Home వికారాబాద్ టిఆర్‌ఎస్ నుంచి పైలెట్ రోహిత్‌రెడ్డి సస్పెండ్

టిఆర్‌ఎస్ నుంచి పైలెట్ రోహిత్‌రెడ్డి సస్పెండ్

suspend

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా  : తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పైలెట్ రోహిత్‌రెడ్డిని పార్టీలోంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర విద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాండూరుకు చెందిన ఉద్యమకారుడు అయూబ్‌ఖాన్ ఆత్మహత్యా యత్నం చేసినప్పుడు టిఆర్‌ఎస్ పార్టీ పరంగా, రాష్ట్ర ప్రభుత్వపరంగా సహకారం అందిస్తే పైలెట్ రోహిత్‌రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీ నాయకుడిగా ఉండి ప్రతిపక్ష పార్టీలతో కలిసి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు చెప్పారు. దీంతో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు ఆయన వివరించారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా మంత్రి మహేందర్‌రెడ్డి ఉండగా, రోహిత్‌రెడ్డి  మంత్రికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరులో రోహిత్‌రెడ్డి చేపట్టే కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. సిఎం కెసిఆర్ పలు రకాల రిపోర్టులు తెప్పించుకున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రోహిత్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోహిత్‌రెడ్డి పార్టీ క్రియాశీల సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఎంతటి నాయకులైనా పార్టీ నుంచి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో మెలిగి ఇతర పార్టీల నాయకులకు ఆదర్శంగా నిలువాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.