Home హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌లో ఫార్మా సిబ్బంది కొరత

ఫీవర్ హాస్పిటల్‌లో ఫార్మా సిబ్బంది కొరత

ఫీవర్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు
మందుల కోసం గంటలకొద్దీ క్యూ
సొమ్మసిల్లుతున్న రోగులు
పనిభారంతో ఫార్మసీ సిబ్బంది
పట్టించుకోని ఆసుపత్రి వైద్యాధికారులు

Fever-Hospital

నల్లకుంట : కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటు గా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలు ఆచరణలో అడుగు ముందుకేయడం లేదు. రాష్ట్రం లోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌లో ఐదు సంవత్సరాలుగా ఫార్మసీ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో కేవలం 6 గురు ఉద్యోగులతో ఫార్మసీ విభాగం పని చేస్తూ నెట్టుకొస్తోంది. ఉన్న సిబ్బందిపై పని భారం రోజు రోజుకూ ఎక్కువవుతోందని సిబ్బంది వాపో తున్నారు.

ఫీవర్ ఆసుపత్రికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల జ్వరాలు, చికెన్ పాక్స్, డిఫ్త్తీరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్, పుడ్ పాయిజన్, కుక్కకాటు, మలేరియా తదితర వ్యాధుల చికిత్స కోసం ప్రతిరోజూ 800-1000 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఐదు సంవత్సరాలుగా ఫార్మసీ విభాగం లో సిబ్బంది లేక వీరంతా నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో 330 పడకలు ఉన్నాయి. వైద్యశాఖ లెక్కల ప్రకారం ఆసుపత్రిలో 13 మంది ఫార్మసీ సిబ్బంది ఉండాలి. ప్రస్తుతానికి ఈ హాస్పిటల్‌లో కేవలం 6 గురు సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపై పని భారం తమపై పడుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగా ఫార్మసీ సిబ్బందిని తీసుకోవాలని హాస్పిటల్ ఉన్నతాధికారులకు ఫార్మా సిబ్బంది అనేక సార్లు ఫిర్యాదు చేసినా సదరు అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడంలేదని ఉద్యోగులు వాపోతు న్నారు. సిబ్బంది కొరత కారణంగా రోగులు మందుల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోందని రోగులు ఆందోళన చెందుతున్నారు. కొందరు క్యూలైన్‌లో నిలబడలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరి కొందరైతే క్యూలైన్‌లో వేచి ఉండలేక మందులు తీసుకోకుండానే వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, వైద్య ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఫీవర్ హాస్పిటల్‌కు అవసరమైన ఫార్మా సిబ్బంది నియామించాలని రోగులు కోరుకుంటున్నారు.