Home లైఫ్ స్టైల్ పొగ రాని పొయ్యితో ఆరోగ్యం పదిలం

పొగ రాని పొయ్యితో ఆరోగ్యం పదిలం

HomeStove

‘కట్టెలపొయ్యి మీద వంట వండితే’… ఆ ఊహే పొగకమ్మేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కద! మంట సరిగా మండక భరించరాని ఘాటైన పొగలకు కళ్లు మంటలు పుట్టడం, ఊపిరాడకపోవడం వంటివి సంభవిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా త్వరలోనే మన దేశంలో ‘బయోలైట్ హోమ్ స్టవ్’ అనే పొగ రాని పొయ్యిలు రాబోతున్నాయి. ఈ స్టవ్‌లు కట్టెలతోనే పనిచేసినా పొగరాదు. దీని వల్ల కర్బన ఉద్గారాలు 90%, పొగ, గాలిలో కలిసే పార్టిక్యులేటెడ్ మ్యాటర్‌లు తగ్గుతాయి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం మూడు బిలియన్ల ప్రజలు నేటికీ పొయ్యి మండించడానికి కట్టెలు, బొగ్గు,పేడ, చెత్తలను వాడుతున్నారు. ఇందులో నాలుగు మిలియన్ల ప్రజలు పొయ్యి నుంచి వచ్చే పొగతో కలిగే జబ్బులతో మరణిస్తున్నారు. అలాగే కట్టెలు మండించడం వల్ల వచ్చే పొగబారిన పడేవారిలో దీర్ఘకాలంలో ఊపిరి తిత్తులకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.
ప్రపంచ జనాభాలో మూడోవంతుమంది కట్టెలను మండించగా వచ్చిన మంటతో వంటలు చేస్తున్నారు, దీనివల్ల అనేక బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ గాలిలోకి విడుదల కావడమే కాకుండా, వంటచెరుకు కోసం చెట్లను నరికేయాల్సి వస్తుంది, ఇది ఆందోళన కలిగించే అంశం. అయితే వంటవండే వారిని ఈ రకమైన బాధలనుంచి విముక్తి చేసేందుకు ఎంతో మంది ఔత్సాహిక సామాజిక కార్యకర్తలు పనిచేస్తున్నారు. అలాంటివారిలో న్యూయార్క్ సిటీకి చెందిన ఒక డిజైన్ సంస్థలో పనిచేసే జోనాథన్ సెడార్, ఎలెక్ డ్రమ్మండ్ లు కూడా ఉన్నారు.
వినోదం కోసం బయటకు వెళ్లే వారు వంట వండుకునేందుకు బ్యాటరీ, గ్యాస్ లేకుండా పనిచేసే స్టవ్‌లను రూపొందించాలని అనుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మిలియన్ల మంది గ్యాస్, విద్యుత్ లేకుండా ఉండి, కట్టెల పొయ్యి వాడకం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలుసుకొని, వీటికి పరిష్కారమార్గాలు కనుక్కునేందుకు 2006 నుంచి పనిచేస్తున్నారు. ఈ ఆలోచనల నుంచి పుట్టిందే బయె లైట్ హోమ్ స్టవ్.
థర్మోఎలెక్ట్రిక్ టెక్నాలజీ తో పనిచేసే ఈ స్టవ్ మంటను విద్యుత్‌గా మారుస్తుంది. ఈ విద్యుత్‌తో దాన్లోనే అమర్చి ఉన్న చిన్న ఫ్యాన్ తిరిగి, దాని వల్ల వచ్చే శక్తివంతమైన గాలి బొగ్గును మండేలా చేస్తుంది.
ఈ పొయ్యికి అమర్చిన యుఎస్‌బితో సెల్‌ఫోన్ చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్టవ్‌ను మండించడానికి వంటచెరుకు ఉపయోగం 50% తగ్గుతుంది. అదే సమయంలో ఒక్కో స్టవ్ వెలువరించే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం ఏటా 2.5 టన్నులు తగ్గుతుంది.
పొగరాని పొయ్యిల ఖరీదు ఒక్కోటి దాదాపు రూ.8,500 ఉండడం వల్ల పేదలు కొనలేని పరిస్థితులు ఉంటాయని మైక్రో ఫైనాన్స్ బ్యాంక్‌లతో బయ్లైట్ వారు ఒప్పందం చేసుకున్నారు.
ఈ ఒప్పందంతో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వద్ద నుంచి వడ్డీ వసూలు చేయకుండా నెల నెలా కొంత డబ్బు కట్టేలా అందించాలన్నది వారి ఉద్దేశ్యం.
మా ప్రయోగం ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడినా చాలు, ప్రపంచవ్యాప్తంగా పెన్సిలిన్ మందు ఏ విధంగా పేదలకు ఉపయోగపడిందో మా ఈ స్టవ్ కూడా అలాగే ఉపయోగపడుతుంది అన్నది మా నమ్మకం అని సెడార్ చెబుతున్నారు.
ఈ స్టవ్ వాడడం వల్ల 2016-17 ల్లో దాదాపు లక్షమంది శుభ్రమైన గాలిని పీల్చారు, 54,000 వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది, ఇంకా 60,000 టన్నుల పైన కర్బన ఉద్గారాలు తగ్గాయన్నది బయోలైట్ వారి రిపోర్ట్.