Home తాజా వార్తలు ఆటోమొబైల్ అధ్వాన్నం

ఆటోమొబైల్ అధ్వాన్నం

vehicle sales

 

నెలనెలా క్షీణిస్తున్న విక్రయాలు

జూన్‌లో ప్యాసింజర్ వాహన సేల్స్ 18 శాతం డౌన్
25 శాతం తగ్గిన కార్ల అమ్మకాలు

అన్ని విభాగాల్లో ప్రతికూల వృద్ధి : సియామ్ నివేదిక

ముంబై : ప్రస్తుత దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ బాగోలేదు అనే కంటే అధ్వాన్న స్థాయికి పడిపోయింది అనొచ్చేమో.. ఏడాది కాలంలో వరుసగా అమ్మకాలు తగ్గతూ రావడం, అన్ని విభాగాల్లోనూ తాజా గణాంకాల్లో క్షీణిత చూస్తే ఆందోళన కలుగకమానదు. దేశీయంగా వాహన విక్రయాలు నెల నెలా పతనమవుతూ వస్తున్నాయి. జూన్‌లో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 17.54 శాతం తగ్గగా, కార్ల సేల్స్ 25 శాతం పడిపోయాయి. 201920 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాహన ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే 10.53 శాతం తగ్గింది. సంఖ్యా పరంగా చూస్తే గత మూడు నెలల కాలంలో మొత్తం వాహనాల ఉత్పత్తి 72 లక్షలు ఉండగా, గతేడాది ఇదే సమయంలో 80 లక్షల ఉత్పత్తి ఉంది. గత నెలలో వాహన సేల్స్ మరింత తగ్గుముఖం పట్టాయి. గత నెలలో కంపెనీలు 13 శాతం మేరుకు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. ప్యాసింజర్ కార్లు వంటి విభాగంలో అమ్మకాలు 25 శాతం తగ్గాయి. ఆర్థిక వ్యవస్థకు సంకేతమైన గూడ్స్ వాహనాల సేల్స్ 18 శాతం పడిపోగా, స్కూటర్ సేల్స్ 15 శాతం క్షీణించాయి. మోటార్‌బైక్‌ల సేల్స్ కూడా 10 శాతం తగ్గగా, మోపెడ్‌లు 22 శాతం డౌన్ అయ్యాయి. ఆర్థిక వృద్ధిలో భారీ తిరోగమనం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ లేకపోవడం వంటివి వాహన అమ్మకాలపై ప్రభావం చూపాయి.

బడ్జెట్‌లోనూ నిరాశ
వినిమయ డిమాండ్ మందగించడం, బీమా ఖర్చులు పెరగడం వంటి ఆటోమొబైల్ సేల్స్‌ను తగ్గిస్తే, మరోవైపు ప్రభుత్వం సానుభూతిలేని వైఖరి వాహన తయారీ కంపెనీలను మరింత నిరాశకు గురిచేసింది. వృద్ధికి ఊతం కల్పించేందుకు వాహనాలపై జిఎస్‌టిని తగ్గించాలని, అలాగే పాత వాహనాలకు స్క్రాపేజ్ పాలసీ రూపంలో బడ్జెట్ ఊరట కల్గవచ్చని పరిశ్రమ భావించగా, అవేమీ జరగలేదు. అంతేకాదు పెట్రోలు, డీజిల్‌పై సెస్, ఆటో పరికరాలపై సుంకం పెంపు వంటి మరింత నష్టాలకు కారణమయ్యాయి.

భారంగా మారిన బిఎస్6
వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బిఎస్6 పర్యావరణ ప్రమాణాలు వాహన తయారీ పరిశ్రమలు భారంగా మారాయి. ఈ ప్రమాణాలకు తగ్గట్టుగా వాహనాలను మార్పు చేసేందుకు కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది.

ఉద్యోగాల కోతకు దారితీయొచ్చు
సమస్యల (అమ్మకాల్లో క్షీణత)ను పరిష్కరించనట్లయితే స్వల్ప కాలంలో ఇది మందిపై ప్రభావం చూపే అవకాశముందని వధేరా హెచ్చరించారు. మరిన్ని ఉపాధి అవకాశాలు తగ్గడమే కాకుండా ఉద్యోగాల కోతకు దారితీసే అవకాశముందని అన్నారు. ఆపరేటింగ్ వ్యయాల కంటే దిగువకు ఆదాయం ఒక్కసారి తగ్గిందంటే, ప్రత్యామ్నాయం ఉండబోదని ఉద్యోగాల కోతేనని అన్నారు. ఇటీవల నెలల్లో దేశంలో దాదాపు 300 ఆటో డీలర్‌షిప్‌లు మూసివేసినట్టు వాహన డీలర్ల అసోసియేషన్ సమాఖ్య ఇప్పటికే ప్రకటించింది. దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీతో పాటు పలు తయారీ సంస్థలు ఇటీవల వరుసగా ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నాయి.

ఇది ప్రతికూల దశ
సియామ్ ప్రెసిడెంట్
‘దేశీయ ఆటో పరిశ్రమకు ఇది అధ్వాన్నమైన దశగా భావిస్తున్నాను’ అని గణాంకాలు విడుదల చేసే సందర్భంగా సియామ్ (దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంస్థ) అధ్యక్షుడు రాజన్ వధేరా అన్నారు. 2009, 2011, 2012 సంవత్సరాల్లో ప్రతికూల వృద్ధి దశను చూశామని, అయితే ప్రభుత్వం చొరవ తీసుకుని పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పరిస్థితి మెరుగైంది. ఇది కూడా అలాంటి ప్రతికూల దశలా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇది దేశానికి మంచి పరిణామం కాదని, ఇది ఉద్యోగాలకు సానుకూలం కాదని ఆయన పేర్కొన్నారు. దేశీయ ఆటో పరిశ్రమలో 3.7 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని అంచనా.

ద్విచక్ర వాహన సేల్స్‌లో 12% క్షీణత

జూన్‌లో దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 2,73,748 యూనిట్ల నుంచి 2,25,732 యూనిట్లకు అంటే 17.54 శాతం తగ్గాయి. అలాగే దేశీయంగా కార్ల విక్రయాలు గతేడాదిలో 1,83,885 యూనిట్లు నమోదవగా, ఈసారి 1,39,628 యూనిట్లకు తగ్గుముఖం పట్టాయి. అంటే కార్ల సేల్స్ 25 శాతం పడిపోయాయి. ఈమేరకు సియామ్ బుధవారం వాహన సేల్స్ గణాంకాలను విడుదల చేసింది. మోటార్‌సైకిల్ సేల్స్ 9.57 శాతం తగ్గాయి. ఇవి గతేడాదిలో ఇవి 11,99,332 యూనిట్లు ఉంటే, గత నెలలో 10,84,598 యూనిట్లకు దిగొచ్చాయి. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు జూన్‌లో 11.69 శాతం క్షీణించాయి. 18,67,884 యూనిట్ల నుంచి 16,49,477 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాలు 80,670 యూనిట్ల నుంచి 70,771 యూనిట్లతో 12.27 శాతం క్షీణించాయని సియామ్ వెల్లడించింది.

Passenger vehicle sales decline by 18% in June