Thursday, April 25, 2024

ప్రైవేటుకు బార్లా…

- Advertisement -
- Advertisement -

Permission for private investment in nuclear power units

 

రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు కరోనా కోరల్లోని జాతిని ఆదుకునే భారీ ప్యాకేజీ పేరుతో మానవీయ ముఖం బొత్తిగా లేని సంస్కరణలకు తెర తీసింది. పని స్థలాలకు, స్వస్థలాలకు మధ్య ఎంత నడిచినా దూరం తగ్గని కష్ట బాటలో చిక్కుకొని, పయనిస్తున్న వాహనాలూ ప్రమాదాల బారినపడి మరణిస్తున్న అసంఖ్యాక వలస కార్మికుల మృత్యు రోదనలు మిన్నంటుతున్నా చెవికెక్కించుకోకుండా వివిధ కీలక ఆర్థిక రంగాలను బంగారు పళ్లెంలో పెట్టి ప్రైవేటుకు అప్పగించే తెగువకు పాల్పడింది.

దేశానికి కరోనాను మించిన శాశ్వత వైరస్‌ను అంటించే నిర్వాకానికి ఒడిగట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు వరుసగా నాలుగో రోజున బుట్టలోంచి తీసి ప్రజల మీదకు విడిచిపెట్టిన ప్యాకేజీ నాలుగో భాగం కరోనాను అరికట్టడంతోగాని, లాక్‌డౌన్ బాధిత ఆర్థిక వ్యవస్థకు తక్షణ స్వస్థత చేకూర్చడంతోగాని, నూతన వైరస్ నేపథ్యంలో డొల్లతనం అమితంగా బయటపడిన వైద్య ఆరోగ్య రంగాన్ని మెరుగుపర్చడంతోగాని ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది.

స్వావలంబన సాధన పేరుతో అంతటా ప్రభుత్వేతర పెట్టుబడులకు విశాలమైన ఎర్ర తివాచీ పరవడమే ధ్యేయంగా ఆమె ఈ ఆత్మహత్యా సదృశమైన సంస్కరణలకు పచ్చ జెండా ఊపారు. బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, విమానాశ్రయాలు, పౌర విమానయానం, విద్యుత్తు పంపిణీ, అంతరిక్ష పరిశోధన, అణుశక్తి విభాగాలలో ప్రైవేటు పెట్టుబడులకు తిరుగులేని ప్రవేశం కల్పించే నిర్ణయాలు తీసుకున్నారు. దేశ భద్రత, ప్రగతి, సాధారణ ప్రజల సంక్షేమంతో నేరుగా ముడిపడి ఉన్న ఈ రంగాలను పాలకులకు ఆశ్రితులైన ప్రైవేటు సంపన్న పెట్టుబడిదార్లకు బేషరతుగా ధారాదత్తం చేయడం ఎంత వినాశకరమో చెప్పనక్కర లేదు. అటువంటి దుస్సాహస చర్యను కరోనా పీడిత సువిశాల భారతాన్ని ఆదుకోడానికి తీసుకున్న నిర్ణయంగా ప్రకటించడం విడ్డూరం. రాష్ట్రాలు భారీగా సబ్సిడీలు భరిస్తూ పేద రైతులు, ఎస్‌సి, ఎస్‌టిలు తదితర అణగారిన వర్గాలను, జౌళి వంటి రంగాలను ఆదుకుంటున్న ప్రస్తుత స్థితి నుంచి విద్యుత్తును బహు దూరం చేసి దానిపై తన గుత్తపెత్తనపు పిడికిలిని బిగిస్తూ దానిని ప్రైవేటు లాభార్జన స్థావరంగా మార్చడానికి ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా చట్టంలోని అంశాలను ఇందులో చేర్చారు.

కేంద్రపాలిత ప్రాంతాలలోని విద్యుత్తు పంపిణీ సంస్థల (డిస్కంలు)ను ప్రైవేటుకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ముందు ముందు రాష్ట్రాల కొంప కూడా ముంచుతుందనడానికి వెనుకాడవలసిన పని లేదు. అంతరిక్ష పరిశోధనలో లక్ష సాధనలో ఎంతో అనుభవం గడించిన ప్రభుత్వ రంగాన్ని దారుణంగా నిరుత్సాహానికి గురి చేస్తూ అందులోకి ప్రైవేటు పెట్టుబడులను రప్పించదలచడంలోని జనహితం ఏమిటో అర్థం కానిది. మరి ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నడపడానికి వీలుగా వేలం వేయదలచినట్టు ప్రకటించారు. బొగ్గు రంగంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించదలచి వాటి ప్రవేశానికి అనాయాస నిబంధనలను రూపొందిస్తామని చెప్పారు.

బొగ్గు బ్లాకుల వేలంలో ఎవరైనా పాల్గోడానికి సందు కల్పించదలచారు. ప్రైవేటుకు తలుపులు తెరిచే విషయం మాట్లాడినప్పుడల్లా సామాన్యులు కూడా వేలంలో పాల్గొనవచ్చని నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణ సరైన కూడు, గూడు, వస్త్రానికే నోచుకోని సాధారణ ప్రజలను అపహాస్యం పాలు చేయడం కాక మరేమిటి! ప్రధాని మోడీ ఐదు రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ చేసిన అట్టహాస ప్రకటన, లాక్‌డౌన్ వల్ల చిల్లి గవ్వలేని దుస్థితికి చేరుకున్న కోట్లాది బడుగు జనానికి అది ఎంత మాత్రం గొడుగు కాదని ఆ తర్వాత నాలుగు రోజులుగా ఆర్థిక మంత్రి వెల్లడిస్తున్న దాని వివరాలు రుజువు చేశాయి.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇల) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని చెబుతూ ప్రకటించిన రూ. లక్షల కోట్ల సాయం కూడా అప్పు రూపంలో ఇచ్చి వడ్డీతో సహా గోళ్లూడగొట్టి వసూలు చేసుకోడానికి ఉద్దేశించిందేనని స్పష్టమైపోయింది. 50 రోజులకు పైగా ఉత్పత్తి కార్యకలాపాలు, వ్యాపారాలు మూతపడిపోయి వాటిని తెరవడానికి కావలసిన కనీస పెట్టుబడి కరువైన స్థితిలో ప్రభుత్వమిచ్చే వడ్డీ భారంతో కూడిన రుణాలను తీసుకోడానికి ఎంత మంది ముందుకు వస్తారనేది కీలకం. వివిధ స్వయం ఉపాధి పనులు చేసుకుంటూ బతుకులు వెళ్లమార్చేవారు, రోజు కూలీలు ఇలా ఎంతో మంది ఈ రోజున తీవ్ర నిరాశమయ స్థితిలో ఉన్నారు. వీరందరికీ నేరుగా నగదు సాయం చేసి వారిలో జీవితం మీద విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పవలసిన పాలకులు అటు అదీ చేయక మరోవైపు ఇదే సందుగా దేశాన్ని మరింతగా ప్రైవేటు గుపెట్లోకి నెట్టివేయబోవడాన్ని ఎంత మాత్రం హర్షించలేము.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News