Home ఎడిటోరియల్ కేజ్రీవాల్‌పై భౌతిక దాడులు

కేజ్రీవాల్‌పై భౌతిక దాడులు

Delhi CM Arvind Kejriwal

 

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఓ యువకుడు దాడి చేశాడు. ఆయన వాహనంపైకి దూసుకొచ్చి కేజ్రీవాల్ చెంపపై బలంగా కొట్టాడు. ఆ ధాటికి కేజ్రీవాల్ వెనక్కి వాలిపోయారు. ఢిల్లీలోని మోతీనగర్ ప్రాంతంలో సిఎం కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది, కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు ముందే కేజ్రీవాల్‌కు కూడా హెచ్చరిక చేశారట. కాని రక్షణ మాత్రం కల్పించలేకపోయారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ దాడిని ఆపకపోవడం కుట్ర అన్నారు.

తనపై దాడి తర్వాత కేజ్రీవాల్ స్పందించారు. ఒకటి రెండు సార్లు భద్రతలో పొరబాట్లు జరగవచ్చు, కాని వరుసగా తొమ్మిది సార్లు తనపై దాడులు జరిగినా పోలీసులు ఆపలేకపోయారంటే కుట్ర కాక మరేమిటని కేజ్రీవాల్ ప్రశ్నించారు. భారత చరిత్రలో ఒక ముఖ్యమంత్రిపై ఇన్నిసార్లు దాడులు ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. ఈ దాడి వెనుక బిజెపి హస్తం ఉందని.. పక్కా ప్రణాళికతోనే ఆ పార్టీ నేతలు ఈ పని చేయించారని ఆప్ ఆరోపించింది. పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారట. దాడి చేసిన సురేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు దారుడేనని, పార్టీ నేతల తీరుతో తీవ్ర అసంతృప్తికి గురైన దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. సురేష్ భార్య చెప్పిన మాటలు మరోరకంగా ఉన్నాయి. మోదీ అంటే సురేశ్ పడిచస్తాడని, చాలా పెద్ద మోడీ భక్తుడని అతడి భార్య చెప్పింది. నరేంద్రమోడీకి పరమ భక్తుడన్న విషయాన్ని అతడి భార్య స్వయంగా చెప్పిందని మనీష్ సిసోదియా ట్వీట్ చేశారు. భార్య స్వయంగా అతను మోడీ భక్తుడని చెబుతుంటే, పోలీసులు మాత్రం ఆప్ కార్యకర్త అంటున్నారు, బహుశా ఇంటరాగేషన్ తర్వాత ఆమె అసలు నా భార్య కాదని ఇతనంటాడేమో అంటూ మనీష్ సిసోదియా ట్వీట్ చేశాడు.ఈ దాడి ప్రణాళిక మొత్తం బిజెపి కార్యాలయంలోనే రూపొందించారని, బిజెపి చెప్పిన మాటలనే ఢిల్లీ పోలీసులు వల్లెవేస్తున్నారని అన్నారు.

ఎన్నికల సంఘమే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ఢిల్లీ పోలీసులు మాత్రం ఇంతకన్నా ఏం చేస్తారంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఒక సామాన్యుడు పైకెదగడాన్ని బిజెపి భరించలేకపోతుందన్నారు. అందుకే ఈ దాడి చేయించారంటూ తీవ్రంగా ఆరోపణలు సంధించారు. కేజ్రీవాల్ పై దాడిని అందరూ ఖండిస్తున్నప్పటికీ బిజెపి మాత్రం విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నది. కేజ్రీవాల్ పై దాడి జరిగిన తర్వాత ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారి మాట్లాడుతూ అసలు ఈ దాడి కేజ్రీవాలే స్వయంగా చేయించుకుని ఉంటాడని అన్నాడు. పోలీసులు చెప్పిన మాటలకు, మనోజ్ తివారీ మాటలకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రతిసారి ఎన్నికల్లో ఎవరో ఒకరు వచ్చి కేజ్రీవాల్ చెంప పగలగొట్టే సన్నివేశాలు జరుగుతూనే ఉన్నాయంటూ చిల్లర వ్యాఖ్య చేశాడు. గతంలో కేజ్రీవాల్ పై జరిగిన దాడులను చూస్తే ఒక నాయకుడు ఇన్ని దాడులను తట్టుకుని నిలబడడం ఆశ్చర్యమనిపిస్తుంది.

