Home తాజా వార్తలు ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు

ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు

 Grain

 

మంచిర్యాల : ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంట కొనుగోళ్లలో జాప్యం జరకుండా ఉండేందుకుగాను అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వంద కేంద్రాలలో ధాన్యం కొనుగోలుతో పాటు మరో ఆరు జిన్నింగ్ మిల్లులతో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్‌ను గాను 1.40 లక్షల ఎకరాలలో పత్తి, 1.46 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. సీజన్‌ప్రారంభంలో వర్షాలు ఆలస్యంగా కురువడంతో పంటదిగుబడుల్లో జాప్యం జరుగుతోంది. ఖరీఫ్‌లో కొద్దిపాటి వర్షాలకే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేయగా వర్షాలు ఆలస్యంగా కురిసాయి, అనంతరం కొద్ది రోజుల పాటు వర్షాలు కురియకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తలేదు.

దాదాపు 20 రోజుల అనంతరం ఏకదాటిగా కురిసిన వర్షాలు పంటలకు ప్రాణాలు పోశాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు వేసిన విత్తనాలు నాటుకోకపోవడంతో వర్షాలు సమృద్దిగా కురువడంతో మళ్లీ విత్తనాలు నాటడంతో పంటల దిగుడులు ఆలస్యంగా చేతికొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంవత్సరం అధికారులు కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను తగ్గించారు. గత ఏడాది 145 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈ సంవత్సరం 100 కేంద్రాలకే పరిమితం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో 1.65 లక్షల టన్నుల వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం లక్ష్యం 95వేల టన్నులు మాత్రమే కాగా ఈసారి రైతులు వరి, పత్తి పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచారు.

జిల్లాలో ఎక్కువ శాతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తక్కువగా ధాన్యం వస్తుండడంతో ఈసారి కొనుగోలు కేంద్రాలను కుదించి కొన్ని చోట్ల మాత్రమే పెద్ద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి జిల్లాలో పంట కొనుగోలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్‌ను వివరణ కోరగా జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు గాను వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. అంతే కాకుండా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల అవసరం మేరకు గన్నీ బ్యాగులు తెప్పిస్తున్నామన్నారు.

Plans for Grain Purchase