Saturday, April 20, 2024

విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం

- Advertisement -
- Advertisement -

People of Hyderabad should think and vote in GHMC elections

 

భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం. దేశ పురోభివృద్ధికి దోహదపడే పరిణామమా లేక అభివృద్ధికి ఆటంకం కలిగించే మార్పుగా చూడాలా అనే దానిపై చర్చ జరగాలి. బ్రిటిష్ వారు మన దేశాన్ని తమ వలస దేశంగా మార్చుకొని వందల సంవత్సరాలు పాలించారు. మనది భిన్నమతాల, కులాల భాషల దేశం. బ్రిటిష్ వారు రాక పూర్వం మన దేశంలో వివిధ సంస్థానాలు ఉండేవి. ఆయా సంస్థానాధీశుల ఏలుబడిలో ఆయా ప్రాంతాలు ఉండేవి.

వర్తకం పేరుతో వచ్చిన ఈస్టిండియా కంపెనీ ఆ తరువాత కాలంలో విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేసి దేశాన్ని తమ గుపిట్ల్లో పెట్టుకున్నారు.ఇక్కడ ఉండే కుల, మత ప్రాంత విభేదాలను సంస్థానాధీశుల మధ్య తరచు జరిగే యుద్ధాలను అడ్డంపెట్టుకొని యావత్ దేశాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగారు. వారి పాలనలో ప్రజలు అనేక అవమానాలకు, అన్యాయానికి అణచివేతకు గురికావడమే కాకుండా దోపిడీకి గురి అయ్యారు. వీరి ఆగడాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో గాంధీ సారథ్యంలో భగత్ సింగ్ అల్లూరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిట్టిగాంగ్ వీరులు గదర్ వీరులు ఇలా అనేక మంది యువకులు పోరాడి తమ ప్రాణాలను బలిదానం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలను పక్కన పెట్టి దేశ ప్రజలు గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నడుం బిగించారు.

గాంధీ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, పటేల్ ఇలా జాతీయోద్యమ నేతలందరూ భారత జాతిని ఏకతాటి మీదకు తెచ్చి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారు. నాడు వారు వేసిన సెక్యులర్ ప్రజాస్వామిక భావజాలమే స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ఐక్యంగా నడిపించగలిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి దేశం అభివృద్ధి వైపు అడుగులు వేయడం మొదలయ్యింది. అడపాదడపా కొన్ని సంఘటనలు జరిగినా 73 సంవత్సరాలుగా భారత జాతి తమ ఐక్యతను చాటుతూ వచ్చింది. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక,లౌకిక దేశంగా భారతదేశం పేరు తెచ్చుకుంది. మన రాజ్యాంగం కూడా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా గుర్తింపు తెచ్చుకుంది. భిన్నత్వంలో ఏకత్వంగా ముందుగు సాగుతుంది అంటే.. ప్రజలలో బలంగా నెలకొని ఉన్న లౌకిక, ప్రజాస్వామిక భావాలే కారణం. అయితే కాలక్రమంలో దేశంలో ప్రాంతీయ అసమానతలను నెలకొన్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి వారి నేతృత్వంలో ఉద్యమాలు జరగాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

అనేక స్టేట్స్ లలో రీజనల్ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే బలంగా ఉన్నారు. జనసంఘ్ ప్రభావం కూడా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త గాడ్సే జాతిపిత గాంధీని హత్య చేయడంతో పరోక్షంగా మత విద్వేషానికి బీజం పడ్డట్లు అయ్యింది. గాంధీ వైఖరి కారణంగానే పాకిస్థాన్ ఏర్పడింది అనే వాదన తెర మీదకు తెచ్చి విద్వేషాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. కానీ నాడు ప్రజలు దానిని స్వీకరించలేదు. ఇందుకు గాంధీ, నెహ్రూలు వేసిన లౌకిక ప్రజాస్వామిక పునాదులు బలంగా ఉండడమే కారణం. నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాలలో మతతత్వ శక్తులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

