Home తాజా వార్తలు మూసీ సుందరీకరణకు అభివృద్ధి ప్రణాళికలు

మూసీ సుందరీకరణకు అభివృద్ధి ప్రణాళికలు

Plans to build check dams and bridges over the musi river

 

14 వంతెనలు… 18 చెక్ డ్యాంల నిర్మాణానికి చర్యలు
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న అధికారులు
త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

హైదరాబాద్: మూసీ నదిపై చెక్ డ్యాంలు, వంతెనలు నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కొత్తగా వంతెనలతో పాటు చెక్ డ్యాంలు నిర్మించాలని మంత్రి కెటిఆర్ సూచించిన నేపథ్యంలో అధికారులను ఆదిశగా సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా ఎన్ని చోట్ల చెక్ డ్యాంల నిర్మాణానికి అవకాశం ఉంది, ఏ నమూనాలో నిర్మించాలన్న దానిపై హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌డిసిఎల్), ఇరిగేషన్ విభాగాలు సంయుక్తంగా పరిశీలించనున్నట్టుగా తెలిసింది. అయితే వంతెనలను హెచ్‌ఎండిఏ నిర్మిస్తుండగా చెక్‌డ్యాంలను మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే చెక్ డ్యాంలను మూడు కిలోమీటర్‌లకు ఒకటి చొప్పున మొత్తం 55 నుంచి 60 కిలోమీటర్ల మేర మొత్తం 18 చెక్‌డ్యాంల నిర్మాణంతో పాటు 14 వంతెనలను నిర్మించి ఎక్కడికక్కడ స్వచ్ఛమైన నీటిని నిల్వ చేయాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది.

సుందరీకరణకు ఎంతమొత్తంలో ఖర్చు…
వంతెనలను కూడా మూసీ రివర్ నిర్మించాలని భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి తమ సంస్థకే ఆ బాధ్యతలను అప్పగించాలని ఎల్‌బినగర్, ఎమ్మెల్యే మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు మూసీ సుందరీకరణ నిమిత్తం డిపిఆర్, మూసీ మాస్టర్ ప్లాన్‌కు సిద్ధమవుతున్నాయని, ఇది పూర్తి స్థాయిలో రెడీ కావడానికి 6 నెలల నుంచి 8 నెలల సమయం పడుతుందని మూసీ రివర్ డెవలప్‌మెంట్ అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభిస్తే మూసీ సుందరీకరణకు ఎంతమొత్తంలో ఖర్చు అవుతుందన్న విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

14 వంతెనలు.. ఒక లింక్ రోడ్డు…
గండిపేట నుంచి గౌరెల్లి, హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది ఉంది. దీనికి హద్దులు గుర్తించి బఫర్ జోన్ నిర్ధారణకు సర్వే నిర్వహించారు. మూసీపై ప్రస్తుతం ఉన్న 24 వంతెనలు, 10 కాజ్‌వేల ద్వారా నిత్యం 36 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 2031 సంవత్సరానికి ఈ సంఖ్య 60 లక్షలకు పెరుగుతుందని సమగ్ర రవాణా అధ్యయనం (సిటిఎస్‌లో)లో అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మూసీ, ఈసా నదులపై అదనంగా మరో 14 వంతెనలు అవసరమని ప్రతిపాదించారు. మూసీకి దక్షిణ, ఉత్తర భాగాల నుంచి రాకపోకల నేపథ్యంలో మున్ముందు అవసరాల కోసం ఈ వంతెనలు అవసరమని పేర్కొన్నారు. వంతెనలతోపాటు ఒక లింక్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. వీటికి రూ.392.70 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ముసారాంబాగ్, చాదర్‌ఘాట్, ఇబ్రహీంబాగ్, నార్సింగి, చింతల్‌మెంట్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అయితే మంత్రి కెటిఆర్ సూచనతో తాత్కాలికంగా వంతెనల నిర్మాణాన్ని పక్కన పెట్టి, చెక్ డ్యాంల నిర్మాణ సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గండిపేట నుంచి నీటిని విడుదల చేసిన పక్షంలో దిగువకు ప్రవాహం సాఫీగా సాగేలా చెక్ డ్యాంల వద్ద గేట్లు ఉండాలే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

వంతెనలు ప్రతిపాదించిన ప్రాంతాల్లో చెక్‌డ్యాంల ఏర్పాటు
సిటిఎస్ నివేదిక ప్రకారం వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం మంత్రి కెటిఆర్ సూచనల మేరకు వంతెనలు ప్రతిపాదించిన ప్రాంతాల్లో చెక్‌డ్యాంల ఏర్పాటుకు అవకాశముందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలించనున్నారు. చెక్ డ్యాంలు నిర్మించాల్సి వస్తే బ్రిడ్జి ఎంత ఎత్తులో ఉండాలి, ఎగువ నుంచి వచ్చే వరద నీరు వెళ్లేందుకు వీలుగా గేట్లు ఏర్పాటు చేయాలా, అక్కడ నదిలో వాలును బట్టి గేట్లు ఎంత ఎత్తున ఉండాలి అన్నది నీటి పారుదల శాఖ నిర్ణయించాల్సి ఉంటుంది.

శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీలోకి….
నగరంలో ప్రస్తుతం వెలువడుతోన్న మురుగులో 700 మిలియన్ లీటర్లు మాత్రమే ఎస్‌టిపిల ద్వారా శుద్ధి అవుతోంది. మరో 800 ఎంఎల్‌డీ వరకు నేరుగా మూసీలో చేరుతోంది. మున్ముందు శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది. దీనికోసం మూసీకి ఇరువైపులా ఎస్‌టిపిలు నిర్మించే ఆలోచన ప్రభుత్వ విభాగాలకు ఉంది. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన నీరు మూసీలోకి రావడం మొదలైన అనంతరం అవసరాన్ని బట్టి గండిపేట నీటిని నదిలోకి వదలాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.

365 రోజులు మూసీ స్వచ్ఛమైన నీటితో కనిపించేలా తీర్చిదిద్దుతున్నాం
ఎల్‌బినగర్ ఎమ్మెల్యే మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
సీజన్‌తో సంబంధం లేకుండా 365 రోజులు మూసీ స్వచ్ఛమైన నీటితో కనిపించేలా తీర్చిదిద్దుతున్నాం. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే క్రమంలో బోటింగ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. మూసీ సుందరీకరణ నిమిత్తం డిపిఆర్, మూసీ మాస్టర్ ప్లాన్‌కు సిద్ధమవుతున్నాయి. ఇది పూర్తి స్థాయిలో రెడీ కావడానికి 6 నెలల నుంచి 8 నెలల సమయం పడుతుంది. 15 రోజుల క్రితం మంత్రి కెటిఆర్ దగ్గర సమావేశమయినప్పుడు వంతెనలు, చెక్‌డ్యాంల నిర్మాణాలకు సంబంధించి చర్చించాం.

Plans to build check dams and bridges over the musi river