Home తాజా వార్తలు మండుతున్న ఎండలతో ప్రజల పరేషాన్

మండుతున్న ఎండలతో ప్రజల పరేషాన్

Summerకొల్లాపూర్ (నాగర్ కర్నూల్): ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి. మండే ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. ఒక పక్క ఎండలు, మరోపక్క ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. రోహిణి కార్తి రోకళ్లు పగిలేంత ఎండ అన్న సామేత అక్షరాల నిజమనేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎన్నడు లేనంతగా ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి.  వాతావరణ మార్పుల కారణంగానే ఎండలు భగ్గమంటున్నాయని శాస్త్రవేతలు చెబుతున్నారు.  రోహిణి కార్తె వస్తే ఎండలు మండిపోతుండడం సహజమేనని పెద్దలు చెబుతున్నారు.
కార్తె అంటే…
నక్షత్రాల ఆధారంగా పండితులు జాతకాలు, పంచాంగాలు తయారు చేస్తుంటారు. రైతులు వీటి ఆధారంగా వ్యవసాయ పనులకు సమాయత్తమవుతుంటారు. ఈ సక్షత్రాలనే కార్తె అంటుంటారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరుతో పిలుస్తుంటారు. ఇలాంటివి 27 ఉన్నాయి. అందులో నాలుగవదే రోహిణి కార్తె.
రోహిణి ప్రత్యేకత…
ఈ కాలంలో సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా భూమిపై పడుతుంటాయి. ఈ రోజుల్లో ఎండ తీవ్రత మిగిలిన రోజుల్లో కన్నా అధికంగా ఉంటుంది. ప్రతి కార్తె 13 నుంచి 15 రోజులపాటు ఉంటుంది. 365 రోజుల్లో 27 నక్షత్రాలతో భాగిస్తే ఒక్కో కార్తె 13.5 రోజులు అవుతుంది. కార్తెలు కూడా సంక్రాంతి పండుగలా ఒక రోజు అటుఇటుగా వస్తుంటాయి.
పెరుగుతున్న ఎండ తీవ్రత…
ఉదయం 8 గంటలకే ఎండల తీవ్రత అధికమవుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి. శనివారం ప్రారంభమైన రోహిణి కార్తె తన ప్రతాపాన్ని చూపుతుంది. ప్రజలు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకపోవడమే మేలు. ఉదయం 8 నుంచి ఇంటి వద్దే ఉండడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఎండ తీవ్రతకు వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా ద్రవ పదార్థాలను, పానియాలను, నీరును తీసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లలంటే తలకు టోపీలు, రుమాలలు, శరీరాన్ని కప్పి ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేపుళ్లు, జంక్ పుడ్స్, ఫాస్టుపుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

People Suffer From Hot Summer