Saturday, April 20, 2024

శతాబ్దాల నిరీక్షణకు తెర

- Advertisement -
- Advertisement -

 మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
 రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
 ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
 ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
 ఎందరో ఆత్మబలిదానాల ఫలితమే ఈ ఆలయం
 అయోధ్యలో రామమందిర నిర్మాణం భూమిపూజ అనంతరం ప్రధాని మోడీ ఉద్ఘాటన
 జై శ్రీరాం నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని
 ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల

అయోధ్య: దేశప్రజంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసున్న శుభ ఘడియ విచ్చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం అంకురారప్పణ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా భూమిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భూమిపూజ అనంతంరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరాం నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని ‘ ఈ నినాదం కేవలం భారత దేశంలోనే కాక ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ మహత్కార్యం సందర్భంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మందిర నిర్మాణానికి సంబంధించి భూమిపూజకు నన్ను ఆహ్వానించినందుకు రామజన్మభూమి క్షేత్ర ట్రస్టుకు ధన్యవాదాలా తెలియజేస్తున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. ‘నేడు ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మందిర నిర్మాణం దేశానికి ఒక ఉద్వేగ భరిత క్షణం. ఏళ్ల తరబడి కొనసాగిన నిరీక్షణ నేటితో ముగిసింది. ఇన్నేళ్లు ఒక గుడారం కింద నివసించిన రాంలల్లాకు ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించబోతున్నాం.

ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయం కోట్లాది మంది ప్రజల సమిష్టి తీర్మానం శక్తికి ప్రతీక. ఇది భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ నాడు దేశమంతా రామమయం అయింది. దేశస్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. అలాగే మందిర నిర్మాణం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు వారందరికి దేశప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని అన్నారు. ‘భారతీయ సంస్కృతికి రాముడు ప్రతీక. మందిర నిర్మాణంతో చరిత్ర సృష్టించడమే కాకుండా చరిత్ర పునరావృతమవుతుంది. నదిని దాటడానికి గుహుడు రాముడికి సాయం చేశాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణుడికి గోపబాలురు సాయం చేశారు. అలానే అందరి ప్రయత్నం, కృషితో మందిర నిర్మాణం పూర్తవుతుంది. మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతాయి. దేశ విదేశాలనుంచి భక్తులు ఇక్కడికి వస్తారు.

దాంతో ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మానవుడు రాముడిని విశ్వసించినప్పుడల్లా పురోగతి చెందిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ మార్గంనుంచి తప్పుకొన్నప్పుడల్లా .. విధ్వంసం తలుపులు తట్టింది. మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందరి మద్దతు, నమ్మకంతో ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షించాలి ’ అని ప్రధాని అన్నారు. ‘అయోధ్యలో నిర్మించబోయే మందిరం శ్రీరాముడి పేరులాగా భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతున్నాను. .ఈ మందిరం సమస్త మానవాళిని ప్రేరేపిస్తుందని నా నమ్మకం. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండొనేసియాతో పాటుగా ఇరాన్, చైనాలలో కూడా రాముడి ప్రస్తావన కనిపిస్తుంది. థాయిలాండ్, నేపాల్, శ్రీంకతో పాటు చాలా దేశాలకు రాముడితోను, రామాయణంతోను అనుబంధం ఉంది. రాముడి అందరి వాడు.. అందరిలోను రాముడున్నాడు’ అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని రామమందిర నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రామమందిర నిర్మాణానికి గుర్తుగా ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు.

అయిదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది: ఆదిత్యనాథ్
ఈ సందర్భంగా యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘ అయిదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది. రామమందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం మా అదృష్టం. ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరక్కుండా ప్రజాస్వామ్య బద్ధంగా శాతియతంగా కల సాకారమైంది. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకో బోతోంది. ఎందరో త్యాగాల ఫలితమిది’ అని అన్నారు.

30 ఏళ్ల నాటి సంకల్పం సాకారమైంది: భగవత్

అయోధ్యలో రామమందిరం కోసం ఎందరో బలిదానం చేశారని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. 30 ఏళ్ల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చేసినసంకల్పం నేడు సాకారం కావడం ఆనందంగా ఉందన్నారు. మందిరం కోసం బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వాని, విహెచ్‌పి అధ్యక్షుడు అశోక్ సింఘాల్, మహంత్ రామచంద్ర దాస్‌పరమహంసలాంటి ఎందరో చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఆలయం కోసం ఎందరో ఎంతో కష్టపడ్డారు. వారిలో కొంతమంది భౌతికంగా ఇప్పుడు లేరు. అద్వానీ లాంటి కొందరు నేతలు కొవిడ్ మహమ్మారిపరిస్థితుల కారణంగా రాలేకపోయారు. అయితే ఆయన తన ఇంట్లో కూర్చునే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారని భావిస్తున్నాను. ఇవ్వాళ్టినుంచి భారతీయులకు కొత్త ప్రేరణ విశ్వాసం లభిస్తుందని భావిస్తున్నా’ అని భగవత్ అన్నారు.

