Home ఎడిటోరియల్ కశ్మీర్ భూతల స్వర్గం కానున్నదా?

కశ్మీర్ భూతల స్వర్గం కానున్నదా?

 Kashmir

 

నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం కశ్మీర్ సమస్యను పరిష్కరించేశారు. ఇక అందాల కశ్మీరులో శాంతి వర్ధిల్లుతుంది… ఈ మాటలు బిజెపి నేతలు చెబుతున్నారు. ప్రజలను నమ్మమంటున్నారు. అధికరణ 370ని రద్దు చేస్తే చాలు కశ్మీరు సమస్య పరిష్కారమైపోతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీరుకు కేంద్రపాలిత ప్రాంతం హోదా శాశ్వతం కాదని, శాంతి స్థాపించిన తర్వాత మళ్ళీ పూర్తి రాష్ట్రం హోదా ఇస్తామని అంటున్నారు. శాంతి స్థాపిస్తామని, శాంతిస్థాపనలో అడ్డుగా ఉన్న అధికరణ 370 ఇప్పుడు తొలగించామని అంటున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ప్రకారం అధికరణ 370, అధికరణ 35ఎ జమ్మూ కశ్మీర్‌లో శాంతిని నాశనం చేశాయి.

నీతిఆయోగ్ సియిఒ అమితాబ్ కాంత్ ప్రకారం ఇప్పుడు జమ్మూ కశ్మీరులో శాంతి, ప్రగతి, సౌభాగ్యం వర్ధిల్లుతాయి. శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే, తన కుటుంబ వ్యవహారం లాంటి శివసేనను ఇప్పుడు మధ్యేవాద పార్టీగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన కూడా ఇప్పుడు జమ్మూ కశ్మీరులో శాంతి ప్రగతి సౌభాగ్యాలు వస్తాయని చెప్పాడు. మోడీ విమర్శకుడి ముద్ర చెరిపేసుకోడానికి ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్ కూడా అధికరణ 370 రద్దుతో శాంతి ప్రగతికి బాటలు పడ్డాయని అంటున్నాడు.

జమ్మూ కశ్మీరును ముక్కలు చేసి, హఠాత్తుగా అధికరణ 370 రద్దు చేసిన పద్ధతి గమనించిన వారెవరైనా సరే కశ్మీరులో ఇలా శాంతిని సాధిస్తారంటే నమ్మలేరు. కశ్మీరులో భద్రతాదళాల ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, భద్రతను సడలించిన తర్వాత, కశ్మీరీలు రోడ్లపైకి రావడం మొదలవు తుంది. కశ్మీరీల ఆగ్రహావేశాలు ముఖ్యంగా 35ఎకు సంబంధించినవే ఉంటాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన హిందూ జనాభాను కశ్మీరులోకి తీసుకొచ్చి అక్కడ స్థిరపడేలా చేసి కశ్మీరు ముఖచిత్రాన్ని మార్చేస్తారన్న అపనమ్మకాలు కశ్మీరీల్లో ఎప్పటి నుంచో ఉన్నా యి. ముస్లిం మెజారిటీ రాష్ట్రాన్ని హిందూ మెజారిటీ రాష్ట్రంగా మార్చేస్తారని భయపడుతున్నారు.

చైనా టిబెట్‌లో ఇలాగే చేసింది. ఇప్పుడు గ్జింజియాంగ్‌లో కూడా ఇలాగే చేస్తోంది. తిరుగుబాటు ప్రజలను అణచేయడానికి ప్రాంతం జన నిష్పత్తిని మార్చేయడం ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతూ వస్తున్నదే. నిజానికి అధికరణ 35ఎ కోర్టులో ఉంది. సుప్రీంకోర్టు 35ఎ కొనసాగించాలని తీర్పునిచ్చినా సరే చట్టం చేసి ఆ అధికరణను తొలగిస్తామని అమిత్ షా జూన్‌లో చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వరకు కూడా వేచి ఉండేది లేదని ఇప్పుడు తమ చేతలతో చూపించారు.

అధికరణ 370 రద్దు, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం, లద్దాక్‌ను వేరు చేయడం కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణం కావచ్చు. కాని వాటన్నింటికన్నా అధికరణ 35ఎ ను కశ్మీరీలు చాలా ముఖ్యంగా భావిస్తారు. అధికరణ 370 ఇప్పుడు దాదాపు అర్ధంలేనిదిగా మిగిలిపోయింది. తొలగించినా, ఉన్నా పెద్ద తేడా లేదు. దాదాపు 1948 తర్వాతి నుంచి కశ్మీరును పాలిస్తున్నది కేంద్రమే. కాబట్టి అధికరణ 370 కన్నా అధికరణ 35ఎ విషయంలో ఆగ్రహావేశాలు మిన్నంటుతాయి.
కశ్మీరు చరిత్రను పరిశీలించిన వారికి ఈ మార్పుల తర్వాత హింసాకాండ చెలరేగవచ్చన్న భయాలు సహజంగానే కలుగుతాయి. తన నేల కోసం పోరాడే కశ్మీరీ యువకులు చాలా మంది వీధుల్లోకి రావచ్చు.

