Home తాజా వార్తలు దీపావళిలోగా పాడి ప్రోత్సాహకం

దీపావళిలోగా పాడి ప్రోత్సాహకం

Talasani-Srinivas-Yadav

పెండింగ్ బకాయిలు రూ.45 కోట్లు చెల్లిస్తాం
 గొర్రెల సంఖ్య 48.74 శాతం పెరిగి, దేశంలోనే నెంబర్ వన్ స్థానం
 13.20 శాతం తగ్గిన ఆవుల సంఖ్య
 పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మన తెలంగాణ/హైదరాబాద్ : పాడిరైతులకు ప్రభుత్వం చెల్లించే లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకాన్ని దీపావళిలోగా చెల్లించనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. విజయడెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీ, మదర్ డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు పెండింగ్‌లో ఉన్న రూ. 45 కోట్లను ఈ దీపావళి పండుగలోపే చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులతో సోమవారం సమీక్ష చేశారు. గొర్రెల పంపిణీ పథకంతో రికార్డు స్థాయిలో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం వెలువరించి న 20వ అఖిల భారత పశుగణన నివేదికల ప్రకారం 2012లో 128 లక్షల గొర్రెలు ఉండగా, ప్రస్తుతం రికా ర్డుస్థాయిలో 48.74 శాతం పెరిగి 191 లక్షలకు గొర్రెల సంఖ్య చేరిందని పేర్కొన్నారు. గొర్రెల అభివద్ధి లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణం అన్నారు. 20 వ అఖిలభారత పశుగణన కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని 92.51 లక్షల గృహాలలో అక్టోబర్ 1, 2018 నుండి జులై 31,2019 వరకు నిర్వహించామన్నారు.

ఈ పశుగణన కార్యక్రమం 10,764 గ్రామాలు, 101 పట్టణాలు, మున్సిపాలిటీలలోని 2070 వార్డులలో సమాచారం సేకరించడం జరిగింది. మొదటిసారి ఈ పశుగణనను పూర్తిస్థాయి సాంకేతికతతో ట్యాబ్లెట్ కంప్యూటర్స్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో డాటా సేకరించడం జరిగింది. ఈ పశుగణ న నిర్వహించడానికి 2440 మంది ఎన్యుమరేటర్లు, 675 మంది సూపర్‌వైజర్లు మరియు పరిశీలన అధికారులను నియమించడం జరిగింది. కేంద్ర పశు సంవర్థక శాఖ విడుదల చేసిన 20వ అఖిలభారత పశుగణన ప్రకా రం 2012లో తెలంగాణలో పశుసంపద 26.7 మిలియ న్ల నుండి 22.21 శాతం పెరిగి 32.6 మిలియన్లకు చేరుకుంది. తెలంగాణలో 2012లో 12.8 మిలియన్ల గొర్రెలుండగా, ఇప్పుడు రికార్డుస్థాయిలో 48.74 శాతం పెరిగి 19.1 మిలియన్లకు చేరుకుంది. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం ప్రభావం ఈ వృద్ధిలో ఎంతో ఉంది. 2012లో మేకల సంఖ్య 45.75 లక్షలు ఉండగా, ఇప్పుడు 7.98 శాతం పెరిగి 49.40 లక్షలకు చేరుకుంది.

గేదెల సంఖ్య 2012లో 41.60 లక్షలు ఉండగా, ఇప్పుడు 1.78 శాతం పెరిగి 42.34 లక్షలకు చేరుకుం ది. 2012లో ఆవుల సంఖ్య 48.8 లక్షలు ఉండగా, 13.20 శాతం తగ్గి 42.36 లక్షలకు చేరుకుంది. కోళ్ళ సంఖ్య 2012లో 80.8 మిలియన్లు ఉండగా, ఇప్పుడు 0.93 శాతం తగ్గి 80 మిలియన్లకు చేరుకుంది. ఈ పథకంలో ప్రతిగొర్రెకు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 59,301 గొర్రెలకు ఇన్సూరెన్స్ పరిహార ం చెల్లించగా, వాటిలో 36,559 చనిపోయిన గొర్రెకు బదులుగా గొర్రెను అందజేయడం జరిగిందన్నారు.
పశువైద్యశాలల ఆధునీకరణ
30, 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పశువైద్యశాలల్లో సుమారు 565 పశు వైద్యశాలలను 12.18 కోట్ల రూపాయల ఖర్చుతో అభివద్ధి చేసి వాటిలో అన్నిరకాల పరికరాలు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన వివరించారు. కేంద్రపశుసంవర్థకశాఖ వెల్లడించిన 20 వ పశుగణనలో గొర్రెల అభివద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 76.81 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా, వాటికి 70.88 లక్షల పిల్లలు పుట్టాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు సుమారు 35,440 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అధికంగా జరిగిందని వివరించారు.

Pay Rs 4  litre of milk  Government to dairy farmers