మానవాళి సంక్షేమం కోసమే మందిరం:

నృత్య గోపాల్‌దాస్అయోధ్యలో రామమందిర నిర్మాణం మ్రానవాళి సంక్షేమం కోసమేనని, ఇది ఒక దేశాన్ని ప్రపంచాన్ని నిర్మించడం లాంటిదని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్స్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ అన్నారు. వీలయినంత త్వరగా భవ్య మందిన నిర్మాణం జరగాలన్నది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష, కోరిక అని, దాన్ని మనం ఇప్పుడు మనం చూస్తున్నామని ఆయన అన్నారు. ఇది ఎంతో సంతోషదాయకమైన సమయమని అన్నారు. మందిర నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని చాలా మంది తరచూ ప్రశ్నించేవారని అంటూ అయితే ‘ ఓ వైపు మోడీ, మరో వైపు యోగి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు జరుగుతుంది’ అని అన్నారు. ఒక భవ్యమైన మందిరంలో శ్రీరాముడు ఆసీనుడు కావాలనేది కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష, కోరిక, దీనికోసం తమ మనస్సు, శరీరం, సంపదను ఇవ్వడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన అన్నారు.

రాజకీయ నేతలు, ప్రముఖుల స్పందన

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం జరిగిన భూమిపూజ ఈ దేశ సామాజిక సామరస్యానికి స్ఫూర్తి. చట్టప్రకారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు… రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్

రామ మందిర నిర్మాణం ఓ మతపరమైన కార్యక్రమంగా కాకుండా, కాలాతీత విలువలకు నిదర్శనంగా నిలుస్తుంది. అయోధ్యకు రాజుగా శ్రీరాముడు ఆచరించిన శ్రేష్ఠమైన, ఆదర్శవంతమైన జీవితం సామాన్యులు, ఉన్నతులనే తేడా లేకుండా అందరికీ అనుసరణీయమైంది… … ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

దేశం గర్వించదగిన చారిత్రక సందర్భం. రాముని జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఘనంగా నిర్వహించడం చరిత్రలో బంగారు అధ్యాయాన్ని లిఖిస్తుంది. రామాలయ నిర్మాణాన్ని చేపట్టడం
ప్రధాని మోడీ నిర్ణయాత్మక నాయకత్వానికి నిదర్శనం. సనాతన వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం త్యాగాలు చేసిన సాధువులందరికీ నమస్కరిస్తున్నా.. జై శ్రీరామ్… … హోంమంత్రి అమిత్‌షా

అత్యున్నత మానవ విలువలకు మర్యాద పురుషోత్తముడైన రాముడు నిదర్శనం. మన హృదయాంతరాలలో మానవీయతను దృఢంగా నాటిన ఆదర్శమూర్తి. రాముడంటే ప్రేమ. ఆయనలో ఏనాడూ ద్వేషం కనిపించలేదు. రాముడంటే కరుణ. ఆయన ఏనాడూ క్రూరత్వాన్ని ప్రదర్శించలేదు. రాముడంటే న్యాయం. అన్యాయం అనే దానికి ఆయన ఏనాడూ చోటివ్వలేదు… … కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ

అయోధ్య అంటే భిన్నమైన మతాలున్న పవిత్ర నగరమని అందరికీ తెలుసు. కానీ, కొన్నేళ్లుగా రామమందిర్, బాబ్రీ మసీదు
వివాదంలో చిక్కుకొన్నది. ఆ వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. దాంతో, కొన్ని రాజకీయ పార్టీలు దాని చుట్టూ
ఆడిన రాజకీయాలకు తెరపడింది… … బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి

బాల్‌థాకరే కల నెరవేరింది. … శివసేన ఎంపి సంజయ్‌రౌత్

మన ప్రాచీన వారసత్వం ఎల్లప్పుడూ భిన్నత్వంలో ఏకత్వంగా కొనసాగింది. అంతిమశ్వాస వరకూ దానిని కాపాడుకుందాం.. … బెంగాల్ సిఎం మమతాబెనర్జీ

వర్తమాన, భవిష్యత్ తరాలు మర్యాద రాముడి నిజమైన హృదయాన్ని అనుసరించి అందరి సంక్షేమం, శాంతి కోసం పాటుపడాలి… … ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్

PM Modi Address after Ram Temple puja in Ayodhya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News