గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ హత్య కలకలం రేపింది. బెలిపార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బఘబీర్ బాబా ఆలయం వద్ద సోమవారం ఉదయం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పెట్రోల్ బంక్ మేనేజర్‌ను కాల్చి చంపి అతని బ్యాగ్ లోని రూ.11.22 లక్షల నగదును కాజేసి పరారయ్యారు. పెట్రోలు బంకు మేనేజర్ ఆనంద్ స్వరూప్ మిశ్రా మరో ఉద్యోగితో కలసి మహావీర్ చాప్రా ఏరియాలో స్టేట్‌బ్యాంకులో నగదును డిపాజిట్ చేయడానికి మోటారు సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి దుండగులు ఇద్దరు బైకుపై వచ్చి డబ్బును కాజేశారు. బంకు మేనేజర్ కాలికి, ఛాతీకి తుపాకీ తూటాలు పడ్డాయి. గోరఖ్‌పూర్ లోని బిఆర్‌డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనితోపాటు వెళ్తున్న మరో ఉద్యోగి సునీల్ సింగ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Petrol bunk Manager shot dead in UP