Home తాజా వార్తలు తెలంగాణలో టిడిపి ఖతం: కెటిఆర్

తెలంగాణలో టిడిపి ఖతం: కెటిఆర్

 

హైదరాబాద్: అన్ని పాయలు జీవనదిలో చేరినట్టు… అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజాభిమానం ఉన్న నేతలంతా టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. సునీతా లక్ష్మారెడ్డి గౌరవానికి తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెదక్ ఎంపిగా కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని, తెలంగాణలో తెలుగుదేశం ఖతమైందని, 37 ఏళ్ల తరువాత తొలిసారి టిడిపి పోటీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.

ప్రజాదరణ కలిగిన కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో ఇక కాంగ్రెస్ కూడా ఖతం కానుందని జోస్యం చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారని, గోదావరి జలాలు నర్సాపూర్‌కు అందిస్తామని హామీ ఇచ్చారు. అదే ఆంధ్రాలో పోలవరానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇచ్చిందని, కాళేశ్వరం లేదా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వమంటే కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. 16 సీట్లు గెలిస్తే జాతీయ హోదా సాధించుకోవటం కష్టమేమీ కాదన్నారు. ఈ ఎన్నికలలో బిజెపి మరోసారి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

 

Parliament Elections: All Party Leaders Join in TRS: KTR