రామ మందిరం పేరుతో దేశ వ్యాపితంగా రథ యాత్ర చేశారు. ఆ ప్రయత్నం కొంత వరకు ఫలించిందనే చెప్పాలి. ప్రజల్లో భావోద్రేకాలు పెంచగలిగారు. అయితే ఆ భావోద్రేకాలు దేశానికి ప్రమాదం అని గుర్తించి ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజల జాగృతితో పాటు నాడు వామపక్షాలు, ప్రజాస్వామిక శక్తులు దేశంలో బలంగా ఉండడం కూడా కారణం. అలాగే కాంగ్రెస్‌తో పాటు లౌకికవాద రీజనల్ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. దీంతో మతతత్వ శక్తులకు చెక్ పడ్డది.
దేశ ప్రజల చైతన్యాన్ని గుర్తించిన సంఘ్ పరివార్ సెక్యులర్ డెమొక్రాటిక్ భావజాలాన్ని దెబ్బ కొట్టకుండా మనం ముందుకు పోలేమని గుర్తించింది.

భావోద్రేకాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య బలమైన విభజన రేఖ గీయాలని భావించింది. అందుకు తగ్గట్టుగా ఎజండాను రూపొందించింది. దానిని మొదలు గుజరాత్‌లో అమ లు చేసే బాధ్యతలను మోడీ, షాలకు అప్పగించింది. దాని ఫలితమే గోధ్రా సంఘటన. ఆ సంఘటనతో వారు ఆశించిన ఫలితాలు వచ్చాయని భావించారు. ఈ ఫార్ములానే దేశ వ్యాపితంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆ బాధ్యతను గుజరాత్‌లో విజయవంతంగా అమలు చేసిన మోడీ, షాల ద్వయానికి అప్పగించింది. దానికి తగ్గట్టుగా దేశ ప్రధాని అభ్యర్థిగా మోడీని జాతీయ బిజెపి అధ్యక్షుడిగా అమిత్ షా ను ప్రమోట్ చేసింది. వీరి సారథ్యంలో కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మోడీ -షాల ద్వయం తమ సంఘ్ పరివార్ ఎజండాను అమలు చేసే పనికి శ్రీకారం చుట్టారు. నెహ్రూ, గాంధీల సెక్యులర్ ప్రభావాన్ని ఒక వైపు తగ్గిస్తూనే మరో వైపు యువకులలో భావోద్రేకాలను పెంచే విధంగా రోడ్ మ్యాప్ తయారు చేశారు. దీనికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

దేశ వ్యాప్తంగా గోవులను వధ శాలకు తరలిస్తున్నారంటూ బహిరంగంగా మూక దాడులకు పూనుకున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లారు. తద్వారా యువకులలో భావోద్రేకాలను పెంచే చర్యకు పూనుకున్నారు.అంతే కాదు నెహ్రూ, గాంధీల సెక్కులర్ భావాలపై ఎటాకింగ్ పెంచారు. గాంధీ దేశ ద్రోహి, గాడ్సే దేశ భక్తుడు అని చెప్పే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అందుకు వారి సొంత పార్టీ ఎంపిలు నాయకులచే ప్రకటనలు ఇప్పిస్తున్నారు. అంతే కాదు నెహ్రూను అభిమానించి చివరి వరకు ఆయనతోనే ఉండడమే కాకుండా తాను చనిపోయే ముందు తన శిష్యులకు కూడా నెహ్రూ ను విడవకండి అని చెప్పిన వల్లభాయి పటేల్ ను రాజకీయంగా తమ సొంతం చేసుకునేందుకు పథకం రచించారు. అందుకు 597 అడుగుల ఎత్తైన పటేల్ విగ్రహాన్నిగుజరాత్‌లో ఏర్పాటు చేసారు. తద్వారా పటేల్‌ను నెహ్రూకు వ్యతిరేకంగా నిలిపేందుకు ప్రయత్నించారు. దీనిని బట్టి చూస్తుంటే సంఘ్ పరివార్ ఎంత పకడ్బందీగా తన రోడ్ మ్యాప్‌ను అమలు చేస్తుందో అర్ధం అవుతుంది.