అక్టోబర్ 18, 2011వ తేదీన లక్నోలో అన్నా హజారే టీం ర్యాలీ సందర్భంగా ఒక వ్యక్తి కేజ్రీవాల్ పై చెప్పు విసిరి దాడి చేశాడు. చెప్పు విసిరిన జితేంద్ర పాఠక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేజ్రీవాల్ ప్రజలను మోసం చేస్తున్నాడు కాబట్టి చెప్పు విసిరానని అతను చెప్పాడు. ఈ వ్యక్తి బిజెపికి సన్నిహితుడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. 18 నవంబర్ 2013లో మరో దాడి జరిగింది. బిజెపి కార్యకర్తగా చెప్పుకునే నచికేత అనే వ్యక్తి నల్ల సిరాను కేజ్రీవాల్ పై విసిరాడు. నచికేతను క్షమించినట్లు ఆ తర్వాత కేజ్రీవాల్ ప్రకటించారు. మార్చి 5, 2014వ తేదీన అహ్మదాబాద్‌లో కేజ్రీవాల్ కారుపై రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడి ఎందుకు చేశారంటే, ఢిల్లీలో బిజెపి కార్యాలయం ముందు ఆప్ కార్యకర్తలు ధర్నా చేసినందుకు. అంతేకాదు, అహ్మదాబాద్ లో ఆయన ర్యాలీపై కూడా రాళ్ల దాడి జరిగింది. 2014 మార్చి 25వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ వారణాసి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనపై తీవ్రమైన దాడి జరిగింది. ఆయనపై సిరా విసిరారు. కోడిగుడ్లు విసిరారు.

వారణాసిలో నరేంద్రమోడీపై ఆయన పోటీ చేశారప్పుడు. మోడీ మద్దతుదారులు కేజ్రీవాల్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. 2014 మార్చి 28వ తేదీన అన్నాహజారే మద్దతుదారుగా చెప్పుకునే మరో గూండా కేజ్రీవాల్ పై దాడి చేశాడు. అతను వెనక నుంచి దాడి చేయడం వల్ల దెబ్బ కేజ్రీవాల్ మెడపై బలంగా తాకింది. 2014 ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో రోడ్ షో సందర్భంగా ఒక వ్యక్తి వెనక నుంచి దాడి చేశాడు. దెబ్బ వీపుపై బలంగా పడింది. 2014 ఏప్రిల్ 8వ తేదీన ఢిల్లీ సుల్తాన్ పురి ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ హఠాత్తుగా ముందుకు వచ్చి ఆయనపై చెంపదెబ్బ కొట్టాడు. కేజ్రీవాల్ కన్ను వాచిపోయింది. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయనందుకు దాడి చేశాడట. ఇలా వాగ్దానాలు నిలబెట్టుకోలేనందుకు ఒక నాయకుడిపై దాడి జరగడం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఆ తర్వాతైనా జరిగిందా? ఈ కారణం ఒక సాకులా కనబడడం లేదా? 2014 ఎన్నికల సందర్భంగా ఆప్ నేతలపై వరుసగా దాడులు జరిగాయి.

ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు అప్పుడు ఆప్ పార్టీలోనే ఉన్నారు. వారిపై దాడులు జరిగాయి. అయితే ఎక్కువగా దాడులు కేజ్రీవాల్ పైనే జరిగాయి. 2014లో చాలా స్వల్పకాలంలో అనేక సార్లు దాడులకు గురయిన నాయకుడుగా కేజ్రీవాల్ రికార్డు స్థాపించినట్లే. దాడులు చేసిన వారు కొందరు బిజెపి కార్యకర్తలమని చెప్పుకున్నారు. కొందరు అన్నాహాజరే సమర్థకులమని చెప్పుకున్నారు. కొందరు ఆప్ పార్టీలో ఒకప్పుడు ఉన్నవాళ్ళమని చెప్పుకున్నారు. దాడులకు కారణం బిజెపియేనని ఆప్ అప్పట్లో కూడా వాదించింది. కాంగ్రెస్ అన్ని పార్టీలూ ఖండించాయి. అప్పట్లో కూడా బిజెపి ఈ దాడులను ఖండించలేదు. ఇప్పుడు మనోజ్ తివారీ చెప్పినట్లే అప్పట్లో ఢిల్లీ బిజెపి ఎలెక్షన్ ఇంచార్జ్ వి.కె. మల్హోత్రా కూడా ఇదంతా కేజ్రీవాల్ ఎన్నికల స్టంటే అన్నాడు.

2014 డిసెంబర్ 26వ తేదీన ఢిల్లీలో ఒక ర్యాలీలో కేజ్రీవాల్ పై కోడిగుడ్లు విసిరారు. 2016 జనవరి 17 వ తేదీన ఒక మహిళ కేజ్రీవాల్ పై ఇంక్ వేసింది. ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బేసి, సరి పద్ధతి జయప్రదంగా అమలు చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలపడానికి కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో భావనా అరోరా అనే మహిళ సిఎన్‌జి స్కాం జరిగిందని ఆరోపిస్తు ఇంకు విసిరింది. 2016 మార్చిలో పంజాబ్‌లోని హస్సనూర్ గ్రామం వద్ద కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. రాళ్ళతో జరిగిన ఈ దాడిలో కారు అద్దాలు పగిలాయి. పగిలిన గాజు పెంకులు కేజ్రీవాల్ పై పడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి గాయమూ కాలేదు. ఈ సంఘటన మార్చిలో జరిగితే అంతకుముందు ఫిబ్రవరిలో పంజాబ్‌లోనే లూథియానాలో కేజ్రీవాల్ కారుపై ఇనుపరాడ్లతోను, కర్రలతోను దాడి చేశారు. 2016లోనే ఏప్రిల్ నెలలో ఆమ్ ఆద్మీ సేనా కార్యకర్త ఒకడు కేజ్రీవాల్ పై బూటు విసిరాడు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వివరాలు ప్రకటిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

