Home జాతీయ వార్తలు కేరళలో ఓ పైలెట్ సాహసం..!

కేరళలో ఓ పైలెట్ సాహసం..!

Pilot who executed rooftop landing during Kerala flood rescue

కొచ్చిన్/ముంబయి: వీర జవాన్లు… సరిహద్దులలో శత్రువులను నిలువరించే శక్తివంతులు. ఇప్పుడు కేరళలో వరద శత్రువు తాకిడిని తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో వారు కాలానికి, నిమిషానికి, సెకన్లకు తెగించి, ప్రాణాలను లెక్కచేయకుండా ముందుకు దూసుకువెళ్లుతున్నారు. త్రివిధ బలగాల సైన్యం ఇప్పుడు ప్రదర్శిస్తోన్న సాహసం వేనొళ్ల శభాష్‌లను అందుకొంటోంది. వరదల తీవ్రస్థాయిలో హెలికాప్టర్ నుంచి ఓ భవంతిపైకి తాడుతో ఓ యువ సైనికాధికారి దిగి ఓ చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించి తల్లికి అందించారు. మరో చోట పొంగిపొర్లుతున్న నదికి ఆ వైపున ఉన్న పసికందును తల్లిని ఓ జవాను తన ప్రాణాలు లెక్కచేయకుండా తాడుతో ఎగబాకుతూ వెళ్లి రక్షించి ఇరువురిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఇప్పుడు సాహసగాధల నడుమ ఇప్పుడు ఓ పైలెట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి సెకన్ల వ్యవధిలో ముంచుకొచ్చే ముప్పును చాకచక్యంగా గమనించి 26 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అందరి ఊపిరిబిగబట్టేలా చేసిన ఈ విన్యాసం ఇప్పుడు వివిధ ప్రసార సాధనాలలో ప్రచారం పొందింది.

ఆ ఘటన క్రమం ఇదే…
కేవలం మూడే సెకండ్లు మిగిలి ఉంది. ఈ సమయం దాటితే హెలికాప్టర్ ముక్కలు చెక్కలు అయ్యేది. అత్యంత నాటకీయంగా నౌకాదళ హెలికాప్టర్ సీకింగ్ 42బి ఛలకుడీ టౌన్‌లో ఒక భవనంపై కేవలం టైర్లమీదనే నిలిచింది. హెలికాప్టర్ బరువు ఈ భవనంపై పడకుండా అక్కడ చిక్కుపడ్డ ప్రజలను హెలికాప్టర్‌లో తరలించేందు కు పైలెట్ ఆద్యంతం జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. ఈ అత్యంత సాహసిక పైలెట్ లెఫ్టినెంట్ కమాండర్ అభిజిత్ గరుడ్ తన అనుభవం గురించి తెలియచేసుకున్నారు. కేవలం ఎనిమిది నిమిషాల పాటు భవనంపై భాగంలో హెలికాప్టర్ ఉండటం ఇంకో రెండు మూడు సెకండ్లు ఎక్కువగా ఉంటే ముక్కలు అయ్యే స్థితిలో తిరిగి గాల్లోకి ప్రయాణించింది. ఈ హెలికాప్టర్ భవంతిపై భారం మోపితే అది కుప్పకూలి పొయ్యేది. ఎక్కువసేపు టైర్లు భవంతిపై గాల్లో తేలినట్లుగా హెలికాప్టర్‌ను ఉంచారు. ఈ విధంగా అది ఎక్కడికి కదలకుండా ఉండటం కేవలం పది నిమిషాల కంటే ఎక్కువ సాధ్యం కాదు.

అంతకు మించి ఉంచితే హెలికాప్టర్‌లో ఒత్తిడి పెరిగి అది ముక్కలు అవుతుంది. అయితే హెలికాప్టర్‌ను నిర్ణీత స్థాయిలో భవనంపై కప్పుపై తేలాడుతున్నట్లుగా నిలిపి, నిమిషాల వ్యవధిలో అక్కడ చిక్కుపడ్డ వారిని లోపలికి చేర్చుకుని తిరిగి హెలికాప్టర్ సురక్షిత ప్రాంతానికి వెళ్లింది. ఇది అత్యంత కష్టమైన సాహసం. యుద్ధాలలో కూడా దీనిని చేయడం అసాధ్యం. అయితే పలువురు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సమయోచితంగా ఈ పని చేయాల్సి వచ్చిందని 33 ఏండ్ల పైలెట్ అభిజిత్ తెలిపారు. వైమానిక గణాంకాలను జాగ్రత్తగా పరిశీలించుకుని తగు విధంగా ఎంచుకున్న ఒక సమీకరణం అని తేల్చిచెప్పారు. ఈ హెలికాప్ట ర్ ద్వారా ప్రాణాలు రక్షించుకున్న వారిలో 80 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారు. ఆయనను ఆయన లగేజీతో పాటుకొచ్చిలోని ఐఎన్‌ఎస్ గరుడ నౌకా వైమానిక స్థావ రం వద్దకు చేర్చారు. హెలికాప్టర్ సిబ్బంది అంతా కలిసికట్టుగా సమయస్ఫూర్తితో చేపట్టిన ఈ సాహసం చివరికి లక్షలాది మంది నుంచి అభినందనలు అందుకుంది. ఈ ఆపరేషన్‌లో లెఫ్టినెంట్ కమాండర్ రజనీష్ (కో పైలెట్), లెఫ్టినెంట్ సత్యర్థ్ (నావిగేటర్), అజిత్ (వించ్ ఆపరేట ర్), రాజన్ (ఫ్రీ డ్రైవర్) పాల్గొన్నారని పైలెట్ తెలిపారు.