలు నిలకడగా ఉండవు. వాటిల్లో ఎంతో కొంత మార్పు ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మూలాల్లో విషయం మారకపోయినా, దాని విస్తరణలో ఎంతో వ్యత్యాసం వస్తుంది. ఒక్కోసారి అది వెళ్లే మార్గం మారవచ్చు. ఒక దశలో దాని లక్ష్యమే మారిపోవచ్చు. అందువల్ల ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు గుర్తించకపోతే మనసులో అయోమయం అలుముకుంటుంది. జీవితం దారి తప్పిపోతుంది. అందుకే విద్యావిషయంగా, సామాజికంగా, ఇతరత్రా వచ్చే పలురకాల మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అలాంటి వాళ్లే అనుకున్న తీరానికి చేరుతారని పేరెంట్స్ పిల్లలకు చెబుతూ ఉండాలి!