Home రాష్ట్ర వార్తలు బొట్టు నీటికి నడక యాతన

బొట్టు నీటికి నడక యాతన

  • ఊరూరా జల యాత్రలు
  • మండుతున్న ఎండలకు అడుగంటిన జలాలు, కిలోమీటర్లకొద్దీ మహిళల నీటి యాత్రలు, దాహంతో తల్లడిల్లుతున్న జనం

Drought Women

హైదరాబాద్ : ఇంకా ఎండకాలం పూర్తిగా రానే లేదు. పల్లె ప్రజల గొంతు ఎండుతోంది. అప్పుడే గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు నీటి కోసం బారేడు కష్టాలు మొదలయ్యాయి. పాతాళానికి చేరిన నీళ్ల కోసం ప్రజలు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలో అయితే కిలో మీటర్ల కొద్ది నడక.. ట్యాంకర్ల వద్ద యు ద్ధాలు… బారులు తీరిన బిందెలు దర్శనమిస్తున్నాయి. గత ఏడాది సెప్టెం బర్, అక్టోబర్ వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించు కున్నప్పటికీ, తీవ్రమవుతున్న ఎండలతో అందులోనూ నీరు అడుగంటి ఎండిపోయాయి ‘మన తెలంగాణ’ జిల్లాల ప్రతినిధుల పరిశీలనలో వేస వి ప్రారంభ దశలోనే తాగునీటి సమస్యలు తీవ్రమైనట్లు స్పష్టమవుతోంది. అధికార యంత్రాంగం అప్రమత్తం అయి చర్యలు తీసుకోకపోతే రానున్న రెండు నెలలు ప్రజలకు తాగునీటి కోసం తీవ్ర కష్టాలు తప్పెలా లేవు. నల్ల గొండ జిల్లాలో గత నెల చివరి వారం నుంచే ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దీంతో కరువు ప్రాంతమైన దేవరకొండ డివిజన్‌లో తీవ్ర మంచినీటి ఎద్దటి నెలకొంది. దేవరకొండ డివిజన్‌లోని చింతపల్లి మండలంలో గత ఏడాది ఫిబ్రవరిలో భూగర్భ జలాలు 10.97 మీటర్ల లోతులో ఉంటే ప్రస్తుతం 14.96 మీటర్ల లోతకు పడిపోయాయి. దీంతో గ్రామాల్లోని చేతి పంపులు, బోర్లు వట్టిపోయి తాగునీటి సమస్య ఏర్పడు తోంది. దేవరకొండ నగర పంచాయితీ కేంద్రానికి 15 రోజులకోసారి మంచినీటి సరఫరా జరుగుతోంది. దీంతో నీటి నిల్వతో నులిపురుగులు తయారవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సుమారు 80కి పైగా గ్రామలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో సుమారు 3 వేల పంపులు పనిచేయడం లేదు. డొనకల్లు, నర్సింగ్‌బట్ల, గుండ్ల పల్లి గ్రామాల్లో మూడు నెలల నుంచి అసలు మంచినీరు సరఫరా చేయడం లేదు. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, మద్దిరాల, నడిగూడెం, మేళ్లచెరువు మండలాల్లో మంచినీటి సమస్య వేదిస్తోంది. జిల్లాలలో 445 రక్షిత తాగునీటి కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు నీటి కోసం కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. వర్ని మండలం భీమునిగుట్ట తాండాలోని మహిళలు నీటి కోసం రెండు కిలో మీటర్లు వెళ్తున్నారు. అలాగే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం భీర్మల్ తాండలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తాగునీటి కోసం రూ. కోట్లు కేటాయిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రెండు జిల్లాలోని 1121 గ్రామాల్లోని సుమారు 842 బోర్లు అడుగంటా యి. నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 58 తాండాల్లో నీటి కటకట తాండవం చేస్తోంది. నిజామాబాద్‌లోని 11 మం డలాల్లో, కామారెడ్డిలోని 9 మండలాల్లో బోర్లు వేయాడాన్ని నిషేధించారు. ఉమ్మడి జిల్లాకు వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ కింద రూ. 31.78 కోట్లు కేటాయించినా, రూ. 19 కోట్లే ఖర్చు చేసి పనులు నామమాత్రంగా పూర్తి చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిపుత్రులకు వేసవి కాలం వచ్చిందంటే మంచి నీటి కోసం పడేపాట్లు అన్ని ఇన్నీ కావు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల ప్రజలు నీటికోసం మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి దాపురించింది. పల్లెలన్నీ కొండలు, కోనలు, గుట్టల్లో ఉన్న కారణంగా తాగునీటికి ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయి. గిరి జన గ్రామాల ప్రజలు కూలీ పనులకు వదులుకుని నీటి కోసం మైళ్ల దూరం వెళ్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలంలోని అంగుగామ్ తండా ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఇప్పటికీ ప్రణా ళికలు రూపొందించకపోవడం గమనార్హం.
