Home తాజా వార్తలు సిద్దిపేట పుర నమూనా

సిద్దిపేట పుర నమూనా

Planned development our focus, says KTR

 

ప్రతి పట్టణానికి అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవాలి
42 అంశాలతో నమూనా పట్టిక
ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్, 50% మహిళలకే
త్వరలో మున్సిపాలిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ
మున్సిపాలిటీలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
ఆడిట్లతో గుణాత్మక మార్పు: మంత్రి హరీశ్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలు ప్రణాళికబద్దమైన అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలు సొంతంగా ఆదాయవనరులు పెంచుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనిని నమూనాగా తీసుకుని ఇతర మున్సిపాలిటీలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. త్వరలో మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే త్వరలో నియామకాల ప్రక్రియను చేపడతామన్నారు.

హైదరాబాద్‌లోని ఎంసిహెచ్‌ఆర్‌డిలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావుతో కలిసి మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున రానున్న మూడున్నరేళ్లలో ప్రశాంతంగా ప్రణాళికాబద్దంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 42 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఓ అభివృద్ధి నమూనా పట్టిక తయారు చేశామన్నారు. అందులో ఆదర్శ మున్సిపాలిటీగా మారాలంటే ఉండాల్సిన అభివృద్ధి, అవసరమైన పనులు, హంగులు ఉన్నాయన్నారు. వీటిని మున్సిపల్ కమీషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లకు త్వరలోనే అందజేస్తామన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీకి డంప్ యార్డు ఉందా? ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అనుమతులు ఇస్తున్నామా? ప్రజలకు తాగు నీరు ఎలా అందుతుంది… వంటి అనేక అంశాలు ఈ 42 అంశాలున్న జాబితాలో ఉంటాయని మంత్రి వివరించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిధులను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఠంఛనుగా ఇస్తోందన్నారు. రిసోర్సెస్ ఆడిట్, పవర్ ఆడిట్, శానిటైజ్ ఆడిట్, వాటర్ ఆడిట్‌లను అన్ని మున్సిపాలిటీలు విధంగా చేపట్టాలన్నారు. ఈ రిసోర్సెస్ ఆడిట్‌లో భాగంగా మున్సిపాల్టీ ఆదాయ, వ్యయాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ పొదుపును పాటిస్తూనే అవసరమైన చోట ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. పని చేయని విద్యుత్ బోర్ల కనక్షన్లు తీసివేయించాలన్నారు. శానిటైజేషన్ ఆడిట్‌లో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ, డంప్ యార్డుల నిర్మాణం, నిర్వహణపైన దృష్టి సారించాలన్నారు. ప్రజల్లో తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసేలా మరింతగా చైతన్య పరచాలన్నారు. శానిటరీ సిబ్బంది పేర్లును ఆయా వార్డుల్లో ప్రదర్శించడం..వారి ఫోన్ నంబర్లు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రోజు వారిగా చెత్త సేకరిస్తున్నారా? లేదా? అనే అంశంపై నిఘా పెట్టాలని సూచించారు.

శానిటరీ సిబ్బందికి ప్రతి నెల మొదటి వారంలోనే రూ. 12 వేల జీతం ఇవ్వాల్సిందేనన్నారు. వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్క్‌లు మున్సిపాలిటీలు అందించాలన్నారు. ఆగష్టు 15వ తేదీలోగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయి మందికి ఒక టాయిలెట్ ఉండేలా లక్ష్యంతో పని చేయాలన్నారు. ఇందులో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలన్నారు. ఇందుకోసం 400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం పట్టణాల్లో షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. బయోలాజికల్, బయో మెడికల్ వ్యర్ధాలు, కనస్ట్రక్షన్, డెమాలిష్ వెస్టేజ్ నిర్వహణ కూడా చేపట్టాలన్నారు. అలాగే మాంసం, కోళ్లు, చేపల అమ్మకం దార్లతో సమావేశం పెట్టి వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కనస్ట్రక్షన్, డిమాలిష్ వ్యర్ధాలతో జ్ తో టైల్స్ తయారు చేయవచ్చునని అన్నారు.

ఇలాంటి ప్రాజెక్టును ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ఇక కుక్కల బారినుండి ప్రజలను కాపాడేందుకు యానిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ ఆడిట్‌లో మున్సిపాలిటీల్లో ఎంత నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నాం.. ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా లేదా అని అంచనాలు తయారు చేయాలన్నారు. సింగపూర్ లాంటి దేశాల్లో 100 లీటర్ల నీటికి 90 లీటర్ల బిల్లులు వస్తాయన్నారు. పది శాతం నీరు సరఫరాలో లాస్ అవుతోందన్నారు. కానీ మనదగ్గర 100 లీటర్ల నీటికి 60 లీటర్లకు కూడా బిల్లులు రావడం లేదన్నారు. తెల్ల రేషన్ కార్డు వారికి ఒక రూపాయి, మిగతా వారికి 100 రూపాయలకు ఇవ్వాలన్నారు. అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ,ఉమ్మడి మెదక్ జిల్లాలో రిసోర్స్, పవర్, శానిటైజ్, వాటర్ ఆడిట్ నిర్వహించి గుణాత్మక మార్పుకు నాంది పలుకుతామన్నారు.

ప్రతి వెయ్యిమందికి ఒక టాయిలెట్ ఆగష్టు15 కల్లా ఉండేలా పని చేస్తామన్నారు. డెబ్రిస్ మెనేజ్ మెంట్ ప్రాజెక్టు, యానిమల్ కేర్ సెంటర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మూడు జిల్లాలో జిల్లాకు రెండు చొప్పున మొబైల్ బస్ షీ టాయిలెట్లు ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆదాయ వనరులు పెంచుకుని మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంగారెడ్డి, సదాశివపేట వంటి మున్సిపాలిటీల్లో నల్లాల ద్వారా నీరు ఇచ్చే ప్రాజెక్టులు త్వరితగతన పూర్తి చేసి ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. ఈ సమీక్షలో ఎంబి బిబి పాటిల్, శాసనసభ్యులు క్రాంతికిరణ్, గూడెం మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రామలింగారెడ్డి, వొడిదల సతీష్, పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎంఎల్‌సిలు ఫరీదుద్దీన్, భూపాల్ రెడ్డి, కలెక్టర్లు హనుమంతరావు, వెంకట్రామిరెడ్డి, ధర్మారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మను తదితరులు హాజరయ్యారు.

Planned development our focus, says KTR