Home తాజా వార్తలు డయాలసిస్ రోగులకు పెన్షన్!

డయాలసిస్ రోగులకు పెన్షన్!

dialysis patients!

 

సిఎంతో చర్చించి సానుకూల నిర్ణయానికి ప్రయత్నిస్తా
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
గోదావరిఖని ఆసుపత్రిలో రూ.7.8కోట్ల పనులకు శంకుస్థాపన

గోదావరిఖని : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గోదావరిఖని ఏరియా ఆసుపత్రి పరిధిలో నూతనంగా ఎన్టీపిసి సిఎస్‌ఆర్ నిధులతో రూ.7.8 కోట్లతో నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రికి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్‌ను మంత్రి సందర్శించి అక్కడ అందుతు న్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొని మంత్రి మాట్లాడారు.

గత నాలుగు రోజులుగా తాను సూర్యపేట నుంచి ప్రారంభించి 13 జిల్లాలలో పర్యటించానని తెలిపారు. బయట ప్రచారంలో ఉన్నంత స్థాయిలో ప్రజలు అనారోగ్యం పాలు కావటం లేదని,ప్రస్తుతం ఆసుపత్రులలో ఉన్నవారిలో చాలా మంది వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులతో బాధపడుతు న్న వారే అత్యధికశాతం ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య సిబ్బంది, వైద్యులు సెలవులను సైతం తీసుకోకుండా ప్రతీ రోజు ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తున్నారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరో గ్యం విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైన మందులు, చికిత్స పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా కల్పించారు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వమని, ఆ దిశగా కేసీఆర్ కిట్ వంటి పథకాన్ని, ఆసరా పెన్షన్లను ఒంటరి మహిళలకు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు సైతం అందించామని తెలిపారు.

డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వాలనే విషయమై ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణ యం వెలువడేలా తనవంతు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదేళ్లలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, ఎన్నికల సమయంలో సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు త్వరలో రామగుండంలో సైతం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో కల్పించే సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సమీపంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలని ఆయన వినతి పత్రం అందించారు.

ఆరోగ్య జీవనానికి పరిశుభ్రతే ప్రధానం : కలెక్టర్ శ్రీదేవసేన
ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే మన పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడమే ప్రధానమని గుర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటికి సోక్ పిట్, గ్రామంలో సామూహిక సోక్ పిట్లను నిర్మించి మురికి కాల్వలను మూసివేయడం వల్ల జిల్లాలో డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గత ఏడాది ఆగస్టు మాసంలో 98 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది కేవలం 8 కేసులు మాత్రమే నమోదయ్యాయని కలెక్టర్ వివరించారు.

Pension for dialysis patients!