ఇది తరాల తరబడి కొనసాగవచ్చు. చాలా ప్రదర్శనలను ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించి లేదా అప్రకటిత కర్ఫ్యూ ద్వారా అణచేయడానికి ప్రయత్నించనూవచ్చు. ప్రదర్శనలు, నిరసనలు, ఆందోళనలను ప్రభుత్వం అడ్డుకోవడం, ప్రదర్శనకారులు రాళ్ళు రువ్వడం ఇవన్నీ ప్రారంభం కావచ్చు. రాళ్ళు రువ్వే వారిపై కాల్పు లు జరుగుతాయి. కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటారు. పెల్లెట్ గన్స్ వాడితే కంటి చూపు పోగొట్టుకుంటారు. రాళ్ళు రువ్వే వారు ఆయుధాలు చేపట్టడానికి నడుం కట్టే అవకాశాలున్నాయి. కాబట్టి కశ్మీరులో మరో హింసాకాండల విషవలయం, గతంలో కన్నా తీవ్రమైనది భవిష్యత్తులో ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ‘దీనికి పర్యవసానాలుంటాయి.

హింసాకాండ పెరగవచ్చు, ఒక్క కశ్మీరులోనే కాదు, ఎక్కడైనా జరగవచ్చు’ అని మాజీ రా చీఫ్ ఎ.యస్.దులాత్ అన్నారు. కశ్మీరు గురించి లోతయిన అవగాహన ఉన్న అధికారి ఆయన. చేతుల్లో ఒక డాక్యుమెంట్ పట్టుకుని పార్లమెంటులో మాట్లాడుతున్న అమిత్ షా ఫోటో ఒకటి వచ్చింది. ఈ డాక్యుమెంటులో అనేక పాయింట్లతో పాటు ఉన్న మరొక పాయింట్ ఏమిటంటే, “యూనిఫాం సిబ్బందిలోనూ హింసాత్మక అవిధేయతకు అవకాశాలున్నాయి” అనే పాయింట్. అయితే ఈ నిర్ణయం వల్ల శాంతి సాధిస్తామంటున్నారు. అధికరణ 35ఎ తొలగించడం, రద్దు చేయడం వల్ల శాంతి సాధిస్తామనే మాటలు ఉత్త భ్రమలుగా రుజువు కావచ్చు.

పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులు, రావల్పిండిలో కూర్చున్న వారి అధినేతలు బహుశా ఇప్పుడు చాలా సంతోషిస్తూ ఉండవచ్చు. కశ్మీరులో ఉద్రిక్తత ఎంత పెరిగితే అంత మంచిదని వాళ్ళు భావిస్తారు. మిలిటెన్సీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. నియంత్రణ రేఖను దాటి ఆత్మాహుతి దళాలను పంపించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అఫ్ఘనిస్తాన్ నుంచి కాస్త విరామం కూడా పొందారు కదా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భద్రతాపరమైన అనేక సమస్యలను సృష్టించే నిర్ణయం. టెర్రరిజానికి ఊపునిచ్చే నిర్ణయం. నిజానికి మోడీ సర్కారుకు ఈ విషయం తెలియనిది కాదు. అయినా ఇలా ఎందుకు చేశారన్నది ప్రశ్న. కశ్మీరులో ఉద్రిక్తత పెరగడం జాతీయ ప్రయోజనాలకు మంచిది కాదు.

కానీ, బిజెపికి దాని వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. పైగా ముస్లింలపై విష ప్రచారం చేయడానికి చాలా మంది బిజెపి నేతలకు కావలసినంత అవకాశం లభిస్తుంది. టెర్రరిస్టు దాడులు జరిగితే భారత పాకిస్థాన్ దేశాల మధ్య కూడా ఉద్రిక్తత పెరుగుతుంది. ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి వాతావరణంలో ఇంట్లో దూరి కొట్టామని చెప్పుకునే అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇలాంటి భావావేశాల వాతావరణం, ఉద్రిక్త వాతావరణం అలుముకుంటే ఎవరూ నిరుద్యోగం గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అంటే జాతీయ ప్రయోజనాలు, బిజెపి ప్రయోజనాలు రెండు ఒక్కటే కావలసిన అవసరమేమీ లేదు. బిజెపి ప్రయోజనాలే బిజెపికి ముఖ్యం.

మెహబూబా ముఫ్తీతోను, ఆమె పార్టీతోను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జాతీయ ప్రయోజనాలు లేవు. లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలో జాతీయ ప్రయోజనాలున్నాయి. కశ్మీరు ప్రజలతో, అక్కడి నాయకులతో మాట్లాడి, చర్చలు జరిపి వారిని కలుపుకుని నడవడంలో జాతీయ ప్రయోజనాలున్నాయి. చాలా ఈశాన్య రాష్ట్రాల్లో బయటివారు అక్కడి ఆస్తులు, భూములు కొనలేరు. అదే విధంగా కశ్మీరీలకు కూడా వారి అధికరణ 35ఎను కొనసాగించడంలో జాతీయ ప్రయోజనాలున్నాయి.

కశ్మీరీ యువత ఆయుధాలు చేపట్టకుండా, మిలిటెన్సీ బాట పట్టకుండా వారిని నచ్చచెప్పడంలో జాతీయ ప్రయోజనాలున్నాయి. కాని అధికరణ 35ఎ రద్దు వల్ల అందుకు విరుద్ధంగా జరుగుతుంది. నిజానికి ఇప్పుడు జరిగింది కూడా నోట్లరద్దు వంటి నిర్ణయమే. నోట్ల రద్దు ఏం సాధించిందో చూశాం. నల్లడబ్బు నాశనం చేస్తామన్నారు. కాని నోట్ల రద్దు ఆర్ధిక వ్యవస్థను కుదేలు చేసింది. నల్ల కుబేరులు తమ నల్ల డబ్బు తెల్లగా మార్చుకున్నారు. అదే విధంగా ఇప్పుడు కశ్మీరులో శాంతి స్థాపనకే అధికరణ 35ఎ రద్దు అంటున్నారు. కాని దీని వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయి. బహుశా అదే కోరుకుంటున్నారా?

Peace thrives in beautiful Kashmir