Home తాజా వార్తలు ఒడిదుడుకులుంటాయ్..

ఒడిదుడుకులుంటాయ్..

bsns

 పెట్రో ధరల పెంపు, రూపాయి పతనం, క్యూ4 ఫలితాలు కీలకం : నిపుణులు 

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్ల దూకుడుకు గత వారం బ్రేక్ పడింది. నిఫ్టీ 11 వేల స్థాయికి చేరువ అవుతుందన్న తరుణంలో కర్నాటకలో రాజకీయ అనిశ్చితి, అంతర్జాతీయంగా బలహీన పరిణామాలు ర్యాలీకి అడ్డుతగిలాయి. ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయనే భయాలు నెలకొన్నాయి. మరోవైపు చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనం కూడా మార్కెట్ దూకుడుతు కళ్లెం వేశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయి 68కి చేరింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్లకు చేరడం, అమెరికా పదేళ్ల ఈల్డ్ 3 శాతం దాటడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కల్గిస్తున్నాయి. గత వారం నిఫ్టీ వారం కనిష్టం 10,596 పాయింట్లకు పడిపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ సూచీలు 2.7 శాతానికి పతనమయ్యాయి. అయితే ఈ వారంలోనూ ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులు భావిస్తున్నారు.
నాలుగో త్రైమాసిక ఫలితాలు
ఇప్పటికే చాలా కంపెనీలు మార్చి నెల ముగింపు నాటి క్యూ4 ఫలితాలను వెల్లడించాయి. ఇంకా మరికొన్ని ప్రధాన సంస్థలు ఈవారం ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌కు ఎంతో కీలకం కానున్నాయి. కాల్గేట్ పామోలివ్, జస్ట్‌డయల్, మహానగర్ గ్యాస్ వంటి ముఖ్యమైన కంపెనీలు నేడు (సోమవారం) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇంకా బాటా ఇండియా, సిప్లా, డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్, ఇండియన్ ఆయిల్(ఐఒసి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22న ప్రకటిస్తాయి. ఈనెల 23న గోద్రెజ్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్, టాటా మోటార్స్, అలాగే 24న గెయిల్, గ్లాక్సో స్మిత్‌క్లెయిన్ ఫార్మాలు ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఇంకా ఈ జాబితాలో బిఒబి(బ్యాంక్ ఆఫ్ బరో డా), కాడిలా హెల్త్‌కేర్, ఇంజినీర్స్ ఇండియా, హిందుస్తాన్ కాపర్, ఎన్‌బిసిసి ఇండియా, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా 25న ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో వచ్చే వారం ఇన్వెస్టర్లు ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలపై దృష్టిపెట్టే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
రూపాయి, చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ రేటు 80 డాలర్లకు చేరడం.. ఇతర దేశాలపైనా ప్రభావం చూపిస్తోంది. డాలరుతో మారకంలో రూపాయి 68కు బలహీనపడింది. దేశ ఇంధన అవసరాలలో 80 శాతం వరకూ దిగుమతులపై ఆధారపడటంతో వాణిజ్యలోటు పెగరనున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. క్రూడ్ ధరల ప్రభావంతో పెట్రో ఉత్పత్తుల ధర పెరనుండడం.. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవ్వడంతో వంటి ఆందోళనలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుంటే.. ఆర్‌బిఐ కఠిన పరపతి విధానాలను అమలు చేయాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఇది కొంతమేర సెంటిమెంటును బలహీనపరచవచ్చని మార్కె ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమావేశం వివరాలు(మినిట్స్) 23న వెల్లడికానున్నాయి. ఇకపై వడ్డీ రేట్ల విషయంలో ఎలా స్పందించనుందన్న వివరాలు మార్కెట్లకు కీలకంకాగలవని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ అన్ని అంశాలతోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడుల తీరుకు కూడా ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు అంటున్నారు.