Home జాతీయ వార్తలు కాపులకు 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ కలిపిస్తాం.!

కాపులకు 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ కలిపిస్తాం.!

Pawan Kalyan today announced his stand on Kapu reservations

పశ్చిమగోదావరి: జనసేన పార్టీ కులాలకు కాదు, మానవత్వానికి అండగా ఉంటుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. జనసేన అధికారంలోకి వస్తే బిసిలకు జనాభా ప్రాతిపదికన, కాపులకు 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. జిల్లాలోని పెనుగొండ మండలం మార్టేరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఎపిలో కులాలకు సరైన ప్రాతినిధ్యం చట్టసభల్లో లేకపోవడంతోనే ఆయా కులాల వాళ్లు వెనుకబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడే వారే లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయాల్లో బాధ్యత తెలిసిన వారే ఉండాలని, రాజకీయ నాయకులు మాటలు తప్పుతుంటే బాధ కలుగుతోందని పవన్ అన్నారు. ప్రజలకు అండగా ఉండి వాళ్ల సమస్యలపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుభవజ్ఞుడు అవసరమని నాడు టిడిపికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రశ్నించే వారిని దోపిడీలు చేస్తున్న వారు తిడుతుంటే చూస్తూ కూర్చోమని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. మీకు అనుకూలంగా ఉంటే మంచివాళ్లు..? లేకపోతే చెడ్డవాళ్లా..? అని ఆయన ప్రశ్నించారు. సిఎం చంద్రబాబులా కులాల మధ్య చిచ్చు పెట్టనని, ప్రజలకు సమ న్యాయం చేస్తానని సభలో ప్రజలకు జనసేనాని హామీ ఇచ్చారు.