ఇతను కూడా సిఎన్‌జి స్టిక్కర్ల అవినీతి గురించే చెప్పాడు కాని ఆ అవినీతి ఏమిటో ఇంతవరకు నిరూపించబడలేదు. ఈ ఆమ్ ఆద్మీసేనా, ఈ దాడి చేసిన వ్యక్తి బిజెపి కుట్ర అని ఆప్ ఆరోపించింది. అప్పుడు కూడా బిజెపి నేతలు ఇదంతా నాటకమనే చెప్పారు. 2018లో కట్టుదిట్టమైన భద్రత ఉండే సెక్రటరియేట్ లోనే ఒక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ పై కారంపొడితో దాడి చేశాడు. కేజ్రీవాల్ కళ్ళలో కారం చల్లడానికి ప్రయత్నించాడు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ను షూట్ చేస్తానని కూడా బెదిరించాడు. విచిత్రమేమంటే, అప్పుడు కూడా బిజెపి నాయకుడు మనోజ్ తివారీ ఈ కారంపొడి దాడిని కేజ్రీవాల్ చేస్తున్న డ్రామా అన్నాడు. పోలీసులు అసలు దాడి జరగలేదని పొరబాటున కారంపొడి చేయిజారి కిందపడిందని చెప్పారు. సెక్రటరీయేట్ లోకి పొరబాటున అయినా సరే అసలు కారంపొడి తీసుకుని ఒక వ్యక్తి ఎలా రాగలిగాడు. పోలీసుల నిర్బంధంలో ఆ వ్యక్తి కేజ్రీవాల్ పై దాడి చేసినట్లు స్పష్టంగా చెప్పాక పోలీసులు ఒక వెకిలి నవ్వు నవ్వి ఊరుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఎంత గొప్పగా బిజెపి బాసులకు సేవ చేస్తున్నారో అప్పుడే దేశానికి స్పష్టంగా అర్థమయ్యింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఢిల్లీ నారెలా వద్ద కేజ్రీవాల్ కారుపై 100 మంది గుంపు కర్రలతో దాడి చేసింది. మూక దాడులు ఇప్పుడు ముఖ్యమంత్రిపై కూడా జరిగే కాలం వచ్చింది. ఔటర్ ఢిల్లీలోని కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ దాడి జరిగింది. అక్కడ స్థానిక లిక్కర్ మాఫియాతో ఢిల్లీ పోలీసులు కూడబలుక్కు ని దాడులు చేయించారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ పై మూక దాడి జరిగిందంటే ఢిల్లీ పోలీసులు ఎంత గొప్ప భద్రత కల్పించారో అర్థమవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ను ఎగతాళి చేయడం, హేళన చేయడం, కోడిగుడ్లతో, ఇంకుతో, చెప్పులతో దాడులు చేయించడం ద్వారా ఆయన ప్రతిష్ఠ ప్రజల్లో పెరిగిందే కాని తగ్గలేదు.

ఇప్పుడు కూడా ఈ దాడి తర్వాత ఆప్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఢంకా బజాయిస్తుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. మే 12న ఢిల్లీలో ఎన్నికలున్నాయి. జాతీయ స్థాయిలో ఎదగాలని భావిస్తున్న ఆప్‌కు ఇప్పుడు చక్కని అవకాశం దొరికింది. 2015 ఎన్నికలకు ముందు కూడా బిజెపి ఇలా గే కేజ్రీవాల్‌పై దాడులు ఆయనే చేయించుకున్నాడని మాట్లాడింది. ఆ ఎన్నికల్లో దారుణమైన పరాభవం ఎదురయ్యింది. ఢిల్లీలో అడుగడుగునా కేజ్రీవాల్‌కు అడ్డంకులు ఇబ్బందులు పెడుతు న్న చెడ్డపేరు ఇప్పటికే బిజెపికి ఉంది. ఇప్పుడీ దాడుల తర్వాత ఖండించకపోగా, ఆయనే దాడులు చేయించుకున్నాడని వ్యాఖ్యానించడం ద్వారా బిజెపి ప్రజలకు మరింత దూరమవుతోంది.

Physical Attacks on Arvind Kejriwal