Home తాజా వార్తలు మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటోనే

మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటోనే

Photography day

 

సిద్దిపేట : మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఒక్క ఫోటో మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 180వ ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఫోటోఅండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని దూది మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఫోటోగ్రాఫర్లు తీసే ఫోటోలతో గత చరిత్రను భద్రపర్చుకోవచ్చన్నారు. 180 సంవత్సరాల క్రితం డాగురే అనే వ్యక్తి కెమెరాను కనిపెట్టాడన్నారు. మనం ఏ కార్యక్రమం చేపట్టిన ఫోటోగ్రాఫర్ ఉండడం ఎంతో ముఖ్యంగా మారిపోయిందన్నారు. ఫోటోగ్రాఫర్ వృత్తి అనేది ఒక గొప్ప కళ అని కొనియాడారు. సమాజంలో ఫోటోగ్రాఫర్లకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఫోటోగ్రాఫర్లు తీసే ఒక్క ఫోటో ప్రభుత్వాన్నే ఆలోచింపజేస్తుందన్నారు.

జెడ్ స్పీడ్‌తో దూసుకుపోయే రాకెట్‌ను సైతం ఫోటోలో బంధించే ఘనత ఫోటోగ్రాఫర్లదేనన్నారు. జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ లాంటి సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. 25 లక్షల వ్యయంతో మంచి ఫోటోగ్రఫిక్ భవనాన్ని నిర్మించి ఇస్తానన్నారు. ఈ భవనంలో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించేలా తగు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సిద్దిపేట పట్టణంలో ఉన్న నిరుపేద ఫోటోగ్రాఫర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో చోటు కల్పిస్తామన్నారు. అలాగే త్వరలోనే ఫోటోగ్రాఫర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.

సిద్దిపేట పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపి అవార్డులు తీసుకొన్న మహిమల భాస్కర్‌రెడ్డి, బాబురావు, సతీష్‌గౌడ్‌లకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో సైతం అవార్డులు దక్కించుకునేలా ఫోటోగ్రాఫర్లు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్‌రావుకు పుష్పగుచ్చంను అందించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు పాల సాయిరాం, కొర్తివాడ రామన్న, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం ప్రతినిధులు వెంకటరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుదాస్, వెంకన్న, కృష్ణమూర్తి, శైలేందర్, రవీందర్, పురుషోత్తం, బాబా, శేఖర్, శ్రీనివాస్, నర్సింలు, మునీర్, జాంగీర్ తదితరులు ఉన్నారు.

Photo is Reminder of fond Memories