Home తాజా వార్తలు కలప స్మగ్లర్లపై పిడి యాక్టు !

కలప స్మగ్లర్లపై పిడి యాక్టు !

Accusedగోదావరిఖని: రామగుండం కమీషనరేట్ పరిధిలో కరుడుగట్టిన కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనివాస్ అలియాస్ పోతారం శ్రీనుతో పాటు ఆతని ప్రధాన అనుచరులు కుడుదల కిషన్‌కుమార్, కోరవేన మధుకర్‌లపై పిడి యాక్టు అమలు చేసినట్లు రామగుండం సిపి వి.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా అటవీ సంపదను యథేచ్చగా నాశనం చేసిన తెలంగాణ వీరప్పన్ స్మగ్లింగ్ ముఠాగా వీరు పేరుగాంచారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ నాలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌గా ఉన్న వీరిని అడవుల సంరక్షణపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటంతో కలప స్మగ్లర్ల ఏరివేత ప్రారంభమైంది. ఎడ్ల శ్రీనివాస్ అతని అనుచరులు మంథని రిజర్వ్ అటవీ ప్రాంతంలో టేకు చెట్లను నరకడం, అక్రమ రవాణా కారణంగా మంథని చుట్టూ ఉన్న గ్రామ రైతులు సాంఘీక అటవీ కార్మికులు, పశువుల కాపరులు, సామాన్య ప్రజలు అడవికి వెళ్లడానికి భయపడుతున్నారు. దీనివల్ల పబ్లిక్ ఆర్డర్స్‌కు ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నందున వీరిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు సిపి తెలిపారు. గత ఇరవైఏళ్లుగా కలప అక్రమ రవాణా చేస్తూ రాజకీయ నాయకుల సహాయంతో అతనిపై కేసులునమోదు కాలేదని దర్యాప్తులో తేలిందన్నారు.

వివిధ చట్టాల ప్రకారం మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.మహేందర్, కరీంనగర్ జిల్లా జైలులో ఉన్నతాధికారుల సమక్షంలో పిడి యాక్టు ఉత్తర్వులు జారీచేసి వీరిని కేంద్ర కారాగారము వరంగల్‌కు పంపినట్లు తెలిపారు. పచ్చని అడవులను రక్షించకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కలప స్మగ్లింగ్ చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు, పిడియాక్టు అమలు చేయటం జరుగుతుందన్నారు. అక్రమ కలప రవాణా చేస్తున్న గోదావరిఖనికి చెందిన సాయిరాం సామిల్స్, శ్రీ బాలాజీ సామిల్స్, ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెంకు చెందని శనిగ నారాయణ రెడ్డి సామిల్, త్రిపురాంతకం, బిహెచ్‌ఇఎల్, పర్చూరు, ఉప్పల్, చిలుకలూరిపేట సామిల్స్ యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ వీరప్పన్‌గా పేరుపొందిన ఎడ్ల శ్రీనివాస్‌పై పిడి యాక్టు అమలు చేసేందుకు కృషిచేసిన గోదావరిఖని ఏసిపి వి.ఉమేందర్, మంథని సిఐ ఎ.మహేందర్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ పార్టీ సిబ్బందిని సిపి సత్యనారాయణ అభినందించి రివార్డులు అందజేశారు.

PD Act on Timber Smugglers at Godavarikhani