Home జాతీయ వార్తలు కశ్మీర్‌లో నిషేధాజ్ఞల సడలింపు

కశ్మీర్‌లో నిషేధాజ్ఞల సడలింపు

Kashmir

ఫోన్, ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణ … మసీదుల్లో ప్రశాంతంగా ప్రార్థనలు
ముందు జాగ్రత్త చర్యగా భారీగా బలగాల మోహరింపు

శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్ లో విధించిన నిషేధాజ్ఞలను శుక్రవారం పాక్షికంగా సడలించారు. శుక్రవారం ప్రార్థనలను పురస్కరించుకొని స్థానికంగా ఉన్న చిన్న మసీదుల్లో నమాజ్ చేయడానికి వీలుగా ఈ ఆంక్షలను కొంతమేర సడలించారు. ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. అయితే ఘర్షణలు జరిగే అవకాశాలున్న దృష్టా భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కశ్మీరీలు ఎవరినీ వేధింపులకు గురి చేయవద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధికారులను ఆదేశించడంతో ఆంక్షలను సడలించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీనగర్‌లోని జామా మసీదు గేట్లను మాత్రం తెరవలేదు. భద్రతా కారణాల దృష్టా అక్కడ ప్రార్థనలను అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ప్రార్థనలు ప్రశాంతంగా జరిగితే ఆంక్షలను మరింత సడలిస్తామని కూడా అధికారులు చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్‌తో పాటుగా కశ్మీర్ లోయ అంతటా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. సాంబా జిల్లాలో శుక్రవారం పాఠశాల లు తిరిగి తెరుచుకున్నాయి. సోమవారం బక్రీద్ పండుగ అయినందున ఆ రోజుకల్లా ఆంక్షలను పూర్తిగా తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆదివారం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
శ్రీనగర్ పాతబస్త్తీలో దోవల్ పర్యటన
ఇదిలా ఉండగా గత మంగళవారంనుంచి శ్రీనగర్‌లోనే ఉంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం శ్రీనగర్ పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికులు, భద్రతా సిబ్బందితో మాట్లాడారు. సహాయకులు, ఇతర పోలీసు అధికారులు వెంటరాగా దోవల్ ఈద్గా లొకాలిటీని సందర్శించారు. మార్గమధ్యం లో పలు చోట్ల ఆగి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన పోలీసు, సిఆర్‌పిఎఫ్ జవాన్లతో కూడా మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అద్భుతంగా కృషి చేస్తున్నందుకు వారిని అభినందించారు. దోవల్ బుధవారం దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో కూడా పర్యటించిన విషయం తెలిసిందే. దోవల్ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో కూడా సమావేశమై రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించారు.
ఏచూరి, రాజాలకు చేదు అనుభవం
తమ పార్టీ కార్యకర్తలను కలుసుకోవడం కోసం శుక్రవా రం శ్రీనగర్ వచ్చిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాలను అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్టా వారిని నగరంలోకి వెళ్లనీయకుండా ఆపు చేశారు. తమ పర్యటన గురించి వీరు ఒక రోజు ముందే కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సమాచారం అందించారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంపై సిపిఎం ట్విట్టర్ వేదికగా నిరసన తెలియజేసింది. ‘మా పార్ట్టీ ఎంఎల్‌ఎ మోన్ యాసిఫ్ తరిగామి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను పరామర్శించడం కోసమే ఏచూరి శ్రీనగర్ వచ్చారు. ఈ విషయమై గవర్నర్‌కు ముందుగా సమాచారం ఇచ్చినప్పటికీ శ్రీనగర్ విమానాశ్రయంలోనే ఏచూరిని అడ్డుకున్నారు. దీన్ని మేం తీవ్రం గా ఖండిస్తున్నాం’ అని పేర్కొంది. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను కూడా ఇలాగే శ్రీనగర్ విమానాశ్రంలో ఆపేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మియాన్ ఖయ్యూం సహా దాదాపు పాతిక మంది వేర్పాటువాదులను కశ్మీర్ లోయనుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. గురువారం శ్రీనగర్‌నుంచి ఆగ్రా సెంట్రల్ జైలుకు భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో విమానంలో తరలించిన 70 తీవ్రవాద ఖైదీల్లో ఖయ్యూమ్‌తో పాటుగా కశ్మీర్ వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు ముబిన్ షా కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Phone Services and Internet Partially Restored in Kashmir