Home ఆదిలాబాద్ మారుతున్న వాతావరణం … వ్యాధుల బారిన జనం

మారుతున్న వాతావరణం … వ్యాధుల బారిన జనం

Summerఆదిలాబాద్‌ : మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ఎండ వేడిమిని తాళలేక వడదెబ్బ బారిన  పడుతూ ఆసుపత్రులలో చేరుతుండగా, మరోవైపు రాత్రి, సాయంత్రం వేళల్లో ఒకేసారి వాతావరణం చల్లబడుతుండంతో వివిధ రకాల వ్యాధులతో సతమతం కావాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. మద్యాహ్నం వరకు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరి కాగా, మధ్యాహ్నం తరువాత ఒకేసారి వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన గాలులు వీస్తూ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అయితే ఉదయం మళ్లీ భానుడి భగభగతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇలా వాతావరణ మార్పులు చోటు చేసుకోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు సాధారణ ప్రజలు సైతం జ్వరం, జలుబు తదితర వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక వేడి తీవ్రత అధికంగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వడదెబ్బ బారిన పడి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనై ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రజలు వడదెబ్బ బాధితులు రిమ్స్‌లో చేరుతుండగా, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా మరణాలు సైతం సంభవించాయి. వ్యాధులకు తోడు వాతావరణ పరిస్థితులలో మార్పు రావడంతో రైతులు సైతం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నీటి వనరులు ఉన్న రైతులు సాగు చేస్తున్న గడ్డి, కూరగాయల పంటలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. ఇక ఈదురు గాలులతో ఇళ్ల పైకప్పులు లేచి పోవడం, చెట్లు విరిగి పోవడం లాంటి వాటితో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. సహజంగా ఏర్పడిన అడవుల నరికివేత, తీవ్రమవుతున్న వాతావరణ కాలుష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొంటున్నప్పటికీ వీటిని నివారించడంలో సాధారణ ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని నిందించడంతోనే సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇదిలాఉంటే ఆదిలాబాద్ జిల్లాలో గతంలో వాతావరణ పరిస్థితులు సమతుల్యంగా ఉండేవని, అడవులను యధేచ్చగా నరికి వేయడంతో వర్షాలు ప్రతికూలంగా కురవడం, ఎండల తీవ్రత పెరగడం, చలి తీవ్రత కొన్ని సార్లు అధికంగా, మరికొన్ని సార్లు అత్యల్పంగా ఉండడం లాంటివి చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మారుతున్న వాతారణ పరిస్థితులు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

People Suffer from Diseases In Summer