Home జగిత్యాల మృత్యుబావులు

మృత్యుబావులు

Dead-Body

ఈతకు వెళ్తూ ప్రతి యేటా పదుల సంఖ్యలో చిన్నారుల మృత్యువాత
పుణ్య స్నానాలకు వెళ్తూ భక్తుల దుర్మరణం, కన్నవారికి కడుపు కోత
అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికార యంత్రాంగం

జగిత్యాల: చెరువులు, బావులు, నదులు మనుషులను మింగేస్తున్నాయి. ఒక్కరా… ఇద్దరా.. ప్రతి వేసవిలో చిన్నారులు ఈతకు వెళ్లి పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్న సంఘటనులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారుల ఈత సరదా కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతోంది. ఏడాది క్రితం కరీంనగర్ దిగువ మానేరులో ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు నీట మునిగి చనిపోయిన సంఘటన ప్రతి ఒక్కరి గుండెను కదిలించింది. పుణ్య స్నానాలకు వెళ్లే భక్తుల ప్రాణాలు “గంగ”లో కలుస్తున్నాయి. ప్రతి వేసవిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నదులు, బావులు, చెరువులు, కోనేరుల్లో నీట మునిగి పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అధికార యంత్రాంగం తాత్కాలిక చర్యలు చేపట్టి ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోకపో వడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి వేసవిలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు చిన్నారులు పట్టణాల నుంచి గ్రామా లకు వస్తుంటారు. ఈత నేర్చుకోవాలనే సరదాతో సమీపంలోని చెరువులు, కుంటలు, బావుల్లో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు అప్రమత్తం చేయడంతో పాటు ఈతకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుణ్య స్నానాల కోసం గోదావరి నదికి వెళ్తున్న భక్తులు నీట మునిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు ప్రతి యేటా చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్పా శాశ్వత చర్యల గురించి అధికారులు ఆలోచించకపోవడం వల్లే మృత్యు సంఘటనల పరంపర కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రాణాలు మింగేస్తున్న ధర్మపురి సత్యవతి గుండం
ధర్మపురి గోదావరి నదిలోని సత్యవతి గుండం భక్తుల ప్రాణాలను మింగేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో భక్తులు ఆ గుండంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అయినా సంబంధిత అధికారులు ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రమే. ఏడాది క్రితం పుణ్యస్నానాలకు వెళ్లిన ఓ కుటుంబంలోని ఇద్దరు సత్యవతి గుండంలో మునిగి మృతి చెందగా అప్పుడు అధికారులు స్పందించారు. సత్యవతి గుండం చుట్టూ తాత్కాలికంగా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయినా నదిలోని సత్యవతి గుండంలో మాత్రం నీరు ఉంటుంది. దాంతో భక్తులు స్నానం చేసేందుకు అటు వైపు వెళ్లి అందులో మునిగి చనిపోతున్నారు. ప్రతి ఏటా ఆ గుండంలో పదుల సంఖ్యలో భక్తులు మునిగి చనిపోతున్నట్లు తెలుస్తోంది.

పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మైకు ద్వారా ప్రమాద ప్రాంతాలను భక్తులకు వివరించడంతో పాటు ప్రమాదం జరిగే ప్రాంతాల గురించి గోదావరి నదిలోకి వెళ్లే మెట్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చనే భక్తుల అభిప్రాయాన్ని ఎవరూ పట్టించుకో వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. పుణ్యం వస్తుందని గోదావరికి పిల్లా పాపలతో వస్తే కడుపు శోకాన్నే మిగిల్చితివా దేవుడా.. అంటూ గోదావరిలో కన్నీరుమున్నీరుగా విలపించే బాధిత కుటుంబాల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది.

కోటి లింగాల, రాయపట్నం వద్దే అదే పరిస్థితి…
వెల్గటూరు మండలం కోటి లింగాల, ధర్మపురి మండలం రాయపట్నం వద్ద భక్తులకు ప్రాణాపాయం పొంచి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో కోటి లింగాల, రాయపట్నం వద్ద గోదావరిలో నీరు నిలిచింది. గోదావరిలో స్నానాలు చేసేందుకు వెళ్తున్న భక్తులు నీట మునిగి దుర్మరణం చెందుతున్నారు. భక్తులు ప్రమాదానికి గురి కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉండగా అక్కడా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. అప్పట్లో ఓ భక్తుడు పుణ్య స్నానం కోసం కోటిలింగాల వద్ద గోదావరిలో దిగి నీట మునిగి మృతి చెందాడు. కుటుంబంలో ఏ శుభ, అశుభ కార్యం జరిగినా వెంటనే గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేయడం జిల్లా ప్రజల ఆనవాయితీ. దాంతో ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల తదితర ప్రాంతాల్లో నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో భక్తులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చెరువులు, కుంటల్లో గుంతలతో ప్రమాదాలు…
గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా బావులు తవ్వడం… మట్టి కోసం గుంతలు తీయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సెలవుల కోసం పట్టణాల నుంచి గ్రామాలకు వస్తున్న చిన్నారులు ఈతకు వెళ్తూ గుంతలు, బావుల్లో పడి ప్రాణాలు విడుస్తున్నారు. గ్రామానికి కొత్త కావడం… చెరువులో ఎక్కడెక్కడ గుంతలు, బావులు ఉన్నాయో తెలియక చిన్నారులు సరదాగా నీళ్లలో దిగి నీట మునిగి చనిపోతున్నారు. ఏడాది క్రితం కరీంనగర్ మానేరు డ్యాంలో నీట మునిగి ఆరుగురు చిన్నారులు, రాయికల్ మండలం అల్లీపూర్ చెరువులో ముగ్గురు చనిపోయింది కూడా గుంత తవ్వడం వల్లేనని తెలుస్తోంది.

ఈ నెల 12న హోళీ వేడుకల్లో పాల్గొన్న పెగడపెల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన ముల్కల సాయికుమార్ (18) అనే విద్యార్థి స్నానం చేసేందుకు గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో దిగి గల్లంతయ్యాడు. మూడు రోజులకు కరీంనగర్ జిల్లా చింతకుంట కెనాల్‌లో సాయికుమార్ శవమై కనిపించాడు. ఈ నెల 19న జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇంతియాజ్ (38) అనే యువకుడు బీర్‌పూర్ మండలం రంగసాగర్ గ్రామ సమీపంలోని గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్ళాడు. అయితే చేపల వేటకు వెళ్ళిన ఇంతియాజ్ ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయి దుర్మరణం పాలయ్యాడు. అలాగే అదే మండలంలోని కొల్వాయి గ్రామానికి చెందిన పెంకర్ల వివేక్ (10) అనే విద్యార్థి ఆదివారం సెలవుదినం కావడంతో గ్రామ సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్ళి నీటమునిగి మృతి చెందాడు.

ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ప్రమాదాలను అరికట్టేందుకు పకడ్బంధీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతంలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో నీటి మునిగి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంఘటన స్థలంలో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నీట మునిగి మృతి చెందిన ఆ ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఆరోగ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.