Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపి భవిష్యత్తు, ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు

ఎపి భవిష్యత్తు, ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు

Pawan Kalyan

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బిజెపితో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అప్పట్లో బిజెపికి దూరమయ్యామని, ఎపి అభివృద్ధికి దోహదపడేందుకే మొదట్లో బిజెపితో చెలిమి చేశానన్నారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా బిజెపితో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. రెండు పార్టీల్లో అవగాహన లోపం రాకుండా అన్నీ చర్చించుకున్నామన్నారు.

ఎపి ప్రజల భవిష్యత్ కోసం అంతరాలన్నీ పక్కనబెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామ న్నారు. బిజెపి, జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్‌కళ్యాణ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, జనసేన పార్టీలు రాష్ట్రంలో మూడో ప్రత్నామ్నాయం కానుందన్నారు. మోదీ, అమిత్ షా నమ్మకాన్ని నిలబెడతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో కలిసి నడుస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజధానిపై ఐదు కోట్ల ప్రజలు పెట్టుకున్న ఆశలను వైసిపి వమ్ము చేసిందని ఆయన ఆరోపించారు.

ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించింది టిడిపినే: పవన్
ప్రత్యేక హోదా విషయంపైనా పవన్‌కళ్యాణ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. తనను అడగడం కంటే తెలుగుదేశం పార్టీని ఎక్కువగా అడగాలని, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించింది ఆ పార్టీనేనని ఆయన ఆరోపించారు. 20కి పైగా ఎంపిలున్న వైసిపి పార్టీ హోదా కోసం ఒక్కసారి కూడా మాట్లాడడం లేదని, ఆ పార్టీని ప్రజలు నిలదీయా లన్నారు. హోదా కోసం తాము చేయాల్సిన పోరాటాలన్నీ చేశామని, నిలబడాల్సినంత మేర నిలబడ్డామని, ఎపి అభివృద్ధికి ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎపిలో కులతత్వం పోతేనే అభివృద్ధి సాకారమవుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Pawan Kalyan said Jana Sena join hands with BJP in AP