Wednesday, April 24, 2024

రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి

- Advertisement -
- Advertisement -

Parliamentary Party meeting

 

పార్లమెంట్‌లో మన వాణి గట్టిగా వినిపించండి

రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్‌టి, ఐజిఎస్‌టి బకాయిల గురించి అడగండి
మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు
రైతుబంధు, హరితహారం, కాకతీయ, కాళేశ్వరం, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వివరించండి
– తెలంగాణభవన్‌లో టిఆర్‌ఎస్ ఎంపిలకు కెటిఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపాదికగా త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తాలని ఎంపిలకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దశా, దిశాను నిర్దేశించారు. ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3వేల కోట్ల జిఎస్‌టి, ఐజిఎస్‌టి బకాయిలపైన పార్లమెంట్‌లో గట్టిగా పార్టీ వానిని వినిపించాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, కార్యక్రమాలకు ప్రసంశలే కానీ ప్రత్యేక నిధులు దక్కని తీరు గురించి ప్రస్తావించాలని కెటిఆర్ సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న 2020..2021 వార్షిక బడ్జెట్ లో తెలంగాణకు దక్కాల్సిన నిధులు, దీర్ఘకాల డిమాండ్స్, ప్రాజెక్టులను గురించి నిధుల కేటాయింపుపైన నిలదీయాలని ఆదేశించారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంటరీ పార్టీ నేతలతోపాటు రాజ్యసభ, లోక్ సభ సభ్యులు హజరయ్యారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన పార్టీ వ్యూహంపైన కెటిఆర్ ఈ సమావేశంలో దిశా నిర్ధేశం చేశారు.. వివిధ పథకాలకు ఆర్ధిక సహాయం చేయాలని నీతి అయోగ్ ప్రాతిపాదించినప్పటికీ రాష్ట్రానికి ఇప్పటిదాక కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాని విషయాన్ని ప్రస్తావించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, పథకాల స్పూర్తిగా కేంద్రం పలు కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రైతుబంధు, రైతుబీమా, తెలంగాణకు హరితహారం, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు, అరోగ్యశ్రీ వంటి అంశాలపైన పార్లమెంట్ లో ప్రస్తావించాలన్నారు.

ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టినా కేంద్రం నుంచి నయాపైసా ప్రత్యేక నిధులు కేటాయించని కేంద్రం తీరుపైన పార్లమెంట్‌లో నిలదీయాలని సూచించారు. బడ్జెట్ ద్వారా తెలంగాణ దక్కాల్సిన నిధులు, దీర్ఘకాల డిమాండ్స్, ప్రాజెక్టులను గురించి నిధుల కేటాయింపుపైన కూడా నిలదీయాలని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అడిగిన ఐఐఎం, ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు, నేషనల్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ కేటాయింపుల వంటి వినతులను మరోసారి సభలో లేవనెత్తాలన్నారు.

సిఎఎ, ఎన్‌ఆర్‌సి వంటి వాటిపైన సిఎం కెసిఆర్ తీసుకున్న స్టాండ్ మేరకు సభలో ఎంపిలు వ్యవహరించాలని సూచించారు. దేశం సంక్లిష్ట పరిస్ధితిలోకి దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సమస్యగా మారిన నిరుద్యోగం, అర్ధిక వ్యవస్ధ వంటి కీలకమైన ప్రజోపయోగ అంశాలపైన కేంద్రం ఫోకస్ చేసే విధంగా ఎంపిలు సభలో ఒత్తిడి తీసుకరావాలని కెటిఆర్ సూచించారు.

ప్రజలకు అవసరం లేని సిఎఎ, ఎన్‌ఆర్‌సి వంటి రాజకీయపరమైన అంశాలను పక్కన పెట్టాలని కేంద్రానికి పార్లమెంట్ వేదికగా సూచించాలన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలపైన ప్రధాన దృష్టి సారించాలని కేంద్రానికి సూచించాలన్నారు. అవసరం అయితే కేంద్రం తీసుకున్న నినాదాలు, విధానాలతో మందకొడి మారిన ఆర్ధిక వ్యవస్ధ, వృద్ధి రేటుపైన, శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలపైన దాని ప్రభావాన్ని లేవనెత్తాలని కెటిఆర్ పేర్కొన్నారు.

అనంతరం బడుగు, బలహీన, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు చరిత్రలో ఎన్నడు లేని విధంగా భారీ ఎత్తున పురపాలక పదవుల్లో అవకాశం కల్పించిన సిఎం కెసిఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ పార్లమెంటరీ పార్టీ సమావేశం తీర్మాణం చేసింది. పార్టీ అధికారంలో వచ్చిననాటి నుంచి ఆయా వర్గాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు చేపట్టిన ముఖ్యమంత్రి, రాజకీయంగా కూడా వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ద వహించడం పట్ల కృతఘ్నతలు తెలిపింది.

పురపాలిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించేందుకు సిఎం, పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే సాధ్యమైందని సమావేశం అభిప్రాయపడింది. అంతకుముందు పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభంలో పార్టీని విజయవంతంగా పురపాలక ఎన్నికల్లో నడిపించిన కెటిఆర్‌కు ఎంపిలు ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్, రాములు, మాలోతు కవిత, పి. దయాకర్, బండ ప్రకాశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రాన్ని నిలదీస్తాం
టిఆర్‌ఎస్‌పిపి నేత కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాల పై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. కెటిఆర్ అధ్యక్షత జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం చెల్లించాల్సిన బకాయిలపై పార్లమెంటులో నిలదీస్తామన్నారు. తెలంగాణ సాగునీటి రంగం లో సాధించిన విజయాలను పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని వారు తెలిపారు. అలాగే సిఎఎ, ఎన్‌పిఆర్‌ల టిఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా పార్లమెంట్‌లో చెప్పనున్నామని తెలిపారు. ఎన్‌పిఆర్‌లో ఒబిసి జన గణన చేర్చాలని డిమాండ్ చేస్తామన్నారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాల పై పార్లమెంటును వేదిగ్గా చేసుకుని పోరాడతామన్నారు.

బుధవారం జరిగే అఖిల పక్ష సమావేశంలోనూ టిఆర్‌ఎస్ ప్రాధాన్యత గల అంశాల ను పార్లమెంటు సమావేశాల ఎజెండా లో చేర్చాలని డిమాండ్ చేస్తామన్నారు. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు నిధులు కేటాయింపు తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయని, దీనిపైన కేంద్రాన్ని నిలదీస్తామని తెలిపారు. కేంద్ర మంత్రులు పొలిటికల్ హామీలు ఇస్తూ, వాటి అమలు చేయడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ధిక మాంద్యం దెబ్బతిన్నా….తెలంగాణలో మాత్రం ప్రభుత్వ పాలన సజావుగా సాగుతోందన్నారు. ఇది సిఎం కెసిఆర్ పాలనకు, ముందుచూపుకు నిదర్శమని వ్యాఖ్యానించారు. అందుకే ఇటీవల జెఐఐ ఇచ్చిన నివేదికలోనూ తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

Parliamentary Party meeting in Telangana Bhawan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News