Home జాతీయ వార్తలు సర్వశోభితం.. అయోధ్య నగరం

సర్వశోభితం.. అయోధ్య నగరం

 

PM foundation stone with silver brick for in ayodhya

 

సర్వశోభితం.. అయోధ్య నగరం
నేడే రామ జన్మభూమి మందిరానికి భూమి పూజ
ప్రధాని చేతుల మీదుగా 40 కిలోల వెండి ఇటుకతో శంకుస్థాపన
విద్యుత్ దీప కాంతులతో సరయూ తీరం ధగధగ

అయోధ్య: శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణ భూమి పూజ కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ 40 కిలోల వెండి ఇటుకతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ శంకుస్థాపన కోసం ప్రత్యేకంగా 40 కిలోల వెండితో ఇటుకను తయారు చేయించారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వెండి ఇటుకను అక్కడి నుంచి తొలగిస్తారు.

వెండి నాణేల వితరణ
ఇలా ఉండగా శ్రీ రామ జన్మభూమి ఆలయ భూమిపూజను పురస్కరించుకుని కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి వెండి నాణేలను శ్రీ రామ జన్మభూమి ట్రస్టుకు పంపించారు. విశ్వ హిందూ పరిహద్(విహెచ్‌పి) పూర్వ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ పేరిట స్థాపించిన అశోక్ సింఘాల్ ఫౌండేషన్ తరఫున జయేంద్ర సరస్వతి ఈ వెండి నాణేలను పంపించారు. బుధవారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనే సాధువులకు ఈ వెండి నాణేలను అందచేయనున్నారు. అశోక్ సింఘాల్ సమీప బంధువు సలీల్ సింఘాల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సరయూ తీరంలో రంగవల్లులు

భూమి పూజ జరిగే సరయూనది ఒడ్డున గల పవిత్ర రామ్ కీ పైడీ ఘాట్ వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో, రంగ వల్లులతో అలంకరించారు. ఫైజాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, అనేక స్వచ్ఛంద సంస్థలకు చెందిన కార్యకర్తలు రామ్ కీ పైడీ ఘాట్‌ను రంగవల్లులతో నయనానందకరంగా తీర్చిదిత్తుతున్నారు. ఈ అలంకరణలో వాణి వికలాంగ్ సేవా సంస్థాన్ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ భూమిపూజను పురస్కరించుకుని బుధవారం నాడు ఘాట్ వద్ద దాదాపు లక్ష దీపాలను వెలిగించనున్నారు.

భారీగా లడ్డూల తయారీ
భూమి పూజ తర్వాత స్థానిక అతిథులకు పంపిణీ చేసేందుకు దాదాపు 1.11 లక్షల లడ్డూలను మణి రామ్ దాస్ ఛావనీ పీఠం తయారు చేస్తోంది. ఇవి గాక మరో లక్ష ప్యాకెట్ల బికనీరీ లడ్డూలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెప్పిస్తోంది. ఒక్కో ప్యాకెట్‌లో నాలుగు లడ్డూలు ఉంటాయి. భూమి పూజ మహోత్సవంలో పాల్గొనే అతిథులకు పంపిణీ చేయడంతోపాటు న్యూఢిల్లీలోని అన్ని దేశాల దౌత్య కార్యాలయాలకు ఈ లడ్డూలను పంపించనున్నారు. న్యూఢిల్లీ, లక్నోలోని ప్రముఖ మిఠాయి దుకాణాల నుంచి ఈ బికనీరీ లడ్డూలను తెప్పిస్తున్నారు. బికనీరీ లడ్డూలే కాక మోతీచూర్ లడ్డూలను కూడా ట్రస్టు తెప్పిస్తోంది.

PM foundation stone with silver brick for in ayodhya