Home తాజా వార్తలు తెలంగాణ పౌరుషం చాటాలి

తెలంగాణ పౌరుషం చాటాలి

కోటి ఎకరాల మాగాణికి సాగునీరందించడమే సిఎం కెసిఆర్ లక్షం
బిజెపి, కాంగ్రెస్ పాము… ముంగిస లాంటివి
సిఎం కెసిఆర్ పథకాలే దేశానికి ఆదర్శం
మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు తెలంగాణలో కలుస్తామంటున్నాయి
జహీరాబాద్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కెటిఆర్

ఉద్వేగానికి లోనైన కెటిఆర్

జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తూ కొద్ది క్షణాలు కెటిఆర్ ఉద్వేగానికి గురయ్యారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్లినప్పుడు అవ్వలు, తాతలు, పెద్దయ్యలు, అమ్మమ్మలు, అక్కలు కెసిఆర్ మాపెద్దకొడుకు ఆయనకు ఓటు వేసేందుకు మీరు ఇంత దూరం రావాలాని పెద్దలు ఆశీర్వదిస్తుంటే నాహృదయం ఉప్పొంగిందని ఉద్వేగంగా కెటిఆర్ చెప్పారు. నన్ను స్వయంగా పెద్దలు ఆశీర్వదిస్తూ చెప్పిన మాటలు వింటుంటే హృద యం ఆనందంతో పరవశించిందన్నారు. కొడుకా ఈ రోజు నేను మూడుపూటలు తింటున్నా, ఆత్మగౌరవంతో ఉంటున్నా నామనుమడు మనమరాలువస్తే బిస్కెట్ల కోసం రూ.10 చేతిలో పెడుతున్నానంటే నాపెద్దకొడుకు కెసిఆర్ ఇస్తున్న పెన్షన్ అని పెద్దలు ఆశీర్వదిస్తుంటే అంతకంటే కావల్సిన ఆనందం ఏముందనిపించింది. అందుకే వృద్ధులు, ఒంటరిమహిళలను మరింతగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఆసరా పెన్షన్‌ను రూ.2016 పెంచి ఏప్రిల్ నుంచి అమలుచేయనున్నారని చెప్పారు.

KTR

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో గుణాత్మకమార్పులు తీసుకురావలంటే కేంద్రం జుట్టు తెలంగాణ చేతిలో ఉండాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు పార్టీశ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. దేశానికి మార్గదర్శకంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయడంతో పాటు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయహోదా పొందేందుకు కేంద్రం మెడలు వంచక తప్పదని కెటిఆర్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని మరోసారి కేంద్రానికి చూపెట్టాలంటే 16 పార్లమెంట్ స్థానాలు గెలవడమేలక్షంగా పార్టీశ్రేణులు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.. పాము ముంగీస లాంటి కాంగ్రెస్ బిజెపి ఒంటరిగానైనా, కలిసైనా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని కెటిఆర్ మరోసారి చెప్పారు. ఈ రెండు పార్టీల విధానాలతోనే దేశాభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. 71 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో ఇంకా నిరుపేదలు, దారిద్య్రం, రోడ్లు లేని గ్రామాలు, ఉపాధిలేని యువత, సాగునీరు లేని ప్రాంతాలు ఉన్నాయంటే కాంగ్రెస్,బిజెపి అసమర్థతకాదాని కెటిఆర్ ప్రశ్నించారు. బుధవారం జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం మాగి శివారు మైదానంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ విధానాలను తూర్పార బట్టా రు,71 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో కరెంటు లేని ఇల్లు, మంచినీళ్ల్ల్లులేని గ్రామాలు, తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే రెండు పార్టీల అసమర్థతేనని తూర్పారబట్టారు.

