Tuesday, April 23, 2024

‘పద్మ విభూషణ్’ను వెనక్కి ఇచ్చిన ప్రకాశ్ సింగ్..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు పలు రాజకీయ పక్షాలు మద్దతు తెలుపుతుండగా తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు, భారత ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. బాదల్ తన లేఖలో రైతుల పట్ల కేంద్రం తీసుకున్న చర్య వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైతుల వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఇప్పుడు కేంద్రం కారణంగా అలాంటి రైతులు బాధపడుతుంటే .. ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారం వల్ల వచ్చిన గౌరవం తరకు అక్కర్లేదని బాదల్ తన లేఖలో స్పష్టం చేశారు. 2015లో కేంద్రం బాదల్‌ను పద్మవిభూషణ్ పురస్కారంలో సత్కరించింది.

కాగా రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయేనుంచి బైటికి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు నెలల క్రితం అకాలీద్ ఎన్డీనుంచి బైటికి రాగా ఆ పార్టీకి చెందిన బాదల్ కోడలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రివర్గంనుంచి కూడా వైదొలిగారు. అకాలీదళ్ అసమ్మతి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా కూడా ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయన్నుట్లు మరో ప్రకటనలో తెలియజేశారు. వృద్ధులు, మహిళలలతో సహా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో వారం రోజులుగా ఉంటున్నారని ధిండ్సా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మేము కూడా రైతు బిడ్డలమే. ఈ పురస్కారాన్ని ఏం చేసుకుంటాం. ఆందోళన చేస్తున్న రైతులతో భుజం భుజం కలిపి నడుస్తాం’ అని ధిండ్సా తన ప్రకటనలో స్పష్టం చేశారు. పంజాబ్‌కు చెందిన పలువురు క్రీడాకారులు కూడా తమకు ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించడమే కాక, ఈ నెల 5న ఢిల్లీలో జరిగే రైతు ఆందోళనల్లో పాల్గొంటామని హెచ్చరించారు.

Parkash Singh Badal Returns Padma Vibhushan Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News