Saturday, April 20, 2024

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేనాని భేటీ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్రమంత్రులు, బిజెపి నేతలతో భేటీలు జరుపుతున్న వేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు ప్రెస్‌మీట్లలోనూ విలేకరులు విలీనంపై ప్రశ్నలు అడిగారు. జాతీయ చానల్స్ కూడా బిజెపిలో జనసేన విలీనం ఉంటుందా? అని ఆరాతీయడంతో పవన్ అసహనానికి లోనయ్యాడు. ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి రెండు పార్టీల ముఖ్యనేతలు కీలక ప్రకటన చేశాయి. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మ్రంతి నిర్మలా సీతారామన్‌తో భేటీ తర్వాత, రాత్రి బిజెపి-జనసేన సమన్వయ కమిటీ సమావేశం తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆయా సందర్భాల్లో విలేకరులు అడిగిన ప్రధాన ప్రశ్న విలీనం అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బిజెపిలో జనసేన ఎన్నటికీ విలీనం కాబోదు. కలిసి పనిచేయాలని మాత్రమే మనం నిర్ణయించుకున్నాం అని వివరించారు.
ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్‌మార్చ్
ఏపిలో ఇకపై ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా రెండు పార్టీలు కలిసే నిర్వహిస్తాయని బిజెపిజనసేన కూటమి నేతలు ప్రకటించారు. వైసీపీ సర్కార్‌పై ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు. ముందుగా అమరావతి రైతులకు మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్‌మార్చ్ నిర్వహించాలని రెండు పార్టీల నేతలు నిశ్చయించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు పవన్ నాయకత్వంలో లాంగ్‌మార్చ్ ఉంటుందని సమన్వయ కమిటీ తెలిపింది. సమన్వయ కమిటీ భేటీలో జనసేన తరపున జనసేనాని పవన్‌కల్యాణ్, ముఖ్యనేత నాదెండ్ల మనోహర్, బిజెపి తరపున పార్టీ ఎపి శాఖ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్ నర్సింహారావు, మాజీ ఎంపి పురందేశ్వరి, బిజెపి వ్యవహారాల ఇంఛార్జిలు పాల్గొన్నారు.
15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ భేటీ…
ఇకపై 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశమవుతుందని, ఈ నెల 28న మరోసారి కలిసి లాంగ్‌మార్చ్ ఏర్పాట్లపై చర్చిస్తామని రెండు పార్టీల నేతలు చెప్పారు.
అమరావతి కేంద్రంగా ఉద్యమం
అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుదని, దాని కేంద్రంగా బిజెపిజనసేన సమన్వయ కమిటీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని జనసేనాని వెల్లడించారు. మూడు రాజధానుల విషయంలో వైసిపి సర్కార్‌కు కేంద్రం సమ్మతి లేదని పవన్ తెలిపారు.

Pawan Kalyan Meet with Nirmala Sitharaman at Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News