Home తాజా వార్తలు భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలి

భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలి

పార్లమెంటు ఎన్నికల్లో కారుకు అఖండ మెజారిటీని అందించండి
రాష్ట్రంలోని 16 స్థానాలను గెలిచి ఢిల్లీ కోటను శాసిద్దాం
భువనగిరిలో రాహూల్ గాంధీ పోటీ చేసినా ఓటమి తప్పదు
నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కావాలంటే కెసిఆర్‌తోనే సాధ్యం
మునుగోడులో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు మళ్లీ జరగొద్దు
17న నిర్వహించే సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయండి
చౌటుప్పల్‌లో విలేకర్ల సమావేశంలో ఎంపి బూర, కూసుకుంట్ల

 

మన తెలంగాణ / చౌటుప్పల్: ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో భువనగరి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి భువనగిరి కోటపై మరోసారి గులాబీ జెండాను ఎగుర వేయాలని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మునుగోడు అభివృద్దికి సంభిందించిన కరపత్రంను ఆవిష్కరించారు. అనంతరం మునుగోడు మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీని ఎలా అందించారో అదే స్ఫూర్తితో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 16 ఎంపి స్థానాల్లో టిఆర్‌ఎస్ ను గెలిపించి సత్తా చాటాలన్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్ధేశం చేయనున్నాయని తెలిపారు. ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించే బలాన్ని టిఆర్‌ఎస్‌కు అందించాలని ఆయన కోరారు. తద్వారా రాష్ట్ర అభివృద్దికి మార్గం సుగమమై నిధుల వరద పారనుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నుంచి 33 మంది ఎమ్మెల్యేలు వున్నా ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదన్నారు. అభివృద్ది పరంగా తీవ్రంగా నష్ట పోయామని తెలిపారు. కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన వారు ఏ రాష్ట్రానికి సంభందించిన వారు హోదాలో వుంటే నిధులన్నీ ఆయా రాష్ట్రాలకే తరలించుకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన రాహూల్ గాంధీ తెలంగాణకు ఏమివ్వ దలుచుకున్నారో ఎందుకు ప్రకటించడం లేదని బూర ప్రశ్నించారు.

పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే చేతులారా చేటును కొనితెచ్చుకున్నట్లేనని పేర్కొన్నారు. భువనగిరిలో రాహూల్ గాంధీ పోటీ చేసినా చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో టిఆర్‌ఎస్ ఈ ప్రాంత అభివృద్ది కోసం సిసి రోడ్లు, పాస్‌పోర్టు కేంద్రం, రోడ్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు ఇలా ఇంకా అనేకమైనవి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదన్నారు. సుమారుగా ఎన్‌డిఎకు 150, కాంగ్రెస్‌కు 100 స్థానాలు వస్తే మరో 70 మంది ఎంపిలు టిఆర్‌ఎస్ నేతృత్వంలోని ఫెఢరల్ ఫ్రంట్‌కు మద్దతివ్వనున్నారని తెలిపారు. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా అప్పుడు మనం చెప్పినట్లు వినాల్సిందేనన్నారు. గతంలో ప్రతిపాదించిన హైద్రాబాద్, విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేను 6 లైన్ల రోడ్డుగా విస్తరించు కునేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు.

మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అయినా మనవేలితో మనకళ్లనే పొడుచుకున్న విధంగా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం మునుగోడులో ఎమ్మెల్యే పిఎల పెత్తనం పైనే పాలన సాగుతుందన్నారు. కాంగ్రెస్‌ది ఆర్భాటమే తప్ప అభివృద్ది చేసేదేమీ లేదన్నారు. ఈ నెల 17 న గుడిమల్కాపురం శివారులోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న టిఆర్‌ఎస్ సన్నాహక సమావేశానికి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ ముఖ్య నేతలు, బూత్ కమిటీల సభ్యులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. భువనగిరిలో తనను తిరిగి ఎంపిగా భారీ మెజారిటీతో గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ వీర సైనికుడిలా అభివృద్ది కోసం పని చేస్తానని ఎంపి బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. అలాగే మునుగోడు మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నేటికి రెండు సార్లు టిఆర్‌ఎస్ పార్టీకి భారీ మెజారిటీ అందించి కెసిఆర్‌కు పరిపాలనా భాద్యతలు అప్పగించడం ఎంతో ఆనంద దాయకమన్నారు. కానీ ఈ సారి రాష్ట్రమంతా ఒకలావుంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు ప్రలోభాలకు లోనై డబ్బు సంచులతో వచ్చిన వ్యక్తికి అమ్ముడు పోవడం భాదాకర మన్నారు.

ఓటేసిన తరువాత ఇప్పుడు భాద పడి ప్రయోజనం లేదన్నారు. ఎమ్మెల్యే పదవి, ఓటేసిన ప్రజలు ఇక్కడుంటే ప్రజల బాగోగులు పట్టని ఆయన మాత్రం ఢిల్లీలో వుంటాడని ఎద్దేవా చేశారు. చుట్టపు చూపుగా వచ్చిపోయే ప్రజా ప్రతినిధులతో నియోజక వర్గానికి ఒరిగేదీమీ వుండదన్నారు. అభివృద్ది, నిధులు, ఉద్యోగాలు ఏవి కావాలన్నా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసేందుకు సిఎం కెసిఆర్ సిద్దంగా వున్నారన్న విషయాన్ని ప్రజలు మరవ వద్దన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వెల వెల బోతుందన్నారు. అందులో గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు సైతం కెసిఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దపడి కారెక్కుతున్నారని పేర్కొన్నారు. భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్య యాదవ్‌లు పాల్గొననున్న టిఆర్‌ఎస్ సన్నాహక సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్యులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా రూ.6600 కోట్ల వ్యయంతో శివన్నగూడెం, లక్ష్మాపురం రిజర్వాయర్ ద్వారా 2,07,127 ఎకరాలకు సాగునీరు అందించే పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

ఎకరానికి ఒక ఓటు చొప్పున వేసినా టిఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. 2 లక్షల పైచిలుకు ఎకరాలకు నీళ్లు కావాలా…. లేక ఒకరోజు ప్రలోభాలకు గురిచేసే వారు కావాలో ప్రజలే తేల్చు కోవల్సిన సమయం ఆసన్న మైందన్నారు. సాగు, త్రాగు నీరుతో పాటు చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ద్వారా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించ నున్నాయని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్ర భవిష్యత్తును స్వర్గధామంలా తీర్చి దిద్దేందుకు కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాలన్నారు. భువనగిరి ఎంపి స్థానంలో పోటీ చేస్తున్న బూర నర్సయ్యగౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించి సిఎం కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, అందెల లింగం యాదవ్, మార్కెట్ ఛైర్మన్ బొడ్డు రేవతి శ్రీనివాస్‌రెడ్డి, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, చింతల దామోదర్‌రెడ్డి, ఊడుగు మల్లేషంగౌడ్, సుర్వి మల్లేష్‌గౌడ్, ఎం.డి.ఖలీల్, కానుగు బాలరాజు, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, శాదీఖానా ఛైర్మన్ రహీం, మునుకుంట్ల సత్యనారాయణగౌడ్, నల్ల గణేష్, ఢిల్లీ మాధవరెడ్డి, వీరమళ్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Parliament Elections: TRS Party will Won in Bhongir