హైదరాబాద్ మహానగరంలోనూ మంచి నీటి కట కట వెంటాడుతోంది. ప్రస్తుతం పాత ఎంసిహెచ్ పరిధిలో రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. శివారు మున్సిపాలిటీల్లో నాలుగైదు రోజులకోసారి మరికొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి సరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలకు జంట జలాశయాలతో పాటు కృష్ణా మూడు దశలు, గోదావరి, సింగూర్, మంజీరా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా ప్రస్తుతం రోజు 602 మిలియన్ గ్యాలన్ల వరకు తరలించేందుకు అవకాశం ఉన్నా, 392 ఎంజిడిలు మాత్రమే తరలిస్తున్నారు. కొన్ని బస్తీల్లో రోజు విడిచి రోజు అరగంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్నిచోట్ల గత్యంతరం లేక ప్రజలు డబ్బులు పెట్టి నీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వ్యవసాయ బావులు, ట్రాక్టర్లను అద్దె తీసుకుని అధికారులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నీటిని సర ఫరా చేశారు. అందుకు సంబంధించి మొత్తం రూ. 9 కోట్ల చెల్లింపులు నేటికి జరగలేదు. దీంతో ఈసారి నీటి సరఫరాకు ముందుకు రావడానికి ట్రాక్టర్ యాజమానులు జంకుతున్నారు. కరీంగనర్ జిల్లాలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. తిమ్మాపూర్ మండల ప్రజలు మానేరు రిజర్వా యర్ కింది భాగంలోనే ఉన్నప్పటికీ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటు న్నారు. సింగరేణి ఒపెన్ కాస్ట్‌ల ప్రభావిత మండలాలైన మంథని, రామగిరిలో తాగునీటి కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రాయికల్‌లో రూ. 10 కోట్లతో నిర్మించిన ఫిల్టర్‌బెడ్ పథకం అలంకార ప్రాయమైంది. సిరిసిల్లలోని కొన్ని గ్రామాల్లోని మహిళలు అప్పుడు ప్రభుత్వ కార్యాలయాల ముందు ఖాళీ బిందెల ప్రదర్శన చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
కరువు జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాహం కేకలు మొదలయ్యాయి. గత ఏడాది నీటిని పంపిణీ చేసిన ట్రాక్టర్లకు రూ. 10 కోట్లు ఇంతవరకు చెల్లింపులు చేయలేదు. కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సుంకేసుల డ్యాం పూర్తిగా డెడ్ స్టోరేజికి చేరుకుంది. మెతుకు సీమ అయిన సంగారెడ్డికి జలగండం పట్టుకుంది.
రంగారెడ్డి, వికారాబాద్ ,మేడ్జల్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొంద్గూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బోర్లు, కుళాయిల వద్ద క్యూలైన్లలో ప్రజలు బారులు తీరుతున్నారు. కీసర మండల పరిధిలో ట్యాంకర్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు తాండాల ప్రజలు వ్యవసాయ బోర్ల వద్ద తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అనేక గ్రామాలు తాగునీ టికి తల్లడిల్లుతున్నాయి. ఇప్పటికే సమస్య తీవ్రంగా ఉంది. మరో 15 రోజుల్లో ఇది మరింత తీవ్రం కానుంది. ఫలితంగా నారాయణఖేడ్, కంగ్లి, కల్హేర్, సంగారెడ్డి, జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్, అందోల్, ముని పల్లి, మెదక్ జిల్లాలోని టెక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, నర్సాపూర్, రామా యంపేట తదిత మండలాల ప్రజలు దాహార్తితో అల్లడుతున్నారు సంగారెడ్డి జిల్లాలో గత నవంబర్ నెలలో సాధారణ భూగర్భ జల మట్టం 11.21 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుత మార్చిలో 14.39 మీటర్ల లోతుకు పడిపోయాయి. నారాయణఖేడ్‌లో మంత్రులు, ఎంఎల్‌ఎలు, కలెక్టర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇంకా నీటి కష్టాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో తాగునీటి సమస్య పాక్షికంగా ఉంది. మిషన్‌భగరీథ పనులు 80 శాతం పూర్తికావడంతో సమస్య పెద్దగా కనిపించడం లేదు. వరంగల్ జిల్లాలో మంచినీళ్ల కోసం మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డె క్కుతున్నారు. తలాపున గోదావరి పారుతున్న గుక్కెడు నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. వరంగల్ మహానగరంలోనే రెండు లేదా మూడు రోజులకోసారి మంచినీటిని వదులుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలోని అశోక్ నగర్ డిఫ్లోరైడ్ ప్రాజెక్టు నిరపయోగంగా మారింది. ములుగు నియోజకవర్గంలోనూ ఢిప్లోరైడ్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియో గంలోకి రాకపోవడంతో కొన్ని మండలాలో తాగునీటి సమస్య తలెత్తుతోంది. జనగామ జిల్లాలోని రఘునాథ్‌పల్లి, పాలకుర్తి, జరఫర్‌గడ్, స్టేషన్‌ఘనపూర్ మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఖమ్మంలో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. 7 మండలాలకు తాగు నీరు అందించే వైరా జలాశ యం కూడా అడుగంటిపోతుంది. గోదావరి పరివాహాక ప్రాంతమైన ఏజెన్సీ లో నీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.