Thursday, April 25, 2024

ఫెయిలైనోళ్లంతా పాస్

- Advertisement -
- Advertisement -

Pass all those who failed in Inter first Year: Minister Sabitha

51శాతం మంది విద్యార్థులకు ఊరట

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో తప్పిన అందరికీ
కనీస మార్కులు ముఖ్యమంత్రి కెసిఆర్
ఆదేశాల మేరకు నిర్ణయం ఇదే ఆఖరు..
సెకండియర్‌లోనూ పాస్ చేస్తామని ఆశించొద్దు
ఫలితాలపై విమర్శలు సరికాదు, ఇంటర్
బోర్డు తప్పేమీ లేదు రాజకీయాలు పక్కన
పెట్టి విద్యార్థుల భవిష్యత్‌పై ఆలోచించాలి :
మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు విద్యార్థులందరికి కనీసం 35 మార్కులు ఇచ్చి అందరినీ పాస్ చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై ఆమె మాట్లాడారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ కనీస మార్కులతో పాస్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మంచి మార్కులు సాధించాలి. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్ సెకండియర్‌లో కూడా పాస్ చేస్తారని ఆశించవద్దు” అని మంత్రి విజ్ఞప్తి చేశారు.‘కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొన్నాం.

ఆ ప్రత్యేక పరిస్థితుల్లో తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం. దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాం. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమన్వయం చేశాం. 9, 10 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశాం. విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య చాలా కీలకం. 620 గురుకులాలను, 172 కస్తూర్బా కళాశాలలకు ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేశాం. ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. టీ-శాట్, దూరదర్శన్ వెబ్‌సైట్‌ల ద్వారా పాఠాలు అందుబాటులో ఉంచాం. నెలరోజుల సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహించాం. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.4.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 49శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదు. 10వేల మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించారు. ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారు. ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరం. పార్టీలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతి విషయం రాజకీయ కోణంలో చూడొద్దు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు.

ఇంటర్ విద్యార్థులకు కనీస మార్కులతో న్యాయం : ఆర్ కృష్ణయ్య

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను కనీస మార్కులతో పాస్ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నామని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.శుక్రవారం ఉదయం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని కలిసిఆయన వినతిపత్రం అందజేశారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అతి తక్కువగా ఉత్తీర్ణత రావడంతో విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. కరోనా కారణంగా 20 నెలలుగా బోధన తరగతులు నిర్వహించకపోవడం..ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులో లేవన్నారు. ఈ సమయంలో పరీక్షలు పెట్టడం తప్పు… విద్యార్థులకు మార్కులెలా వస్తాయన్నారు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని కారణంగా విద్యార్థులు నష్టపోయారని గుర్తుచేశారు.

వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరిని పాస్ చేయాలని కోరారు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులను అందరిని ఉత్తీర్ణులను చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జూనియర్ ఇంటర్ విద్యార్థులను కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేస్తూ ప్రకటించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి ప్రకటనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణా బిసి ఫ్రంట్ చైర్మన్ గొరిగ మల్లేష్, బిసి వెంకట్, సైదులుగౌడ్, చంటి ముదిరాజ్. నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News