Saturday, April 20, 2024

పెట్రో ‘శతకం’

- Advertisement -
- Advertisement -

Petrol price is Rs. One hundred crossed

 

దేశం ఏమైపోయినా, ఎంతటి దారిద్య్రంలో కూరుకుపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అకాల కొవిడ్ మరణాలతో ఎంతగా కన్నీటి కుండ అయి పోయినా క్రమం తప్పకుండా విరుచుకుపడుతున్న పెట్రో ధరల పెంపు శుక్రవారం నాడు మరోసారి తన పంజాతో ప్రజలను ముద్దాడింది. దీనితో ఈ అత్యవసర పరుగు ఇంధనాల ధరలు మరింతగా పేట్రేగిపోయాయి. ఢిల్లీలో పెట్రోల్‌పై లీటర్‌కు 29, డీజెల్ మీద 28 పైసలు పెంచారు. ప్రతి పెరుగుదలలోనూ కేంద్ర, రాష్ట్రాల పన్నులు కలిసి ఉంటాయి. కాబట్టి ఈ పెంపు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య తేడాలు స్వల్పంగా మాత్రమే ఉంటాయి. మొత్తానికి అన్ని చోట్ల లీటరు ధర వంద రూపాయలను దాటిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరు రూ. 95.85, డీజెల్ రూ. 86.78, ముంబైలో పెట్రోల్ ధర రూ. 102.04, డీజెల్ రూ. 94.15, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 99.75, డీజెల్ రూ. 94.57. ఈ నెలలో ఈ ధరలు పెరగడం ఇది ఆరోసారి. గత నెలలో 16 సార్లు ఎగబాకింది.

ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీల ఎన్నికల సమయంలో నిద్ర నటించిన ఈ ధరలు మే 2న ఫలితాలు వెల్లడైన తర్వాత ఆ నెల 4 నుంచి మళ్లీ విజృంభించడం ప్రారంభించాయి. చమురు కంపెనీలు పూర్వం మాదిరిగానే ఈ ధరలను మండించడం మొదలుపెట్టాయి. భోపాల్, జైపూర్, ముంబైలలో గత నెలలోనే పెట్రోల్ ధర శతకం చదివేసి దానిని దాటిపోయింది. రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్ జిల్లాలో పెట్రోల్ ధర చాలా కాలం కిందటే ‘వంద’నం చేసి ‘నా పరుగు ఆగనిది, మీ బతుకు సాగనిది’ అని చెప్పేసింది. అక్కడ ఇప్పుడు పెట్రోల్ లీటర్ రూ. 106.94, డీజెల్ రూ. 99.80. మధ్యప్రదేశ్‌లోని అనుపూర్ జిల్లాలో ఇప్పుడు పెట్రోల్ ధర రూ.106.59, డీజెల్ రూ. 97.74. డీజెల్ ప్రజావసరాల ఇంధన కాబట్టి బస్సులు, లారీలు వగైరా రవాణా వాహనాల్లో ఉపయోగించేది కనుక గతంలో దాని ధర పెట్రోల్ కంటే చాలా తక్కువగా ఉండేది. రెండింటి ధరల మధ్య రూ. 10, 15, 20 తేడా కూడా ఉండేది.

ఆ దూరాన్ని సైతం తొలగించి వేసి రెండు గుర్రాలను ఇంచుమించు ఒకే వేగంతో ఇప్పుడు పరుగులెత్తిస్తున్నారు. ఈ రెండు ఇంధనాలను వాటి అసలు ధరకు విక్రయిస్తే ప్రస్తుత ధరల్లో సగం కంటే తక్కువకే సాధారణ ప్రజలకు అవి లభ్యమవుతాయి. బైక్‌ల మీద దూరాలు వెళ్లి బతుకు భారాన్ని తట్టుకుంటున్న కోట్లాది పేద, మధ్య తరగతి ప్రజలు హాయిగా జీవించేవారు. కాని సునాయాసంగా ఆదాయం తెచ్చే ఈ రెండు ఇంధనాల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టావిలాసంగా పన్నులు వేసి వసూలు చేసుకుంటున్నందున వీటి ధరలు సాధారణ ప్రజల మూలుగులను పీల్చుకుంటున్నాయి. పెట్రోల్ ధరలో 60 శాతం కేంద్ర, రాష్ట్రాల పన్నులుంటాయి. డీజెల్ ధరలో 54 శాతం వరకు అవే. పెట్రోల్ మీద కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ. 32.90 కాగా, డీజెల్ మీద రూ. 31.80. దీనికి తోడు రాష్ట్రాల పన్నులు పెరుగుతూ పోతుంటాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల పెరుగుదలతోనూ, డాలర్‌తో రూపాయి మారకం రేటుతోనూ ముడిపెట్టి దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలను క్రమం తప్పకుండా చమురు కంపెనీలు పెంచేస్తూ ఉంటా యి. ఈ ధరల పెంపు ద్వారా కేంద్రం అదనంగా తన ఖజానాను నింపుకుంటున్నదేమో తెలియదు. రాజకీయ అవసరం కోసం ఎన్నికల సందర్భంలో కంపెనీలకు చెప్పి ఈ ధరల పెంపును తాత్కాలికంగా ఆపించే కేంద్ర పాలకులు మిగతా సమయాల్లో వాటి స్వేచ్ఛకు వదిలిపెడతారు. ప్రజలు అపూర్వమైన కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడైనా పాలకులు కంపెనీల మీద తమకు గల పట్టును ఉపయోగించి దీర్ఘకాలం పాటు ఈ ధరలకు పగ్గాలు వేయించవచ్చు. కాని అది జరగడం లేదు. ఈ సంవత్సరం ఇంత వరకు పెట్రోల్ లీటర్ ధర రూ. 10.78, డీజెల్‌పై రూ. 11.51 పెరిగాయి. 135 జిల్లాల్లో రూ. వంద దాటిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ధరలు 43 సార్లు పెరిగి నాలుగు సార్లు మాత్రమే తగ్గాయి.

మొట్టమొదటిసారిగా రాజస్థాన్‌లో పెట్రోల్ ధర రూ. వంద దాటిపోయినప్పుడు గత ఫిబ్రవరి 17న ప్రధాని మోడీ స్పందిస్తూ నెపాన్ని గత యుపిఎ తదితర ప్రభుత్వాల మీదకు నెట్టివేశారు. అవి గనుక దేశీయ ఆయిల్ ఉత్పత్తిని భారీగా పెంచి దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితిని తగ్గించి ఉంటే మధ్య తరగతి ప్రజల మీద ఈ భారం ఇంతగా పడి ఉండేది కాదన్నారు. ఈ ఏడేళ్లలో ఆ దిశగా తమ ప్రభు త్వం ఏమి చేస్తున్నదో చెప్పలేదు. ఇథనాల్‌ను ప్రత్యామ్నాయ ఇంధనంగా క్రూడాయిల్‌లో కలిపి వాడడం ద్వారా ఈ ధరలను అదుపు చేయవచ్చు. అటువైపుగా జరుగుతున్న కృషి ఏమిటో స్పష్టంగా తెలియదు. ఈ ధరలు ఇలా రెచ్చిపోయే క్రూర మృగాల్లా ప్రజల జేబులను కొల్లగొడుతుంటే దేశం ముందుకు ఎలా సాగుతుంది, ప్రజల బాధలు ఏ విధంగా తగ్గుతాయి?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News