Thursday, April 25, 2024

పినపాకలో పొలిటికల్ హీట్

- Advertisement -
- Advertisement -

రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
కోవర్టులపై కాంతారావు ఉక్కుపాదం, పర్యటనలతో జోరు పెంచిన పాయం
రేగా వర్సెస్ పాయం పోరుపై సర్వత్రా ఉత్కంఠ

Pinapaka political history

పినపాకలో అప్పుడే పొలిటికల్ హీట్ రాజుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే రేగా చేసిన కామెంట్ రాజకీయ వర్గాలను కుదిపేసింది. మనకు మాజీ ఎమ్మెల్యేతోనే పోటీ.. సందేహం లేదు. హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు చక్కెర్లు కొట్టింది. రేగా వ్యాఖ్యలు… మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ మార్పును ఉద్దేశించినవే అనే గుసగుస వినిపిస్తోంది. పాయం పార్టీ మార్పు ఇప్పటికే ఖాయమైపోయిందనే రూమర్ జోరుగా వ్యాపించింది. ఇంతకీ.. రేగా, పాయం ఇద్దరూ ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉండడం కొసమెరుపు!

 

మన తెలంగాణ/మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పినపాక నియోజకవర్గం ఎనలేని అభివృద్ధి చెందింది. గత రెండు పర్యాయాలుగా టీఆర్‌ఎస్ పార్టీనే ఇక్కడ అధికారంలో ఉండడం.. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో సంక్షేమంలో దూసుకెళుతోంది. బీటీపీఎస్, సీతారామ, సీతమ్మ సాగర్ వంటి బహుళార్థసాధక ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మరెన్నో ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకున్నాయి. పినపాక రూపురేకలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలకు సుమారుగా రెండేళ్ల సమయం ఉంది. తెలంగాణలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పుడా హీట్ పినపాక నియోజకవర్గాన్ని తాకింది. మొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా ఊపందుకుంది. ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యేతోనే మన పోటీ.. అంటూ ఆయన చేసిన కామెంట్ విస్తృతంగా వ్యాపించింది. టీఆర్‌ఎస్ నేత పాయం వెంకటేశ్వర్లును ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కోవర్టులపై ఉక్కుపాదం

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రాజకీయ సమీకరణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కోవర్డులను ఏరివేయడం ప్రారంభించారు. రేగా వర్గంలో ఉంటూ ప్రత్యేర్థి వర్గానికి ఉప్పందిస్తున్నారనే సందేహంతో ఇప్పటికే కొందరిని పక్కన పెట్టేశారు. పార్టీ పదవుల నుంచి సైతం తొలగించారు. తనకు అన్నివిధాలుగా అనుకూలంగా ఉండే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రేగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో యువతకు పెద్దపీట వేశారు. పార్టీ మండల అధ్యక్షుల నుంచి మొదలు కొని గ్రామ స్థాయి వరకూ కీలక బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియా విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. క్షణాల్లోని అందరికీ సమాచారం అందేలా తనదైన శైలిలో టీం వర్క్ చేస్తూ వచ్చే ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారు. అయితే.. రేగా వర్గంలోనే ఉంటూ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వ్యవహార శైలి పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. అశ్వాపురం మండలంలో దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టమేననే సంకేతం వినిపిస్తోంది.

జోరు పెంచిన పాయం

టీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటనలతో జోరు పెంచారు. స్వతహాగా సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న పాయం ప్రజలతో మమేకం అవుతున్నారు. కేసీఆర్ సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూనే తనదైన శైలిలో ప్రతిఒక్కరితో కలిసిపోతున్నారు. సమస్యలు తెలుసుకుంటూ.. అండగా ఉంటానంటూ భరోసానిస్తున్నారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకుంటూ ముందుకెలుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కాలంలో ఆయన చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. పాయం సుడిగాలి పర్యటనలతో ఆయన వర్గీయుల్లో జోష్ పెరిగింది. గతంలో ఎక్కడు పొరపాటు జరిగిందో తెలుసుకుంటూ.. వాటిని సరిదిద్దుకుంటా ముందుకు సాగుతున్నారు. యువతను ఆకట్టుకునే విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన పర్యటనలు మొదలుకొని.. కేసీఆర్ సంక్షేమం వరకూ అన్నింటినీ ఎప్పటికప్పుడు యువతకు చేరవేస్తూ అందరికీ మ రింత దగ్గరవుతున్నా రు.

పాయం పయనమెటో

పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్నారు. నియోజకవర్గంలో ఒకప్పుడు నిస్తేజంగా ఉన్న పార్టీ పాయం చేరికతో బలంగా మారింది. తెలంగాణ వాదులందరికీ ఓ ఊపు వచ్చింది. ఆయన హయాంలోనే బీటీపీఎస్ పురుడు పోసుకుంది. సీతారామ ప్రాజెక్టుకు అంకురార్పణం పడింది. ఇటువంటి అభివృద్ధి పథకాలెన్నో ఆయన హయాంలోనే ఇక్కడికి వచ్చాయి. ఆ విషయాలను ఆయన హైలెట్ చేసుకుంటూ వెళుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పార్టీ అధిష్టానానికి విధేయుడిగా ఉంటున్నారు. కేసీఆర్, కేటీఆర్‌లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే… 2023లో టీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ టికెట్ పాయం వెంకటేశ్వర్లుకే కేటాయిస్తున్నారని పాయం వర్గీయులు బలంగా వినిపిస్తున్నారు. ఈతరుణంలో.. ఖమ్మానికి చెందిన ఓ మాజీ ఎంపీతో కలిసి పాయం పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలేం జరగబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఆ ఇద్దరి మధ్యే అసలు వార్

రేగా కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు ఇద్దరూ బలమైన నేతలే. ఇధ్దరూ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. ఇద్దరికీ తమదైన స్థాయిలో పార్టీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. ఎవరికి వారే టీఆర్‌ఎస్ సీటు తమకే దక్కుతుందని చెబుతున్నారు. అధినేత ఇప్పటికే తమకు హామీ ఇచ్చేశారని అంటున్నారు. అయితే.. రేగా కాంతారావు మాటలు కాస్త పదును పెట్టారు. పాయం మాత్రం తనదైన శైలిలో ప్రజలతో కలిసి ముందుకెళుతున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా వీరిద్దరి మధ్యే కీలక పోరు ఉండబోతోంది. ఇంతకీ 2023లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు? విజయం ఎవరిని వరించబోతోందో.. వేచి చూడాల్సిందే!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News