Home జగిత్యాల ట్రెండ్ సెట్‌చేసిన ఎంపి సంతోష్‌కుమార్ గ్రీన్ ఛాలెంజ్

ట్రెండ్ సెట్‌చేసిన ఎంపి సంతోష్‌కుమార్ గ్రీన్ ఛాలెంజ్

Plants

 

నాచుపెల్లిలో ఎంఎల్‌ఏ ఆధ్వర్యంలో ఆరు వేల మొక్కలు నాటిన విద్యార్థులు
ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

జగిత్యాల : పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపెల్లి సంతోష్‌కుమార్ చేస్తున్న గ్రీన్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు.

ఎంపి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన చొప్పదండి ఎంఎల్‌ఏ సుంకె రవిశంకర్, జగిత్యాల జిల్లా ఎస్‌పి సింధూశర్మ శనివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారులో ఒకే రోజు విద్యార్థులతో కలిసి 6 వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ రవిశంకర్ మాట్లాడుతూ, అడవులు అంతరించిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదమేర్పడిందని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి ప్రతి యేటా కోట్లాది మొక్కలను నాటి సంరక్షించడం జరుగుతోందన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం అడవుల పరిరక్షణకు చర్యలు చేపట్టలేదని, మొక్కల పెంపకంపై అసలు దృష్టి సారించలేదన్నారు. దాంతో వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషికి తోడు రాజ్యసభ సభ్యులు సంతోష్‌రావు హరితవనాలను పెంచాలనే లక్షంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఎంపి జోగినిపెల్లి సంతోష్‌రావు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి నాచుపల్లిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థులు, అధికారులను భాగస్వాములను చేసి ఒకే రోజు ఆరు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు.

భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటడం వరకే పరిమితం కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఏ రవిశంకర్, ఎస్‌పి సింధూశర్మతో పాటు ఎంపిపి మెన్నేని స్వర్ణలత, జెడ్‌పిటిసి సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, సర్పంచ్ లత, డిఎస్‌పి వెంకటరమణ, సిఐ నాగేందర్‌గౌడ్, తహసీల్దార్ పద్మావతి, ఎంపిడిఓ రమేశ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు అనుమాండ్ల రఘు, రాజనర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Planted Plants for Future Generations