కెసిఆర్‌ఆలోచనలే దేశానికి ఆదర్శం

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి దిక్చూచిగా మారాయని కెటిఆర్ చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ప్రధానమంత్రి తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని అమలుచేయడమే దీనికో కారణమన్నారు. దేశాన్ని పరిపాలించిన 15 మంది ప్రధాన మంత్రులకు రాని ఆలోచనలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రావడమే దీనికి కారణమన్నారు. ఈ పరిస్థితుల్లో సిఎం కెసిఆర్‌కు 16 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉంటే దేశంతో పాటు రాష్ట్రాభివృద్ధి వేగవంతం అవడంతో పాటు కాళేశ్వరం తదిర తెలంగాణప్రాజెక్టుకు జాతీయ హోదా పరుగెత్తుకుంటూ వస్తుందని చెప్పారు. సాగునీరు పుష్కలంగా ఉన్న ఆంధ్ర పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందే కానీ తరతరాలనుంచి సాగునీరు కోసం తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం నిర్లక్షం చేసిందని కెటిఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాకావాలని మోడీని అడిగితే ముసిముసినవ్వులతో మురిపించి పూలమాలలు వేసుకుని ఢిల్లీకి వెళ్లారేకానీ హోదా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేలకోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి అయోగ్ కేంద్రానికి సిఫారసు చేసినా 24 పైసలు కూడా మంజూరు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణపై మోడి ప్రభుత్వం వివక్ష చూపుతుందని కెటిఆర్ ఆరోపించారు. 16 మంది టిఆర్‌ఎస్ ఎంపి లు ఢిల్లీలో ఉంటే జాతీయ హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ మొండి చేయి చూపారని విమర్శించారు. ప్రస్తుతం మోడీ పరిస్థితి బాగాలేదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ విభేదాలతో కాంగ్రెస్, మతవిద్వేషాలతో బిజెపి రాజకీయం చేస్తుందే కానీ దేశప్రజల ప్రయోజనంకోసం కాదని కెటిఆర్ నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలను ఎన్నికల్లో ప్రజలు తరిమివేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ కోటిఎకరాల మాగాణి కావాలి

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకరించకపోయినా, కాళేశ్వరం, చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నిధులతోనే నిర్మించి తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమేరకు ఫలితాలు వస్తున్నాయనీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కోటిఎకరాల్లో సాగునీరు పరవళ్లు తొక్కుతుందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టుల్లో గోదావరి జలాలను నింపేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనివార్యమైందన్నారు. నిజమాబాద్ జైలు గోడలపై మహాకవి దాశరథి బొగ్గుతో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాస్తే.. ముఖ్యమంత్రి నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణం అని, దాన్ని సాకారం చేసేందుకు తపిస్తున్నారన్నారు. ఉమ్మడిపాలకులు నీరు లేని తెలంగాణలో గోదావరి జలాలకు అడ్డుకట్టవేసి ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచనకూడా చేయలేకపోవడం విచారకరమన్నారు. గోదావరి నీటిపై ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు.

తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర గ్రామాల ఆసక్తి

ముథోల్ నియోజకవర్గం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉండటంతో విభిన్న భాషల సంస్కృతి ఇక్కడ అగుపిస్తుందన్నారు. మరాఠీ, తమిళం, కన్నడం, హిందీ మాట్లాడేవారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. జహీరాబాద్ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రకు చెందిన 40 గ్రామపంచాయితీలు ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపాయని కెటిఆర్ వెల్లడించారు. అక్కడి స్థానిక ఎంఎల్‌ఏ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మహారాష్ట్రలో జరగడంలేదనీ, కెటిఆర్ కిట్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు అక్కడ లేకపోవడంతో తమను తెలంగాణ రాష్ట్రంలోని ముథోల్ నియోజకవర్గంలో కలపాలని 40 గ్రామాలు ముందుకు రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. 24 గంటలు రైతులకు విద్యుత్ సరఫరాచేస్తున్న ఏకైక రాష్ట్రంగా దేశంలో తెలంగాణకు గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతి

రైతులకు ఇంకా… ఇంకా ఏదోచేయాలనే తపనతో ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం తపిస్తూ నూతన పథకాలు రూపొందిస్తుంటారని కెటిఆర్ చెప్పారు. స్వయం గా ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు కావడంతో రైతుల కష్టాలు ఆయనకు తెలుసన్నారు.అందుకే రైతుబంధు ప్రవేశపెట్టి ఎకరానికి 4వేల పంటపెట్టుబడి ఇచ్చినా మరింత సహాయం చేయాలనే తపనతోనే ఎకరాకు రూ.5వేలు పెంచి ఏఫ్రిల్ నుంచి అమలుచేయనున్నారన్నారు. వ్యవసాయరంగానికి కరెంట్ కోత లేకుండా, ఎరువుల సమస్య రాకుండా, సాగునీటి కోరత లేకుండా కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు జరగాలంటే సిఎంకెసిఆర్‌కు 16 మంది పార్లమెంట్ సభ్యుల బంలం తోడైతే కేంద్రంలో తెలంగాణ సత్తా, తెలంగాణ పౌరుషం చూపిస్తారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో భూనిర్వాసితుల కష్టాలను అనుభవించిన కుటుంబం కెసిఆర్‌దని కెటిఆర్ చెప్పారు. కెసిఆర్ పూర్వీకులు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండలం పోచాన్‌పల్లికి చెందినవారని గుర్తు చేశారు.అప్పర్‌మానేరుప్రాజెక్టు నిర్మాణంలో పోచాన్‌పల్లి భూములు కోల్పోవడంతో కెసిఆర్ తల్లిదండ్రులు చింతమడక గ్రామానికి వచ్చారని చెప్పారు. అలాగే మిడ్‌మానేరు నిర్మాణంలో కొదురుపాక భూములు పోవడంతో మాఅమ్మ వాళ్లభూములు ముంపుకు గురయ్యాయని కెటిఆర్ తెలిపారు. మాచుట్టరికాలు, బంధువులు ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పారు. భూనిర్వాసితుల బాధలు, రైతుల కష్టాలు అనుభవించిన సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నిజాంసాగర్‌ను నింపి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

దేశానికి కెసిఆర్ నాయకత్వం కావాలి : కిరణ్

తెలంగాణ మాదిరిగా దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కెసిఆర్ నాయకత్వం దేశానికి అవసరమని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ క్రాంతి కిరణ్ చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే మోడి కాపీ కొట్టారని చెప్పారు.పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించేందుకు నిరంతరం శ్రమించనున్నట్లు హామీ ఇచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నప్పుడు తెలంగాణ సిఎం కెసిఆర్‌కు 16 మంది ఎంపిలు తోడైతే కేంద్రాన్ని శాసించే స్థాయిలో తెలంగాణను నిలబడుతుందన్నారు.

దేశం దృష్టి తెలంగాణ వైపే : సురేష్ రెడ్డి

దేశంలో కులం.మతం, ప్రాంతీయ విభేదాలను సృష్టించి కాంగ్రెస్,బిజెపి అధికారాం చెలాయించాలని ప్రయత్నిస్తున్నాయని శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి చెప్పారు. ప్రస్తుత దేశరాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి అవసరమని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో నిజమాబాద్ జిల్లా అభివృద్ధి 16వ స్థానానికి దిగజారగా టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు. దేశప్రజలంతా తెలంగాణవైపు చూస్తున్నప్పుడు కెసిఆర్‌కు పార్లమెంట్ సభ్యుల బలం ఉంటే దేశరాజకీయాల్లో చరిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.

సిఎం కెసిఆర్‌తో కలిసి పనిచేయడం : వేముల

ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మిషన్ భగీరథ పథకం నిర్మాణపు పనుల్లో కలిసి పనిచేయడంతో పాటు మంత్రివర్గంలో పని చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తానని మంత్రి వేముల నరేందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో 24 గంటలు కలిసి పనిచేసే అరుదైన అవకాశం నాకు మాత్రమేలభించిన అదృష్టమన్నారు. సిఎం కెసిఆర్ ప్రతి క్షణం రైతులు, పేదలు, యువత గురించి ఆలోచిస్తుంటారని చెప్పారు. రైతుబిడ్డ కావడంతో రైతులపైనే అత్యధికంగా దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు రైతు సమస్యలను సమీక్షిస్తారని వేముల చెప్పారు.