Thursday, March 28, 2024

జాతి గర్వించే కట్టడమా!

- Advertisement -
- Advertisement -

Parliament Building constructed

అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నెలవైన భారత పార్లమెంటు నేడు భౌగోళిక రూపాంతరం చెందబోతున్నది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని నాటి ఆంగ్లేయులు ఎడ్విన్ లూటీన్స్, హెర్బర్ట్ బేకర్ అనే భవన నిర్మాణ విజ్ఞాన నిపుణులు రూపకల్పన చేశారు. ఫిబ్రవరి 12, 1921 నాడు మొదలైన నిర్మాణం జనవరి 18 1927 నాటికి పూర్తయి అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేత ప్రారంభించారు. వయస్సు మళ్లిన, కాలం చెల్లిన నాటి ఆంగ్లేయుల కట్టడాలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా లేవని, భద్రత కారణాల దృష్ట్యా పూర్తి స్వదేశీ, సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త, అధునాతన భవనాన్ని నిర్మించుకోవలసిన సమయం ఆసన్నమైందంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తలంపుతోనే సెంట్రల్ విస్టా అనే భారీ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేశారు.
ప్రస్తుతమున్న పార్లమెంటు భవనానికి మూడు రెట్లు అధికం (విస్తీర్ణంలోనూ, పరిమాణంలోను) 64,500 చ.మీ. విస్తీర్ణం- సవరించిన ప్రకారం మొత్తం కట్టడానికి అయ్యే అంచనా వ్యయం అక్షరాలా రూ.13,450 కోట్లు.- ఇంతటి భారీ హంగులతో శ్వేత సౌధాన్నే తలపించేదిగా కడుతున్న ఈ మహాకట్టడం దేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అనగా 2022 ఆగస్టు నాటికి సిద్ధం చేయాలనే ఏకైక లక్ష్యంతో శరవేగంగా పనులు ప్రారంభమయ్యాయి. -సెంట్రల్ విస్టా కట్టడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన ప్రభుత్వ ప్రకటనను కొంతమంది సామాజిక, పర్యావరణవేత్తలు సవాలు చేశారు. అందులో ప్రధానంగా పర్యావరణ, ఆరోగ్య, రాజ్యాంగ, సాంకేతికపరమైన అసమానతలు ఉన్నాయంటూ కట్టడాన్ని నిలుపుదల చేయాలంటూ భారత దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కరోనా మహమ్మారి ఆంక్షలు అమలులో ఉండగానే డిసెంబర్ నెల 2020లో ప్రభుత్వం తలపెట్టిన భూమి పూజ సైతం న్యాయస్థానం జోక్యంతో జరిగింది. అయితే ప్రభు త్వం చేపట్టబోతున్న ఈ సెంట్రల్ విస్టా కట్టడాన్ని సవాలు చేసిన వ్యాజ్యాలను జనవరి 05, 2021నాడు భారత దేశ అత్యున్నత న్యాయస్థానంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 సంఖ్యా బలంతో కేసును కొట్టివేసింది. -భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం, ఉమ్మడి ప్రధాన సచివాలయంతో కూడిన ఈ సెంట్రల్ విస్టా కట్టడాన్ని అనుమతిస్తూ షరతులతో కొన్ని సూచనలను మాత్రమే చేసింది.- న్యాయమూర్తులు ఎ.ఎం. ఖాన్విల్కార్, దినేష్ మహేశ్వరీ ప్రాజెక్ట్‌కు అనుకూలంగా తీర్పునివ్వగా న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రత్యేక తీర్పునివ్వటం గమనార్హం.
-Delhi Development Act (DDA), Delhi Development (Master Plan and Zonal Develo pment Plan) Rules, 1959 ప్రకారం ఏదైనా ఢిల్లీ పరిసర ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ చేపట్టదలచినప్పుడు ఆ ప్రాజెక్ట్ సాంకేతిక, పర్యావరణ, న్యాయపరమైన వివిధ అంశాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించి, ఆ ప్రాంత ప్రజల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు అన్నింటినీ పరిగణనలోనికి తీసుకొన్న తరువాతనే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిడిఎలోని సెక్షన్ 7 నుండి 11ఎ వరకు, డిడిఎ నిబంధనలులోని సెక్షన్ 4, 8, 9,10 ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు.- ఇంతటి ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ రూపకల్పనలో ఆప్రాంత ప్రజలను ప్రాధమిక, క్షేత్ర స్థాయిలో పరిగణనలోనికి తీసుకోకుండా మొక్కుబడి ప్రకటనలు, నామమాత్రపు సంప్రదింపులతో అభిప్రాయ సేకరణ చేశారన్నారు.- సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ సవరించిన నిర్మాణ నమూనా చిన్నది కాదని, ఢిల్లీ భౌగోళిక స్వరూపం మారదన్న కేంద్ర ప్రభుత్వ వాదనతో న్యాయామూర్తి విభేదించారు. ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మించ తలచినప్పుడు కేవలం భూసేకరణే సరిపోదని, పూర్తిస్థాయి పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక అత్యంత ముఖ్యమని తెలియచేశారు.- ఆశ్చర్యకరంగా భూమి, అభివృద్ధి అధికారి (Land and Development Officer) సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ప్రకటన విడుదల తేదీ ఫిబ్రవరి 03, 2020 నాడు నిర్ణయించి, ఫిబ్రవరి 05, 2020న ప్రకటన విడుదల చేసి, అదే నెల 06, 07 తేదీలలో ప్రాజెక్టు వలన ప్రభావితమయ్యే ఆ ప్రాంత ప్రజల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి ఆ మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి చేతులు దులిపేసుకొని మొక్కుబడి తతంగంలా చెయ్యటమే కాకుండా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) చట్టంలోని సెక్షన్ 45 ను సైతం ఉల్లంఘించింది అన్నారు న్యాయమూర్తి. –
2009, అక్టోబర్ 1న 147 చారిత్రక, వారసత్వ కట్టడాలను హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీ గుర్తించగా వాటిని New Delhi Municipal Council (ఎన్‌డిఎంసి) ప్రచురించింది. అందులో గ్రేడ్ వన్ విభాగంలో పార్లమెంటు భవనం, జాతీయ పురావస్తు భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలు ఉన్నాయి. హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీ (హెచ్‌సిసి) అధీనంలో ఉండే ఈ చారిత్రిక కట్టడాలను తొలగించాలన్నా, పునరుద్ధరించాలన్నా ఈ కమిటీ సూచనలు, అనుమతులు తప్పనిసరి. కానీ స్థానిక ఎన్‌డిఎంసి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హెచ్‌సిసి మార్గదర్శకాలను కానీ సూచనలను కానీ పరిగణనలోకి తీసుకోలేదని తన తీర్పులో వెల్లడించారు.- ఏప్రిల్ 22, 2020 నాడు Expert Appraisal Committee పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ విడుదల చేసిన ప్రకటన సైతం లోపభూయిష్టంగా ఉందన్నారు. ఇదే సమయంలో 2020 సంవత్సరానికిగాను నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు, పౌష్టికాహారలోపం మొదలైన రంగాలలో దేశ, విదేశీ సంస్థలు విడుదల చేసిన తాజా సూచీలు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) సంస్థ 2019 – 2020 సంవత్సరానికి గాను 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలలో సర్వే నిర్వహించి, దాదాపు 13 రాష్ట్రాలలోని పిల్లలు తమ వయసుకు తగ్గ బరువు, పొడవులేరని, తీవ్రమైన ‘పోషకాహార లోపం’ తో బాధపడుతున్నారని స్పష్టం చేసింది.
నేడు నూతన సంవత్సరం రైతుల ఆందోళనతో మొదలై దేశ వ్యాప్త చర్చకు దారితీసిన తరుణంలో వ్యవసాయ సవరణ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అసంఖ్యాక రైతులు వాతావరణ ప్రతికూలతలు సైతం లెక్కచేయక దృఢ సంకల్పంతో చేస్తున్న దీక్షలను, 50 మంది పైనే ఆత్మహత్య చేసుకున్న రైతులు / రైతు కుటుంబాలను ఓదార్చి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చొరవ తీసుకోవాలిసిన అవసరం ఉన్నది. -దేశం ఎదుర్కొంటున్న అనేక మౌలిక, దీర్ఘకాలిక సమస్యలకు ప్రాధాన్యతా క్రమంలో ఆర్ధిక వనరులను వినియోగించాలి. ఖజానాపై అనవసర భారాన్ని మోపొద్దని, దేశ సంపదను అ, అ (అంబానీ, అదానీ) లకు ధారాదత్తం చేయొద్దని, దేశం కోసం ధర్మం కోసం మన ప్రధాని తీసుకుంటున్న ఇటువంటి చారిత్రక నిర్ణయాలు నిజంగానే జాతి హితం కోసమా? అని నిజమైన దేశ భక్తులు / ప్రజలు పునరాలోచన చేయాలి !

* సోమశేఖర్. వడ్డి
(అడ్వొకేట్)
+91-9177709177

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News