Wednesday, April 24, 2024

బాబు, పవన్ భాయీభాయీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు దగ్గరపడ్డాకే పొత్తులపై చర్చిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎపిలో ఎమర్జెన్సీని మించి ఆరాచక పాలన సాగుతుందన్నారు. ప్రధానంగా జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల, ప్రజా సంఘాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. దీనిపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ప్రజా స్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకోవడం కోసం ఇటు గవర్నర్ నుంచి అటు రాష్ట్రపతి వరకు అందరి దృష్టికి తీసుకువెళతామన్నారు. అవసరాన్ని బట్టి కేంద్రం కూడా కలుగ జేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ రెండున్నర గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. తాజా గా ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 ద్వారా కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పవన్ తప్పు పట్టారు. ఈ ఘటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు జనసేన అధ్యక్షులు పవన్ సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఇద్దరు నేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే భయంకర పరిస్థితులున్నాయన్నారు. ఎమర్జెన్నీలో రాత్రి పూట పోలీసులు గోడలు దూకి రాలేదన్నారు. కానీ జగన్ పాలనలో రాత్రి పూజ పోలీసులు గోడదూకి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో తన పర్యటనను అడ్డుకున్న వైసిపి ప్రభుత్వం…అంతకుముందు వైజాగ్ లో, ఇప్పటంలో పవన్ కల్యాణ్ ను అడ్డుకున్నదని విమర్శించారు. 2019 తరువాత అనేక సందర్భాల్లో వైసిపి ప్రభుత్వం తనను అడ్డుకుందన్నారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు, వైజాగ్, తిరుపతి పర్యటనలకు వెళ్లిన సమయంలో తనను గతంలో ఎలా అడ్డుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళితే వైసిపి కార్యకర్తలు దాడులు చేస్తే…వాటిని కూడా డిజిపి అప్పట్లో సమర్థించారన్నారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ప్రశ్నిస్తే టిడిపి పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాజకీయ పార్టీలకు రాజకీయ విధానాలు ఉంటాయి…కానీ వైసిపి కి మాత్రం రౌడీ యిజం, గుండాయిజం మాత్రమే ఉన్నాయని మండిపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి చట్టం తెరమీదరకు తెచ్చి..దానికి ఉన్న చట్టబద్దత ఏంటో కూడా తెలియకుండా జీవో నెంబర్ 1 అనే నల్ల జీవో తెచ్చి ఆంక్షలు పెట్టారన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన నియోజకవర్గానికి వెళితే అడ్డుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు మూడు వేల మంది పోలీసులను పెట్టి కుప్పంలో తన పర్యటనను అడ్డుకున్నారన్నారు. గత పర్యటనలో కుప్పంలో 74 మందిపై కేసులు పెట్టారన్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన కుప్పం పర్యటనలో చివరికి పోలీసులే మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. దీనిని బట్టి ఎపిలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు.

సిఎం, వైసిపి నేతలు మీటింగ్‌లు, సమావేశాలు పెట్టుకోవచ్చు…కానీ ప్రతిపక్షాలు పెట్టుకోకూడదు అంటున్నారు. కందుకూరు, గుంటూరు ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. ఆ సభలకు బందోబస్తు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.. సభలు, మీటింగ్ లు జరుగుతున్నప్పుడు బందోబస్తు ఇవ్వాల్సిన బాద్యత పోలీసులది కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తామన్నారు. నల్ల చట్టాలపై ప్రజా పోరాటం, న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. పవన్ కల్యాణ్ యాత్రలు చెయ్యకూడదు….లోకేష్ పాదయాత్ర చేపట్టకూడదు అనేది వైసిపి ఆలోచనగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మీడియా, ప్రజా సంఘాలు సహా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. మీడియాకు రాసే స్వేచ్చ, రాజకీయ పార్టీలకు తిరిగే స్వేచ్ఛ ఉంటేనే ప్రజల మనుగడ అని అంతా గుర్తించాలన్నారు. కుప్పంలో తనను వెనక్కి పంపాలి అని చూశారు…కానీ వెనక్కి తగ్గలేదన్నారు. తాను నిలదీస్తే పోలీసులు సమాధానం చెప్పలేదన్నారు.

జీవో నెంబర్ 1 ద్వారా ఆంక్షలు లేవు అన్న బొత్స వ్యాఖ్యలను చంద్రబాబు పూర్తిగా కొట్టిపారేశారు. బొత్స ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తాను మాట్లాడేందుకు లేస్తే ఆయన కూర్చొనేవాడన్నారు. తాను సిఎంగా ఉన్న సమయంలో కూడా అదే రీతిలో వ్యవహరించినట్టుగా చంద్రబాబు గుర్తు చేశారు. కానీ జగన్ మాత్రం ఓ సైకోగా వ్యవహరిస్తున్నాడన్నారు. జగన్ తీరుతో గత నాలుగేళ్లుగా అనేక అవమానాలను ఎదుర్కొన్నట్టుగా చంద్రబాబు చెప్పారు. జగన్ ను ఎదుర్కోనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కంటే జగన్ గొప్పవాడా? ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు ప్రశ్నించారు.

అంతకు ముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కుప్పంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో వైసిపి అరాచకాలపై చర్చించేందుకే చంద్రబాబు నాయుడుని కలిసినట్లు తెలిపారు. తమ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, బ్రిటీష్ జీవో నెం.1తో ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాలపై చర్చించినట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది…ప్రతిపక్షాల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోంది…కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడం సరికాదు అని పవన్ కల్యాణ్ అన్నారు.

రాష్ట్రంలో ఫ్లెక్సీలు నిషేధం అని ప్రభుత్వం చెపుతుంది…కానీ జగన్ పుట్టిన రోజుకు అన్ని చోట్లా ఫ్లెక్సీలు పెడతారు. కోవిడ్ సమయంలో అందరికీ ఆంక్షలు పెట్టారు….కానీ వైసిపి నేతలు మాత్రం నిబంధనలు పాటించలేదన్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 1 కూడా అంతే….ఈ నిబంధనలు అన్నీ ప్రతిపక్షాలకే..అధికార పక్షానికి వర్తించవు అనేది తెలుస్తూనే ఉంది అని పవన్ వివరించారు. సభలు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ చూడాల్సింది ప్రభుత్వ యంత్రాంగమేనని అన్నాపు. ఇక పోలీస్‌లే బందోబస్తు ఇవ్వకపోతే ఏమనాలని ప్రశ్నించారు. పోలీసుల బదులు మేం లాఠీలు పట్టుకోవాలా? అలా అయితే మరి పోలీసులు ఏం చేస్తారని నిలదీశారు.. కందుకూరు, గుంటూరు ఘటనలు సెక్యూరిటీ పరంగా జరిగిన వైఫల్యమన్నారు. కోడికత్తి డ్రామాలు ఆడే పార్టీనే ఈ ఘటనల వెనుకా ఉందన్న అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయన్నారు. తాను యాత్ర కోసం వారాహి కొనుగోలు చేస్తే కూడా వైసిపి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అని పవన్ అన్నారు. ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా ఒకే గళం వినిపించాలి అనేది తమ ఆలోచనగా పేర్కొన్నారు. ఆ అంశంపైనే ప్రధానంగా చంద్రబాబుతో చర్చించామని పవన్ అన్నారు.

ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు?

కాగా ఎపిలో బిఆర్‌ఎస్ పోటీపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవాచ్చు…ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎపిలో బిఆర్‌ఎస్ పోటీ చేస్తే తమకెందుకు అభ్యంతరం ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News