ఒక వైపు ఆర్‌ఎస్‌ఎస్ ఇచ్చిన ఎజండాను అమలు చేస్తూనే మరో వైపు కాంగ్రెస్‌తో పాటు రీజనల్ పార్టీలను బలహీన పరిచే చర్యకు మోడీ, షాలు పూనుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వారిని తోసి తాము అధికారంలోకి వచ్చే ప్లాన్ అమలు చేస్తూ పోతున్నారు. పార్లమెంట్‌లో చట్టాల ద్వారా రాష్ట్రాలకున్న అధికారాలకు కత్తెర వేస్తూ పరోక్షంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరిచేందుకు పూనుకుంటున్నారు. ఇలా బహు రూపంలో తమ ప్లాన్‌ను అములు చేస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు, తలాక్ బిల్లు, రామ మందిర్ నిర్మాణం, పుల్వామా దాడి, చైనా, పాకిస్థాన్ దాడులు ఇలా అన్నిటిని తమకు అనుకూలంగా మలచుకుంటూ జాతీయ భావం పేరుతో యువకులలో పరోక్షంగా తమ భావజాలాన్ని నింపే ప్రయత్నం సంఘ్ పరివార్ చేస్తుంది.

తమ రోడ్ మ్యాప్‌ను దేశంలో విజయవంతంగా అమలు చేసుకునేందుకు కాంగ్రెస్, వామపక్ష, ప్రజస్వామిక శక్తులు బలహీనపడడం వారికి కలిసి వచ్చింది. కేంద్రంలో రెండో సారి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వారిలో విశ్వాసం మరింత పెరిగింది. తాము ఏమి చేసిన ప్రజలు ఆమోదిస్తారనే భావనకు వెళ్లారు. నల్లధనం తెస్తామని తేకపోయినా, సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోయినా, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, లాక్‌డౌన్‌లతో దేశ ఆర్ధిక పరిస్థితి బంగ్లాదేశ్ కన్నా దిగజారినా ప్రజలు ఎవరు వాటిని పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారు. మనం ఎంత పెద్ద ఎత్తున భావోద్రేకాలను పెంచ గలిగితే అంత మనకు లాభమనే నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రుల దగ్గర నుండి రాష్ట్ర నాయకులు దాకా అందరూ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ప్రజల మధ్య బలమైన విభజన తెచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతుంది. 2014 నుండి దేశంలో తమ ఎజెండాను ను గోప్యంగా అమలు చేస్తూ వచ్చిన మోడీ షాల ద్వయం 2020 వచ్చే సరికి బహిరంగంగా అమలు చేయడం మొదలు పెట్టినట్లు కనపడుతుంది. ఇది దేశానికి, హైదరాబాద్‌కు ప్రమాదం. విద్వేషాలు పెచ్చురిల్లితే మారణ హోమం జరుగుతుంది. ఇటీవల ఢిల్లీలో ఏమి జరిగిందో చూశాం. గతంలో హైదరాబాద్‌లో జరిగిన అల్లర్లు, కర్ఫ్యూల చేదు అనుభవం ఉండనే ఉంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పా భావోద్రేకాలతో సాధించేది ఏమిలేదు. పైగా అభివృద్ధి కుంటుపడుతుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతాయి.

పేద, మధ్య తరగతి వర్గాల జీవన విధానం దెబ్బతింటుంది. వారి బతుకులు దుర్భరం అవుతాయి. వ్యాపారాలు దెబ్బతింటాయి. ఈ అనుభవం హైదరాబాద్‌కు ఉంది. మళ్లీ అలాంటి పరిస్థితులను కోరుకుందామా…. స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలను, విషాన్ని చిమ్మి శవాల మీద పేలాలు ఏరుకునట్లు ప్రజల మధ్య చీలికలు తెచ్చి ఓట్లు దండుకునే రాజకీయాలను సమర్థించి నష్టపోదామా….. ఆలోచించండి… ఇలాంటి రాజకీయ శక్తులను ప్రజలు చెక్ పెట్టాలి. వారిని దగ్గరకు రానివ్వకూడదు. వారిని రానిస్తే మనకే నష్టం. వారికి ఓట్లు, సీట్లు, అధికారం దక్కుతుంది. మనకి నిత్యం ఘర్షణలు మిగులుతాయి. అందుకే విజ్ఞులైన హైదరాబాద్ ప్రజలు ఆలోచించి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటు వేయాలి.

                                                                                          పి.వి శ్రీనివాసరావు
                                                                                         (సీనియర్ జర్నలిస్టు)

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News