Home ఖమ్మం పైసా కొట్టు పాస్‌బుక్ పట్టు

పైసా కొట్టు పాస్‌బుక్ పట్టు

Pissa knock Passbook hold

రెవెన్యూలో భూ ఆమ్యామ్యాల రాబందులు
కీలకం ఆనలుగురే… కౌంటర్లు తెరిచారు
మాకింత మీకింత చెరువులకు చెక్కులు… సర్పంచ్‌కే దిక్కు లేదు 

మామూళ్లు లేనిదే భూ రికార్డు మారదు

మన తెలంగాణ/పెనుబల్లి: రైతుబంధు పథకం అప్రతిష్ట పాలుకాకుండా అమలు జరిగితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని ఆశించిన ప్రభుత్వం కొందరు రెవెన్యూ ఉద్యోగుల వలన అప్రతిష్ట మూటకట్టుకుంది అని స్వయంగా అధికారపార్టీ నాయకులే చర్చించుకోవటం విశేషం. సిఎం కెసిఆర్‌కి అత్యంత సన్నిహితుడు క్యాబినెట్‌లో కీలకం రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సాక్షాత్తూ నేలకొండపల్లిలో జరిగిన రైతుబంధు సభలో రెవెన్యూ కార్యాలయానికి వెళితే రైతుల బతుకు హీనం అని, నేనూ అనుభవించా అని, ఆవేదన చెందారు. అంటే రెవెన్యూలో అవినీతి రాబందులు ఏ స్థాయిలో ఉన్నారో ఏ రైతును అడిగినా చెబుతారు. మంత్రి వాఖ్యలపైన ఉద్యోగుల్లో అసహనం వచ్చినా రైతుల్లో మాత్రం మంత్రి తుమ్మల వాఖ్యల పట్ల మద్దతు పెరిగింది. ఇక పెనుబల్లి మండలంలో విఆర్‌ఓ రమణయ్య ఆడిందే ఆట అడింగిందే రేటు, ఎరానికి పదివేలు ఈ విఆర్‌ఓకి ఏజెన్సీలోని ముఖ్యమైన గౌరవరం, లింగగూడెం, భవన్నపాలెం, యడ్లబంజర రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీ గ్రామాలు కావటంతో సీలింగ్, ఎల్‌టిఆర్, పంచరాయి, ప్రభుత్వ భూములను గతంలో రెతులకు పంపిణీ చేశారు. సదరు విఆర్‌ఓ కొర్రీలు పెట్టి ఎకరానికి పదివేల నుండి 15 వేల వరకు డిమాండ్ చేశాడని రైతులు వాపోతున్నారు. మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడు మండలంలో రెండో ప్రజాప్రతినిధి నిజాయితీపరుడైన ఓ నాయకుడు తమ భూమి పాస్‌బుక్ కోసం వేలాది రూపాయలు విఆర్‌ఓకి సమర్పించాడంటే సాధారణ విషయం కాదు. ఏజెన్సీలోని ఓ గిరిజన సర్పంచ్ తన భూమికి పాస్‌బుక్ అడిగితే మూడు ఎకరాల 37 గుంటల భూమికి రూ.40 వేలు డిమాండ్ చేస్తే కాదు అన్నందుకు సర్పంచ్‌కి రైతుబంధు చెక్కు రాలేదు సరికదా పాస్‌బుక్ సైతం రాకపోవటంతో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సర్పంచ్‌ని ఆహ్వానిస్తే ఆయన తిరస్కరించటంతో రెవెన్యూ అధికారులు బిత్తర పోయారు. ఆ గిరిజన సర్పంచ్‌కి ఐదు దశాబ్దాలు రెవెన్యూ రికార్డుల్లో భూమి అతని పేరు వస్తున్నా పాస్‌బుక్, రైతుబంధు చెక్కు రాలేదంటే ఆ విఆర్‌ఓకి ఎంత పలుకుడి ఉందో అర్థం అవుతుంది. లింగగూడెంలో, యడ్లబంజరలో తన మనుషుల చేత కౌంటర్లు (వసూళ్లు) కేంద్రాలు తెరవగా తహసీల్దారుకు ఫిర్యాదు వెళ్లగా మందలించారని సమాచారం. కాలక్రమేణా తహసీల్దారు సైతం ఆ విఆర్‌ఓ వలలో పడినట్లు రెవెన్యూ కార్యాలయంలో ప్రచారం జరుగుతుంది. రెవెన్యూ కార్యాలయంలో ఆ నలుగురు విఆర్‌ఓ, ఓ ఆర్‌ఐ, ఓ ఇద్దరు క్లర్కులు కలసి కుమ్మక్కైయ్యారని తోటి ఉద్యోగులు గుసగుస లాడుకోవటం విశేషం. లింగగూడెంలో గతంలో ఇరిగేషన్ శాఖ ద్వారా పనులు జరిగిన ఐదు చెరువులకు రైతుల పేరున చెక్కులు, పాస్‌బుక్‌లు మంజూరు చేశారని చెక్కుల పంపిణి కార్యక్రమంలో కొందరు రైతులు నిరసన తెలపటంతో చెక్కుల పంపిణీ నిలుపుదల చేశారని రైతులు తెలిపారు. ఓకే ఇంట్లో ముగ్గురు సోదరులకు భూమి ఉంటే అందరికి ఎల్‌టిఆర్ నోటీసులు వస్తే లంచం ఇచ్చిన ఓ సోదరుడికి పాస్‌బుక్, రైతుబంధు చెక్కు ఇచ్చి మిగిలిన ఇద్దరు సోదరులు మామూళ్లు ఇవ్వలేదని వారిపేరున అన్ని నిలుపుదల చేశారని దళిత సంఘాలు ఆరోపించారు. రెవెన్యూలో అవినీతి రాబందుల వలన ఎక్కువగా గిరిజన, దళిత, చిన్నకారు, సన్నకారు రైతులు అవినీతి విఆర్‌ఓ అడిగింది ఇచ్చుకోలేక అర్హత పొందలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేసినా ఆ పురిటి వాసన నేటికీ రెవెన్యూ ఉద్యోగుల్లో కొందరు అవినీతి విఆర్‌ఓలు, సిబ్బంది వలన ప్రభుత్వానికి అప్రతిష్ట కలుగుతుందని అధికార పార్టీ నాయకులే కాకుండా అన్ని రాజకీయ పక్షాలు సైతం ఓకే అభిప్రాయంతో ఉన్నారనేది అక్షర సత్యం. మొత్తం మీద భూ ప్రక్షాళనలో కోట్ల రూపాయలు చేతులు మారాయని రైతులు ఆరోపిస్తున్నారు.