Friday, March 29, 2024

బయటకు రావొద్దు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: అవసరంలేకున్నా బయట తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు.గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయకుమార్‌తో కలిసి ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని వాహనాలు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. బయటికి వచ్చిన వారు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. బైక్‌పై ఒకరు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఉందని అన్నారు. గేటెడ్ కమ్యూనిటీలో కూడా అందరూ ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి వచ్చి ఆటలు ఆడవద్దని, తిరగవద్దని అన్నారు. బిల్డింగ్ పనులు కూడా మానివేయాలని ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఐదుగురు కంటే ఎక్కువమంది రోడ్లపై ఉంటే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మెడికల్‌షాపులు, కూరగాయల మార్కెట్లు తెరిచి ఉంటాయని వాటి వద్ద కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. సమీపంలోని షాపుల్లోనే వస్తువులు తీసుకోవాలని అన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ధరల నియంత్రణకు 48 టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు.

రాత్రి 7గంటల తర్వాత షాపులు తెరిచి ఉంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సైబరాబాద్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలకు,ఈ కామర్స్ సంస్థలకు మినహాయింపు ఉందని తెలిపారు. వారు పనిచేసే చోట సోషల్ డిస్టెన్స్ పాటించాలని అన్నారు. వారిని కూడా సరైన ఐడి కార్డు చూపిస్తేనే అనుమతిస్తామని తెలిపారు. క్యాబ్‌లు, బైక్‌లను అద్దెకు ఇచ్యే సంస్ధలు కూడా మూసివేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. హెల్ప్‌లైన్ నంబర్ 18004250817కు ఫోన్ చేయవచ్చని, ఎవరైనా బయటతిరిగితే వెంటనే తమకు ఫోన్ చేయవచ్చని లేదా డయల్ 100కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే వాహనాలకు మినహాయింపు ఉందని, అలాగే ఫార్మాస్యూటికల్స్‌లో పనిచేసే వారు కూడా విధులకు హాజరు కావచ్చని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 269,270 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
అంతరాష్ట్ర సర్వీసులు రద్దు..
కొందరు బయటికి వెళ్లిన తర్వాత ఏదో ఒక వాహనంలో ఇంటికి వెళ్లవచ్చని అనుకుంటున్నారని అంతరాష్ట్ర సరిహద్దులు, అంతర్ జిల్లాల సరిహద్దులు కూడా మూసివేశామని అక్కడి పోలీసులు రానివ్వరని సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ అన్నారు. హోం కారంటైన్‌లో ఉన్న వారు బయటికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మూడు అడుగుల డిస్టెన్స్ పాటించాలని కోరారు. పిల్లలు బయటికి రాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అన్నారు. డెలవరీ బాయ్స్ సాయంత్రం 6గంటల లోపు డెలివరీ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. ఓనర్స్ క్యాబ్‌లు, ఆటోలను అద్దెకు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిపి స్వయంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేశారు. రేషన్ ఇవ్వడంపై మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమెయకుమార్ తెలిపారు. సమావేశంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

People Follow Lockdown Rules Says CP Sajjanar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News